అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): దసరా పండుగ సెలవులను మరింత సరదాగా చేసుకుందామని ఆశపడిన ఆ యువకుల ఆలోచన ఆవిరైపోయింది... వారి స్నేహబంధాన్ని చూసి ఓర్వలేని ఆ కడలి వారిని కబళించింది... తమ పిల్లలే తమ సర్వస్వంగా బతుకుతున్న ఆ నిరుపేద తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను... గుండెశోకాన్ని మిగిల్చింది... బాపట్ల సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకుల్లో మొత్తం ఆరుగురు యువకులు మృతిచెందారు. దీంతో సింగ్‌నగర్, శాంతినగర్ ప్రాంతాలు ఆ యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చేసిన ఆర్తనాదాలతో కన్నీటి సంద్రంగా మారాయి.
చదవండి: పెళ్లయిన వ్యక్తితో సహజీవనం.. కారులో మంత్రాలయం వచ్చి..
విజయవాడ సింగ్‌నగర్ కృష్ణాహోటల్ సెంటర్‌లోని శివాలయం రోడ్డు, పైపులరోడ్డు సమీపంలోని శాంతినగర్ మస్జీద్ పరిసర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది యువకులు చెరుకూరి సాయిమధు(16), బాజం అభిలాష్(17), చింతల సాయిప్రణిదీప్(18), నల్లపు రాఘవ(16), సర్వసుద్ది వెంకట ఫణికుమార్(14), ప్రభుదాస్(17), చందాల కైలాష్(13), వసంత పరిశుద్ధ(17) ఈ నెల 4వ తేదీన బాపట్ల సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లారు. వీరిలో కైలాష్, పరిశుద్ధ మినహా మిగిలిన ఆరుగురు సముద్రం లోపలికి వెళ్లి స్నానం చేస్తూ అలల తాకిడికి గల్లంతయ్యారు.
వీరిలో చెరుకూరి సాయిమధు, బాజం అభిలాష్, చింతల సాయిప్రణిదీప్ మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. గల్లంతైన మరో ముగ్గురు సర్వసుద్ది వెంకట ఫణికుమార్, ప్రభుదాస్, చందాల కైలాష్‌ల మృతదేహాలు బుధవారం గుర్తించారు. దీంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పండుగ రోజంతా కన్నీటి సంద్రంలో మునిగారు. బుధవారం ముగ్గురికి, గురువారం ముగ్గురికి వారి వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
బాపట్ల బీచ్‌కు వెళ్లే ముందు ఎనిమిది మంది యువకులు రైలులో దిగిన సెల్ఫీ ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. రైలులో వారు సరదాగా సినిమా పాటలకు పేరడీ చేస్తూ గడిపిన క్షణాలను చూసి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. వాటిని చూసిన బంధువులు, స్థానికులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు.
మృతుల కుటుంబాలకు బాసటగా నిలిచిన ప్రజాప్రతినిధులు
శాంతినగర్, సింగ్‌నగర్ ప్రాంతాల్లో యువకుల మరణవార్తను తెలుసుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు ఉమ్మడి వెంకట్రావ్, అలంపూరు విజయలక్ష్మి వారికి బాసటగా నిలిచారు. విషయం తెలిసిన దగ్గర నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి వెంకట్రావ్, అలంపూరు విజయ్ దగ్గరుండి యువకుల తల్లిదండ్రులను బాపట్ల పంపడం, బాపట్లలో అధికారులతో మాట్లాడి వారి భౌతికకాయాలు తీసుకురావడంతో పాటు దగ్గరుండి వారి అంత్యక్రియలను నిర్వహించారు. ఎమ్మెల్యే విష్ణు, డెప్యూటీ మేయర్ శ్రీశైలజ, కార్పొరేటర్ అలంపూరు విజయ్ ఒక్కొక్కరూ రూ.5 వేల చొప్పున ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు మొత్తం ఆరుగురికి రూ.90 వేలను మట్టి ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా అందించారు.
యువకుల మరణవార్తను తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు కె.దుర్గారావు, బి.రమణారావు, దాసరి దుర్గారావు తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతిచెందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): బాపట్ల సముద్రంలో స్నానానికి వెళ్లి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. సింగ్‌నగర్, శాంతినగర్‌కు చెందిన ఆరుగురు మృతుల కుటుంబ సభ్యులను గురువారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన పరామర్శించారు. 61వ డివిజన్‌లోని సచివాలయంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆరు కుటుంబాలకు రూ.లక్షన్నర విలువైన చెక్కులను అందజేశారు. తక్షణ సాయంగా మాత్రమే తన వంతుగా ఈ సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. బాధితులందరికీ పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, నార్త్‌జోన్ తహసీల్దార్ చందన దుర్గాప్రసాద్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావ్, అవుతు శ్రీనివాసరెడ్డి, అలంపూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment