జీతాలు ఇప్పించండి డిప్యూటీ సీఎం సర్..
● గడ్డితింటూ అర్ధనగ్న ప్రదర్శన చేసిన
సత్యసాయి డ్రింకింగ్ ప్రాజెక్టు సిబ్బంది
రాజమహంద్రవరం రూరల్: 16 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలంటూ లాలాచెరువులోని ఆర్‌డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం వద్ద శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై, మెయింటెనెన్స్ వర్కర్లు మూడోరోజు శనివారం వినూత్నంగా నిరసన చేపట్టారు. డీప్యూటీ సీఎం, గ్రామీణ నీటి సరఫరా శాఖమంత్రి పవన్‌కళ్యాణ్ చిత్రాలను చేతపట్టి, జీతాలు లేక గడ్డి తినే పరిస్థితి వచ్చిందంటూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టమూరి వీరబాబు, యు.ఇస్సాక్ మాట్లాడుతూ 16 నెలలుగా 53 మంది కార్మికులకు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆరోపించారు. సీఐటీయూ నాయకులు ఎస్‌ఎస్ మూర్తి మాట్లాడుతూ కార్మికులకు వెంటనే 16 నెలలు జీతాల చెల్లింపుతో పాటు, 25 నెలలుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో యూనియన్‌నేతలు పాలాడి శ్రీనివాస్, ఇజ్జన శ్రీనివాస్, సిఐటియు నాయకులు రామచంద్రరావు, కార్మికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కాగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వారి వద్దకు వచ్చి చర్చించి అనంతరం ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment