రత్నగిరిపై సిరుల వాన
● సత్యదేవునికి రికార్డు స్థాయి రాబడి
● హుండీల ద్వారా 30 రోజులకు రూ.1.33 కోట్ల ఆదాయం
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరిపై సిరుల వాన కురిసింది. అన్ సీజన్ అయినప్పటికీ దండిగా రాబడి వచ్చింది. గడచిన 30 రోజులకు రికార్డు స్థాయిలో రూ.1,33,16,044 ఆదాయం సమకూరింది. దేవస్థానంలోని హుండీలను గురువారం తెరచి, భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ.1,27,31,994, చిల్లర నాణేలు రూ.5,84,050 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. వీటితో పాటు బంగారం 62.200 గ్రాములు, వెండి 525.700 గ్రాముల చొప్పున లభించాయి.
దండిగా విదేశీ కరెన్సీ
హుండీల ద్వారా సత్యదేవునికి పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 369, సింగపూర్ డాలర్లు 50, యుఏఈ ధీరామ్స్ 30, ఆస్ట్రేలియన్ డాలర్లు 100, సౌదీ అరేబియా రియల్స్ 5, జపాన్ నిప్పోన్ జింకాలు 1,000, ఇండోనేషియా రూపాయలు రూ.1.20 లక్షలు, మలేషియా రింగిట్స్ 5, ఇంగ్లండ్ పౌండ్లు 65, కువైట్ దీనార్లు 10 చొప్పున భక్తులు హుండీల్లో వేశారు.
అన్ సీజన్లోనూ అధిక ఆదాయం
సాధారణంగా రత్నగిరిపై కార్తికం అనంతరం మార్గశిరం, పుష్య మాసాలను అన్ సీజన్‌గా భావిస్తారు. ఈ మాసాల్లో పెద్దగా వివాహాలు జరుగవు. భక్తులు కూడా అంతగా రారు. ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల భక్తులు మాత్రమే వస్తూంటారు. అయినప్పటికీ ఈసారి హుండీ ఆదాయం అధికంగానే రావడం గమనార్హం. కార్తిక మాసం అనంతరం గత డిసెంబర్ 30వ తేదీన హుండీల ఆదాయం లెక్కించారు. తరువాత మళ్లీ ఇప్పుడు లెక్కించారు. ఈ 30 రోజులు పూర్తిగా పుష్య మాసం కావడం గమనార్హం. అయితే సంక్రాంతి సెలవుల్లో సత్యదేవుని సన్నిధికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సాధారణ రోజుల్లో సైతం రోజుకు కనీసం 20 వేలకు తగ్గకుండా భక్తులు వచ్చారు. దీంతో అధిక మొత్తంలో ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. హుండీల ద్వారా గడచిన 30 రోజుల్లో సగటున రోజుకు రూ.4,43,868 చొప్పున ఆదాయం లభించిందని వివరించారు. హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం, పలు స్వచ్ఛంద సంస్థల సిబ్బంది కూడా పాల్గొన్నారు. హుండీల్లో వచ్చిన నగదును స్థానిక యూనియన్ బ్యాంకుకు తరలించి భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment