వనమాడిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోండి | Sakshi
Sakshi News home page

వనమాడిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోండి

Published Mon, May 6 2024 10:50 AM

వనమాడిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోండి

కాకినాడ: మత్స్యకారులకు దక్కాల్సిన రూ.వెయ్యి కోట్ల ఓఎన్జీసీ పరిహారాన్ని సొంత ఖాతాకు మళ్లించి స్వాహా చేశానంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) చేసిన నిరాధారమైన ఆరోపణలపై వెంటనే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పోలీసులను కోరారు. ఈ మేరకు కాకినాడ త్రీటౌన్‌ సీఐ కృష్ణభగవాన్‌కు పార్టీ ముఖ్య నేతలతో కలసి ఆదివారం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ, ఓఎన్జీసీ వల్ల నష్టపోతున్న మత్స్యకారులకు నష్టపరిహారం ఇప్పించాలన్న ఉద్దేశంతో పోరాటం చేశానన్నారు. ఈ విషయంలో మత్స్యకారులకు అండగా నిలవాల్సిందిపోయి వారికి రావాల్సిన రూ.వెయ్యి కోట్ల సొమ్మును తన సొంత ఖాతాలకు మళ్లించారంటూ కొండబాబు పదేపదే ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీనిపై ఓఎన్జీసీ, మత్స్యశాఖ ఉన్నతాధికారులకు సమాచార హక్కు చట్టం కింద తాను దరఖాస్తు చేశానన్నారు. తన లేఖకు సమాధానమిస్తూ మత్స్యకారులకు పరిహారం నిధులు విడుదల కాలేదని, ఒకవేళ విడుదలైనప్పటికీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు మాత్రమే జమ అవుతుందే తప్ప వ్యక్తిగతంగా వేసే అవకాశం లేదని తెలియజేస్తూ సమాధానమిచ్చారని వివరించారు. దీనినిబట్టి రాజకీయ లబ్ధి కోసం కొండబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. ఒక మత్స్యకార వర్గానికి చెందిన నాయకుడిగా వారి ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి, ఆ వర్గానికి నష్టం కలిగించే విధంగా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. ఎన్నికలపై కూడా ప్రభావం చూపించాలనే ఉద్దేశంతో కొండబాబు పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న వనమాడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఎన్నికల అనంతరం ఓఎన్జీసీ నివేదిక రప్పించి, మత్స్యకారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. కొండబాబుపై తక్షణమే క్రిమినల్‌ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల ప్రతి స్పందనను బట్టి అవసరమైతే పరువు నష్టం దావా కూడా వేస్తానని ద్వారంపూడి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ డిప్యూటీ మేయర్‌ చోడిపల్లి సత్యప్రసాద్‌, మాజీ కార్పొరేటర్‌ భీమరాజు, హెచ్‌ఎంఎస్‌ అధ్యక్షుడు అంకాడి సత్తిబాబు, మత్స్యకార నాయకులు పంతాడి బ్రహ్మానందం, పలువురు మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ ఓఎన్జీసీ ఇచ్చే పరిహారంపై దుష్ప్రచారం

ఫ అవసరమైతే పరువు నష్టం దావా వేస్తా

ఫ పోలీసులకు ద్వారంపూడి ఫిర్యాదు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement