విత్ డ్రాకు అవకాశం లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు
ఇద్దరు కీలక నిందితులను విజయవాడలో అరెస్టు చేసిన టీజీ సీఎస్‌బీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ట్రేడింగ్‌లో పెట్టుబడులతో అధిక లాభాలంటూ ఆశ చూపించి ఒకరి నుంచి రూ.5.4 కోట్లు కొల్లగొట్టిన ఇద్దరిని విజయవాడలో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఆ వివరాలను టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ శనివారం మీడియాకు తెలిపారు. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌నకు సైబర్ నేరగాళ్లు జూన్ 8న ఇన్వెస్టిమెంట్ లింకు పంపారు. దీంతో లింక్ ఓపెన్ చేసి ఆ వ్యక్తి గ్రూపులో చేరాడు. ‘బీ6/ స్టాక్ విజనరీస్’ పేరుతో ఉన్న గ్రూప్‌లో లైదియశర్మ గోల్డ్‌మెన్ స్కీం గురించి వివరించింది. త్వరలో రాబోతున్న మరిన్ని ఐపీఓల గురించి తెలుసుకొని ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
పాన్‌కార్డు, ఆధార్‌కార్డుతోపాటు ఇతర వివరాలతో ఆమె చెప్పిన వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాడు. ఆపై ట్రేడింగ్ మొదలుపెట్టాడు. ప్రముఖ సంస్థలకు సంబంధించిన ట్రేడింగ్ ఆప్షన్స్ వెబ్‌సైట్‌లో పొందుపర్చగా, బాధితుడు సులువుగా నమ్మాడు. జూలై 10 నుంచి పలు దఫాలుగా నెలరోజుల్లోనే రూ.5.4 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. ఇలా వెబ్‌సైట్‌లో బాధితుడికి రూ.15.58 కోట్లు లాభం వచ్చినట్టు చూపించింది. దీంతో ఆ అమౌంట్ విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. విత్‌డ్రా సదుపాయం కల్పించాలంటే మరికొంత చెల్లించాలని సైబర్ నేరగాళ్లు బాధితుడ్ని డిమాండ్ చేశారు.
దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రాంపల్లి కొండల్‌రావు, అతని సోదరుడు చంద్రశేఖర్‌ఆజాద్‌లను విజయవాడలో అరెస్ట్ చేశారు. వీరిద్దరూ రిక్కి సాఫ్ట్‌వేర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. నిందితులు ఈ తరహా మోసాలకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలపై దేశవ్యాప్తంగా 26 ఫిర్యాదులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శిఖాగోయల్ ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment