రాష్ట్రంలో తొలి డ్రగ్స్‌ మరణం | Young Man Dies After Overdosing On Drugs In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: రాష్ట్రంలో తొలి డ్రగ్స్‌ మరణం

Published Thu, Mar 31 2022 5:08 PM | Last Updated on Fri, Apr 1 2022 2:34 AM

Young Man Dies After Overdosing On Drugs In Hyderabad - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న చందనాదీప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. మితిమీరి మాదకద్రవ్యాలు తీసుకున్న ఓ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ ప్రాణాలు కోల్పోయాడు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి నుంచి డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి, విచారించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారికంగా పోలీసు రికార్డుల్లో నమోదైన తొలి డ్రగ్స్‌ సంబంధిత మరణం ఇదేనని వెల్లడించారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్, డీసీపీ చక్రవర్తి గుమ్మి ఈ వివరాలను వెల్లడించారు. చనిపోవడానికి ముందు సదరు యువకుడి పరిస్థితిని తెలిపే వీడియోను ప్రదర్శించారు. 

డ్రగ్స్‌ పెడ్లర్‌ విచారణలో.. 
హైదరాబాద్‌లోని డీడీ కాలనీకి చెందిన ప్రేమ్‌ ఉపాధ్యాయ మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. తర్వాత డ్రగ్స్‌ విక్రయించే పెడ్లర్‌గా మారిపోయాడు. తరచూ గోవాకు వెళ్లి ఎల్‌ఎస్‌డీ, ఎక్స్‌టసీ వంటి డ్రగ్స్‌ తెచ్చేవాడు. నగరానికే చెందిన లక్ష్మీపతి అనే వ్యక్తి నుంచి గంజాయి సంబంధిత డ్రగ్‌ హష్‌ ఆయిల్‌ కొనేవాడు. సింథటిక్‌ డ్రగ్‌ పిల్స్‌ ఒక్కోటీ రూ.3 వేలకు, ఐదు గ్రాముల హష్‌ ఆయిల్‌ రూ.3 వేలకు అమ్ముతున్నాడు. ఇటీవల అలా డ్రగ్స్‌ విక్రయిస్తుండగా నల్లకుంటలో ‘హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ)’ పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర తరచూ డ్రగ్స్‌ కొనే రామకృష్ణ (సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి), నిఖిల్‌ జోష్వా (గిటార్‌ టీచర్‌), జీవన్‌రెడ్డి (బీటెక్‌ విద్యార్థి)లను అదుపులోకి తీసుకున్నారు. 

అరెస్టు చేద్దామని వెళితే..
ప్రేమ్‌ వద్ద మరో యువకుడు కూడా డ్రగ్స్‌ కొనేవాడని తెలిసి అతడి ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు షాకయ్యారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ యువకుడు మూడు రోజుల క్రితం చనిపోయాడని వారికి తెలిసింది. దీనిపై వారు ఆరా తీయగా.. సదరు యువకుడు తరచూ డ్రగ్స్‌ తీసుకునేవాడని, ప్రేమ్‌తో కలిసి గోవా పార్టీలకు వెళ్లేవాడని తెలిసింది. రెండు వారాల క్రితం గోవాలో జరిగిన పార్టీలో సదరు యువకుడు వరుసగా ఎల్‌ఎస్‌డీ, కొకైన్, ఎక్స్‌టసీ పిల్స్, హష్‌ ఆయిల్‌ వంటి డ్రగ్స్‌ తీసుకున్నాడని.. ఓవర్‌డోస్‌ కావడంతో అపస్మారక స్థితికి వెళ్లాడని బయటపడింది. కుటుంబ సభ్యులు అతను కొద్దిగా కోలుకున్నాక హైదరాబాద్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. క్లరోసిస్‌ స్ట్రోక్‌తో నరాల పటుత్వం కోల్పోయాడని, చికిత్స లేదని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. కొద్దిరోజులు మంచంపైనే ఉన్న అతను.. మూడు రోజుల క్రితం కన్నుమూశాడు. 

ఆ పార్టీలో మరికొందరు కూడా.. 
సదరు యువకుడితో పాటు గోవాలో పార్టీకి మరో ఏడుగురు కూడా వెళ్లారని సమాచారం. వారిలో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు కాగా, నలుగురు పబ్స్‌లో పనిచేసే డీజేలని తెలిసింది. వారిలోనూ కొందరు అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది. కాగా.. డ్రగ్‌ పెడ్లర్‌ ప్రేమ్‌కు హష్‌ ఆయిల్‌ను సరఫరా చేసిన లక్ష్మీపతిని పట్టుకోవడానికి పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సదరు లక్ష్మీపతి ఇప్పటికే మూడుసార్లు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యాడని.. అయినా డ్రగ్స్‌ దందా కొనసాగిస్తున్నాడని సమాచారం. 

మరో కేసులో.. మరో నలుగురు.. 
హైదరాబాద్‌లోని బాపూజీనగర్‌కు చెందిన వి.రమేశ్‌ (21) కేజీల లెక్కన హష్‌ఆయిల్‌ కొని, చిన్న బాటిళ్లలో నింపి అమ్ముతుంటాడు. దీనిపై సమాచారం అందిన పోలీసులు నిఘా పెట్టారు. గురువారం డెయిరీఫామ్‌ రోడ్డులో తిరుమలగిరికి చెందిన సాయికుమార్‌ (25), బాపూజీనగర్‌కు చెందిన నవీన్‌కుమార్‌ (29)లకు హష్‌ఆయిల్‌ విక్రయిస్తుండగా.. ‘హెచ్‌–న్యూ’, బోయిన్‌పల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. రమేశ్‌కు సహకరించిన కె.సాయిప్రకాశ్‌ (19)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25 గ్రాముల హష్‌ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద హష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసిన మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement