ప్రత్యామ్నాయ పంటలు పండించాలి
● జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు
● ప్రత్యామ్నాయ సాగుపై పొగాకు
రైతులకు శిక్షణ
దేవరపల్లి: పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు సూచించారు. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల్లోని పొగాకు రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన పోషకాహార భద్రత పథకంలో భాగంగా పొగాకు పైరుకు ప్రత్యామ్నాయ పంటలు, 365 రోజులూ పచ్చదనం–పంట మార్పిడి సేద్యంపై శుక్రవారం అవగాహన, శిక్షణ నిర్వహించారు. పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ అధ్యక్షతన దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద జరిగిన ఈ సదస్సులో మాధవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పొగాకు కరోనా కంటే ప్రమాదకరమైనదని అన్నారు. సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల సమస్య, క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. పొగాకు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని, ఎగుమతులు ఉంటేనే ఇది లాభసాటి పంట అని వివరించారు. పొగాకును పరిమిత విస్తీర్ణంలో సాగు చేసి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు. అన్ని పంటలకూ జిల్లా అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. పంటల సరళిలో మార్పు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఒకే పంట కాకుండా నాలుగైదు పంటలు వేసుకుంటే గిట్టుబాటు ధర వస్తుందన్నారు. నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న, ఆయిల్‌పామ్, అపరాల వంటి పంటలు వేసుకోవాలని, అపరాలకు మార్కెట్లో మంచి ధర ఉందని చెప్పారు. పొగాకు ఆంక్షలతో కూడిన పంట అని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయని, భవిష్యత్తులో ఈ పంటకు ముప్పు కలుగుతుందని చెప్పారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాధవరావు రైతులకు సూచించారు.
అధిక దిగుబడులు సాధించాలి
పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ మాట్లాడుతూ, పొగాకు సాగు విస్తీర్ణం పెంచకుండా నాణ్యమైన అఽధిక దిగుబడులు సాధించాలని సూచించారు. 2024–25 పంట కాలానికి 58.25 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇచ్చామని, బ్యారన్‌కు 41 క్వింటాళ్లు పండించాలని తెలిపారు. ప్రపంచ దేశాలు పొగాకు సాగు నుంచి బయటకు వస్తున్నాయని, ఈ పంటకు ఆదరణ లేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వినియోగం పెరగలేదని, గత ఏడాది పలు దేశాల్లో పంట ఉత్పత్తి తగ్గినందున మన పొగాకుకు డిమాండ్ ఏర్పడిందని వివరించారు. ఆహార పంటల సాగుకు రైతులు ముందడుగు వేయాలని సూచించారు.
లాభసాటిగా మొక్కజొన్న పంట
రాజమహేంద్రవరం ఏరువాక కేంద్రం సమన్వయకర్త సీహెచ్ నరసింహారావు మాట్లాడుతూ, మొక్కజొన్న, మినుము, పెసర, చిరుధాన్యాల పంటలు లాభసాటిగా ఉన్నాయని అన్నారు. అధిక దిగుబడులు వచ్చే హైబ్రీడ్ వంగడాలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఎకరాకు రూ.లక్ష ఆదాయం వస్తోందన్నారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా వీటిని సాగు చేసుకోవాలని సూచించారు. పామాయిల్, కొబ్బరి లాభసాటిగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రబీ సాగుకు అనువైన వరి రకాల కరపత్రాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment