కార్యకర్తలపై దాడులను సహించం
● ఆస్తులు విధ్వంసం చేస్తే ఊరుకోం
● మాజీ హోం మంత్రి తానేటి వనిత
నల్లజర్ల: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడినా, వారి ఆస్తులను విధ్వంసం చేసినా చూస్తూ ఊరుకోబోమని మాజీ హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు. నల్లజర్లలో వైఎస్సార్ సీపీ నాయకుడు వల్లూరి శేషగిరిరావు ఇంటి ముందు 2 సెంట్ల భూమిలో నిర్మించుకున్న ధాన్యం గిడ్డంగిని స్థానిక పంచాయతీ అధికారులతో టీడీపీ నాయకులు ఆదివారం ఉదయం కూలగొట్టించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వనిత నల్లజర్ల వచ్చి బాధిత నాయకుడిని కలుసుకుని, వివరాలు అడిగి తెలుసుకున్నారు. నోటీసు ఇచ్చి, దానికి సమాధానం ఇచ్చేలోపే 24 గంటలు గడవక ముందే ధాన్యం గోడౌన్‌ను కూలగొట్టారని శేషగిరి ఆమెకు వివరించారు. గత 24 సంవత్సరాలుగా ఆ స్థలం తమ ఆధీనంలోనే ఉందన్నారు. ఈ భూమికి 2004లో రెవెన్యూ శాఖ పట్టా మంజూరు చేసిందన్నారు. గత మే నెల 5న అప్పటి హోం మంత్రి తానేటి వనితపై నల్లజర్లలో మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, ఆయన అనుచరులు దాడి చేసిన సంఘటనలో ప్రధాన సాక్ష్యం చెప్పినందుకు తనపై కక్ష పూరితంగా వ్యవహరించి, ఈ చర్యకు పాల్పడ్డారని వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వనిత మాట్లాడుతూ, 20 సంవత్సరాలుగా శేషగిరి ఆధీనంలో ఉన్న భూమిలో షెడ్డు కూలగొట్టడం కక్షపూరితమేనన్నారు. ఈ స్థలంపై ఆయన హక్కు ఉందా, లేదా అని ప్రశ్నించారు. ఇలా ఏదో ఒక సాకుతో కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గగ్గర శ్రీనివాస్, నాయకులు వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం, బంక అప్పారావు, కారుమంచి రమేష్, అప్పసాని నారాయుడు, ముప్పిడి వెంకటరత్నం, రాయుడు విజయకుమార్, మేణ్ణి యువరాజు, అచ్యుతనాగు, కంకిపాటి లక్ష్మణరావు, రవికుమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment