రబీకి పోలవరం
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో తుపానులు, వర్షాల కారణంగా ఖరీఫ్‌లో వరి దిగుబడులు పెద్దగా రాకపోవడంతో రైతులు... కౌలుదారులు రబీ సాగుపైనే ఆశలు పెట్టుకున్నారు. గోదావరి డెల్టాలో రబీ రికార్డు స్థాయిలో పండే అవకాశమున్నందున ఈ పంట కీలకంగా మారింది. ఈ ఏడాది గోదావరిలో ఇప్పటి వరకు ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉండడం... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పోలవరం స్పిల్‌వే పూర్తి చేసి నీటి నిల్వ చేసే అవకాశం కల్పించడంతో రబీ సాగునీటికి కొరత లేదు. కాని పంట కాలువల్లో పూడిక తొలగించకుంటే మాత్రం శివారుకు ఎద్దడి తప్పదని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న గోదావరి డెల్టా అధికారిక ఆయకట్టు 10.13 లక్షల ఎకరాలు ఉండగా, దీనిలో 8,96,507 ఎకరాల వరి సాగు చేస్తారు. తూర్పు డెల్టాలో 2,64,507, మధ్య డెల్టాలో 1,72,000, పశ్చిమ డెల్టాలో 4,60,000 ఎకరాలు. కాని వాస్తవ వరిసాగు సుమారు 7.50 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. డెల్టాలో ఖరీఫ్‌తో పోలిస్తే రబీపైనే రైతులు అధికంగా ఆశలు పెట్టుకుంటున్నారు. ఖరీఫ్ సగటు దిగుబడి 29 బస్తాలు (21.75 క్వింటాళ్లు) కాగా, రబీలో 45 బస్తాలు (33.75 క్వింటాళ్లు). చాలా ప్రాంతాల్లో 50 బస్తాల నుంచి 55 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. వర్షాలు, తుపానుల వల్ల ఖరీఫ్ తరచూ దెబ్బతింటుండగా, రబీకి విపత్తుల వల్ల పెద్దగా ప్రమాదం లేదు. ఈ కారణంగానే డెల్టా శివారుల్లో ఖరీఫ్ సాగును రైతులు వదిలేస్తున్నారు.
పోలవరం స్పిల్ వే ను పూర్తి చేయడంతో..
గోదావరి డెల్టాలో రబీసాగు స్థానికంగానే కాదు.. రాష్ట్ర ధాన్యాగారాన్ని సైతం నింపుతోంది. రబీ సీజన్‌లో సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోంది. రైతుల కన్నా కౌలుదారులకు ఈ సాగు మరీ కీలకం. వారికి సొమ్ము మిగిలేది ఈ పంటలోనే. డెల్టాలో 2009 నుంచి 2019 వరకు రబీ నీటి ఎద్దడికి గురి కావడం పరిపాటిగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న పోలవరం స్పిల్ వే ను పూర్తి చేయడంతో డెల్టాలో ఇప్పుడా పరిస్థితి లేకుండా ఉంది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చేసరికి పోలవరం స్పిల్ వే మొండి గోడల మీద ఉంది. చంద్రబాబు కేవలం ఒక గేట్ వేలాడదీసి వదిలేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తరువాత 48 గేట్లు ఏర్పాటు చేసి స్పిల్ వే నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఇక్కడ నీటి నిల్వను చేసే అవకాశం కలిగింది. పోలవరం వద్ద ప్రస్తుతం 30.50 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయవచ్చు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు కావడం వల్ల చాలా తక్కువ నీటిని నిల్వ ఉంచుతున్నారు. స్పిల్‌వే వద్ద ఐదవ పిల్లర్ నుంచి 14వ పిల్లర్ వరకు ఉన్న పది స్కవర్ స్లూయిజ్‌లు ఏర్పాటు చేసినందున అవసరమైతే డెడ్‌స్టోరేజ్ వరకు నీరు వదిలే అవకాశముంది.
గోదావరి డెల్టాలో నీటికి ఢోకా లేదు
సుమారు 8.96 లక్షల
ఎకరాల వరి ఆయకట్టు
కావాల్సిన నీరు 91.35 టీఎంసీలు
సీలేరు నుంచి వచ్చేది 67.90 టీఎంసీలు
పోలవరం వద్ద నిల్వ 14 టీఎంసీలు
సహజ జలాలు ఫిబ్రవరి వరకు
9.45 టీఎంసీలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
పోలవరానికి గేట్లు
14 టీఎంసీలు మించి అదనంగా
నిల్వ చేసుకునే సామర్థ్యం
సరిపడా నీటి లభ్యత
ఈ ఏడాది సాగునీటి పారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారం రబీ సాగుకు 91.35 టీఎంసీల నీరు అవసరం. సీలేరు పవర్ జనరేషన్ నుంచి రోజుకు 4,300 క్యూసెక్కుల చొప్పున రబీ కాలంలో 44.95 టీఎంసీల నీటి లభ్యత ఉండనుంది. ఇక అత్యవసర సమయంలో బైపాస్ పద్ధతిలో 22.95 టీఎంసీలు సేకరించవచ్చు. మొత్తం 67.90 టీఎంసీలు. సహజ జలాల లభ్యత 9.45 టీఎంసీలు కాగా, పోలవరంలో 14 టీఎంసీలు ఉంటుందని లెక్కలు కట్టారు. ఇలా మొత్తం 91.35 వస్తోందంటున్నారు. కాని వాస్తవంగా పోలవరంలో మరింత నీటిని నిల్వ చేసే అవకాశంతోపాటు సహజ జలాల లభ్యతను అధికారులు కనిష్ఠంగా నమోదు చేస్తున్నారు. ఈ రెండు అదనంగా వస్తే రబీ అవసరాలకు మించి నీటి లభ్యత ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment