ఉచితంగాదోపిడీ | - | Sakshi
Sakshi News home page

ఉచితంగాదోపిడీ

Published Mon, Nov 11 2024 2:05 AM | Last Updated on Mon, Nov 11 2024 2:05 AM

ఉచితం

ఉచితంగాదోపిడీ

సొమ్ము ఇచ్చుకో.. ఇసుక పట్టుకో!

అఽధికారుల సమక్షంలోనే దళారీల దందా

లారీ ఇసుకకు రూ.5 వేలు అ‘ధనం’

డబ్బులిస్తేనే ట్రాక్టర్లకు లోడింగ్‌

పెరవలి: ప్రభుత్వ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఉచిత ఇసుక.. దళారీలకు కాసులు కురిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు. దీంతో వారి కళ్లెదుటే లారీ డ్రైవర్ల నుంచి అక్రమార్కులు అదనపు సొమ్ము గుంజుకుంటున్నారు. ఇసుక గుట్టల వద్ద 20 టన్నుల లారీ ఇసుకను రూ.6,500కు అమ్ముకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అమ్మకాలకు పొంతన లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పెరవలి మండలం కానూరు–పెండ్యాల, తీపర్రు ఇసుక ర్యాంపుల్లో ఈ తంతు యథేచ్ఛగా సాగుతోందని చెబుతున్నారు.

అధికారిక రేటు ఎంతంటే..

జిల్లాలో ఇసుక లభ్యత ఉన్న 17 ఓపెన్‌ రీచ్‌లను అధికారులు గుర్తించారు. వీటికి టెండర్లు పిలిచి, తక్కువకు కోట్‌ చేసిన వారికి ఆయా రీచ్‌లు అప్పగించారు. ఇసుక ఉచితం కాగా, బాట, లోడింగ్‌ చార్జీలను ఒక్కో రీచ్‌కు ఒక్కో రకంగా జిల్లా అధికారులు ధరలు నిర్ణయించారు. కానూరు–పెండ్యాల ర్యాంప్‌ వద్ద రూ.68.96, తీపర్రు–2లో రూ.96.02, జీడిగుంట ర్యాంప్‌లో రూ.81.32గా ఈ ధరలు ప్రకటించారు. దీని ప్రకారం 20 టన్నుల లారీ ఇసుకకు కానూరు–పెండ్యాల ర్యాంప్‌లో రూ.1,380, తీపర్రు ర్యాంప్‌లో రూ.1,921 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది.

ఎంత వసూలు చేస్తున్నారంటే..

బాట, లోడింగ్‌ చార్జీలనే అవకాశంగా తీసుకుని ఇసుక అక్రమార్కులు అదనపు వసూళ్లకు తెర తీశారు. అధికారులు నిర్ణయించిన ధర ప్రకారం 20 టన్నుల లారీకి రూ.1,921 మాత్రమే చెల్లించాల్సి ఉండగా.. కాంట్రాక్టర్లు నియమించిన వ్యక్తులు అదనంగా రూ.4,579 కలిపి మొత్తం రూ.6,500 చొప్పున గుంజుతున్నారు. అధికారిక ధర కంటే నాలుగు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇదేమిటని ఎవరైనా లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తే.. ఇసుక లేదనే జవాబు కాంట్రాక్టరు నుంచి వస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో లారీ డ్రైవర్లు అదనంగా చెల్లించి ఇసుక తీసుకుని వెళ్తున్నారు. తీపర్రు ఇసుక ర్యాంప్‌లో శనివారం ఇసుక అమ్మకాలు ప్రారంభించడంతో ఉదయం నుంచి సాయంత్రానికి 60 లారీల ఇసుక ఎగుమతి చేశారు. ఒక్కో లారీకి అదనంగా రూ.4,579 చొప్పున 60 లారీలకు కలిపి ఈ ఒక్క రోజే రూ.2,74,740 దండుకున్నారు. లారీల సంఖ్య పెరిగే కొద్దీ అక్రమార్కులు దండిగా సొమ్ము చేసుకోనున్నారు.

డబ్బులిస్తేనే ట్రాక్టర్లకు లోడింగ్‌

ఇసుక రీచ్‌ల్లో ట్రాక్టర్ల ద్వారా ఎవ్వరైనా ఇసుక ఉచితంగా తీసుకు వెళ్లవచ్చని, ఎవరైనా అడ్డుకుంటే క్షమించేది లేదని ఈ ర్యాంపులను శనివారం సందర్శించిన జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి హెచ్చరించారు. ఉచిత ఇసుక అనేది ప్రభుత్వ లక్ష్యమని, దీనికి ఎవరు అడ్డం వచ్చినా కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు. కానీ, తీపర్రు, కానూరు–పెండ్యాల ఇసుక ర్యాంప్‌లలో ట్రాక్టర్లకు ఇసుక ఎగుమతి చేయడం లేదు. దీంతో, ఇసుక అవసరమైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కావాలంటే కొనుగోలు చేయాల్సిందేనంటూ ర్యాంప్‌లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా నిరోధిస్తున్నారు. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పగలు అధికారికం.. రాత్రి అనధికారికం..

ఇసుక రీచ్‌లలో కేవలం ట్రాక్టర్లతోనే స్టాక్‌ పాయింట్లకు ఇసుక తరలించాలనే నిబంధనను కాంట్రాక్టర్లు గాలికి వదిలేశారు. రాత్రి వేళల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. కానూరు–పెండ్యాల, జీడిగుంట ర్యాంప్‌లలో పగలంతా అధికారికంగా ట్రాక్టర్లతో ఇసుకను స్టాక్‌ పాయింట్లకు తరలిస్తున్నారు. రాత్రయ్యేసరికి యంత్రాలు పెట్టి, లారీలతో యథేచ్ఛగా ఇసుక తోలకాలు జరుపుతున్నారు. దీనిని స్థానికులు అడ్డుకున్నా అధికారులు మాత్రం ఏమీ లేదంటూ వచ్చిన లారీలను వదిలివేస్తున్నారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల కళ్లుగప్పి..

జిల్లా కలెక్టర్‌ శనివారం ర్యాంప్‌లలో తనిఖీలు చేసిన సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక తవ్వకం చార్జీలు తప్ప ఎక్కువ వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ఆమె, అధికారులు ఇలా వెళ్లారో లేదో.. కాంట్రాక్టర్లు వెంటనే లారీల వద్ద 20 టన్నులకు రూ.6,500 వసూలు మొదలు పెట్టేశారు. అంతేకాకుండా శనివారం రాత్రి జీడిగుంటలో పొక్లెయిన్లు, లారీతో ఇసుక తవ్వకాలు జరిపారు. ఇలా 10 లారీలు వస్తూంటే గ్రామస్తులు అడ్డుకుని, అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సెలవులో ఉన్నానని చెప్పారని అంటున్నారు. తహసీల్దార్‌ వచ్చి తనిఖీలు చేసి, ఆ లారీలు ఖాళీవని ధ్రువీకరించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ర్యాంప్‌లలో ప్రతి రోజూ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, రాత్రుళ్లు తోలకాలు జరుపుతూంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపిస్తున్నారు. సాయంత్రం 6 గంటల తరువాత ఎటువంటి ఇసుక తోలకాలు, తవ్వకాలు జరపకూడదనే ఆదేశాలున్నా కాంట్రాక్టర్లు నిబంధనలు గోదాట్లో తొక్కి మరీ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఇలా తవ్విన ఇసుకను గుట్టల్లో వేయకుండా, లారీలకు లోడ్‌ చేసి, అధిక ధరలకు అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు.

ఇంత దారుణమా?

ప్రభుత్వం చెప్పిన ధరలకు ఇసుక పాయింట్ల వద్ద ఎగుమతి చేయటం లేదు. లారీకి అదనంగా రూ.5 వేలు తీసుకుంటున్నారు. ఇవ్వనంటే ఇసుక ఎగుమతి చేయ డం లేదు. ఇంత దారుణం ఎక్కడా, ఎప్పుడూ చూడలేదు.

– ఆర్‌.గణేష్‌, లారీ డ్రైవర్‌, భీమవరం

నిలువు దోపిడీ చేస్తున్నారు

కాంట్రాక్టర్‌ మనుషులు అడిగిన సొమ్ము చెల్లించకపోతే ఇసుక ఇవ్వటం లేదు. రోజంతా పడిగాపులు కాయాల్సి వస్తోంది. సొమ్ము ఎంత ఎక్కువ ఇస్తే అంత ముందుగా లోడ్‌ చేస్తున్నారు. ఇసుక కోసం ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. నిలువు దోపిడీ చేస్తున్నారు.

– వి.సురేష్‌, లారీ డ్రైవర్‌, విజ్జేశ్వరం

No comments yet. Be the first to comment!
Add a comment
ఉచితంగాదోపిడీ1
1/3

ఉచితంగాదోపిడీ

ఉచితంగాదోపిడీ2
2/3

ఉచితంగాదోపిడీ

ఉచితంగాదోపిడీ3
3/3

ఉచితంగాదోపిడీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement