వివరాలు వెల్లడిస్తున్న హతుడు ప్రసాద్ భార్య లక్ష్మి, పిల్లలు
అనంతపురం క్రైం: ‘మాకు ఆరుగురు పిల్లలు. అందులో నలుగురూ ఆడపిల్లలే సార్. నా భర్త సంపాదనతోనే మా కుటుంబం నడుస్తోంది. రాజీ అయ్యామని చెప్పి.. రాత్రికి రాత్రి గుంపుగా ఇంటిపై పడ్డారు. ఇంట్లో ఉన్న నా భర్త ప్రసాద్, అతని తమ్ముడు లోకేష్, నా తమ్ముడు బాబును కొట్టుకుంటూ బయటకు లాక్కెళ్లారు. చివరకు నా భర్త ప్రాణాలు తీసేశారు సార్’ అంటూ హతుడు ప్రసాద్ భార్య లక్ష్మి బోరున విలపించింది. సోమవారం ఉదయం అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.
తమ కుటుంబసభ్యులందరూ నగరంలోని గౌరీ థియేటర్ వెనుక ఉన్న కొట్టాల్లో నివాసముంటున్నట్లు తెలిపారు. ఈ నెల 6న తన మరిది లోకేష్ కుమారుడి తలనీలాలు సమర్పించేందుకు గుత్తి సమీపంలోని బాట్లో సుంకులమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా.. నీరుగంటి వీధి వద్దకు చేరుకోగానే పాముల కొట్టాలకు చెందిన కొందరు రాంగ్ రూట్‌లో ద్విచక్రవాహనంపై వస్తూ తమ వాహనాన్ని ఢీకొన్నట్లుగా తెలిపారు.
ఆ సమయంలో కాస్త నిదానంగా వెళ్లాలని తన భర్త, మరిది చెప్పారన్నారు. దీంతో వారు కేకలు వేస్తూ లోకేష్‌పై చెయ్యి చేసుకోవడంతో గొడవ మొదలైందన్నారు. ఆ తర్వాత పాముల కొట్టాలకు చెందిన తిరుపతయ్య, తదితరులు కల్పించుకుని రాజీ అవుతున్నట్లుగా చెప్పి.. రాత్రికి రాత్రి ఉన్నఫళంగా పెద్ద గుంపుగా వచ్చి ఇంట్లోకి చొరబడ్డారన్నారు. భర్త ప్రసాద్, మరిది లోకేష్, తమ్ముడు బాబును కొట్టుకుంటూ ఇంటి నుంచి బయటకు లాగారన్నారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసినా వదల్లేదని, వెంటబడి కొట్టుకుంటూ తరిమారన్నారు.
వేణుగోపాల్ నగర్ వద్ద ప్రసాద్ కిందపడిపోగా ఆస్పత్రికి తీసుకెళితే అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారని వివరించారు. ఉద్దేశపూర్వకంగా తన భర్త ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి తిరుపతయ్య, చిన్న తిరుపతయ్య, నరేంద్ర, మహేష్ తదితరులను కలుపుకుని 17 మందిపై హత్య కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment