ముస్లిం వ్యాపారిపై టీడీపీ దాడి
అడ్డొచ్చిన వారిపై దుర్భాషలు
ఒకరికి గాయాలు
కాకినాడ: టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ముస్లిం వ్యాపారి దుకాణాన్ని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. అడ్డొచ్చిన వారిని దుర్భాషలాడుతూ దాడికి తెగబడగా.. ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాలివీ.. కాకినాడలోని జ్యోతుల మార్కెట్ సమీపంలో కరీమ్ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఫ్యాన్సీ దుకాణం నడుపుకుంటున్నారు. టీడీపీ నేతల కన్ను అతని దుకాణంపై పడింది. ఆ దుకాణం ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడైన నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు వారం రోజులుగా కరీమ్‌ను హెచ్చరిస్తున్నాడు.
తన జీవనాధారమైన దుకాణాన్ని వదిలి వెళ్లలేనని కరీమ్ చెబుతుండటంతో శనివారం రాత్రి టీడీపీ నేత వీరు, మరో 20 మంది వ్యక్తులతో వెళ్లి ఆ దుకాణంపై దాడి చేశాడు. షాపులోని వస్తువులను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన వారిని దుర్భాషలాడుతూ మరికొందరిపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో దుకాణ యజమాని బంధువు నూర్ మహ్మద్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
బాధితుడు కరీమ్ మాట్లాడుతూ.. తన దుకాణాన్ని టీడీపీ వారి మిత్రుడైన మరో వ్యక్తికి అప్పగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, దీనిని వ్యతిరేకించిన తనపై దాడులకు తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. మహిళలని కూడా చూడకుండా తమ బంధువులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా.. చిరు వ్యాపారాలు చేస్తూ ఉపాధి పొందుతున్న వ్యక్తిపై టీడీపీ నేతలు దాడి చేయడం అన్యాయమని ముస్లిం ఆలోచనాపరుల వేదిక కో–కన్వీనర్ హసన్ షరీఫ్ పేర్కొన్నారు. మైనారీ్టలకు అండగా నిలవాల్సిన వ్యక్తులే ఇటువంటి దౌర్జన్యాలకు తెగబడటం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment