మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై కాల్పులు జరిపిన నిందితుడు విలియమ్స్
ఫ్లోరిడా : పదేళ్ల బాలిక జూమ్ క్లాస్‌లో జాయిన్ కాగానే వార్‌ఫీల్డ్ ఎలిమెంటరీలో ఆమె టీచర్ ఏదో జరగరానిది జరుగుతోందని గమనించేలోగా బాలిక తల్లి హత్యకు గురైన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో బుధవారం వెలుగుచూసింది. ఆ సమయంలో ఆన్‌లైన్ క్లాసులో లాగిన్ అవుతున్న ఇతర విద్యార్థులు భయపడకుండా ఉండేందుకు బాలికను టీచర్ మ్యూట్ చేశారు. కానీ కొద్దిసేపటికే భారీ శబ్ధాలు వినిపించడం ఆ బాలిక తన చెవులపై చేతులు వేసుకోవడం గమనించగా అంతలోనే స్క్రీన్‌పై చీకటి అలుముకుంది. సరిగ్గా జూమ్ క్లాస్ ప్రారంభం కాగానే బాలిక తల్లి మర్బియల్ రొసాడో మోరేల్స్ (32) ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ డొనాల్డ్ జే విలియమ్స్ (27) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇరువురి మధ్య ఘర్షణ తీవ్రతరం కావడంతో విలియమ్స్ మోరేల్స్‌పై నాలుగుసార్లు కాల్పులకు తెగబడ్డాడు. మోరేల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన గంటలోనే విలియమ్స్‌ను అరెస్ట్ చేసి హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు మార్టిన్ కౌంటీ షెరీఫ్ విలియం సిండర్ తెలిపారు. జూమ్ క్లాస్‌లో ఉన్న బాలికతో పాటు అదే ఇంట్లో ఉన్న మరో ఐదుగురు పిల్లలు ఈ హత్యను చూశారని పోలీసులు పేర్కొన్నారు. మోరేల్స్ ఇంట్లోకి చొరబడిన విలియమ్స్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఓ వీడియోపై ఆమెను ప్రశ్నించాడని, ఆమె నవ్వుతూ బదులిస్తుండగా ఆగ్రహంతో విలియమ్స్ ఆమెపై కాల్పులు జరిపాడని సిండర్ తెలిపారు. 2015లో విలియమ్స్ తాను దొంగిలించిన తుపాకీని తీసి మోరేల్స్‌పై పలుమార్లు కాల్పులకు తెగబడ్డాడని పేర్కొన్నారు. కాగా, జూమ్ క్లాస్ తీసుకున్న స్కూల్ టీచర్ వివరాలను పోలీసులు వెల్లడించలేదు. చదవండి : భారత సంతతి రీసెర్చర్ హత్య
Comments
Please login to add a commentAdd a comment