టిఫిన్ కోసం వెళ్లి.. మృత్యు ఒడికి..
● లారీ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
● లాలాచెరువులో ఘటన
రాజమహేంద్రవరం రూరల్: టిఫిన్ తినేందుకు వెళుతున్న ఇద్దరు యువకులను లారీ బలిగొంది. లాలాచెరువు స్పిన్నింగ్ మిల్లు సమీపంలో శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం దానవాయిపేటకు చెందిన చుగాని మోహిత్ (19) రైట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన (ప్రస్తుతం హైదరాబాద్ ప్రగతి నగర్) గుటూరి వెంకన్న ఎలియాస్ అశ్విన్ (24) ప్రైవేటుగా ఆన్‌లైన్ జాబ్ చేస్తూ దానవాయిపేటలోనే ఉంటున్నాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరూ స్నేహితులయ్యారు. వారం రోజులుగా మోహిత్, వెంకన్న కంబైన్డ్ స్టడీ చేస్తున్నారు. శనివారం రాత్రి చదువుకున్న తర్వాత టిఫిన్ చేసేందుకు వెంకన్న బైక్‌పై దివాన్ చెరువు బయలుదేరారు. లాలాచెరువు స్పిన్నింగ్ మిల్లు వద్దకు వచ్చేసరికి ఎటువంటి సిగ్నల్ లేకుండా ఓ లారీ వేగంగా వచ్చి వీరిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన మోహిత్, వెంకన్నలను 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, ఎస్సై అంకారావు పరిశీలించారు. మోహిత్ తండ్రి రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్కగానొక్క కుమారుడు
తమ ఒక్కగానొక్క కుమారుడు మోహిత్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో రాజేష్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసి, ప్రయోజకుడు అవుతాడనుకున్న కుమారుడు ఇలా దూరమవుతాడని ఊహించలేదని రోదిస్తున్నారు. వెంకన్నకు తల్లిదండ్రులు, చెల్లి ఉన్నా రు. ఎదిగివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాడ పడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
హెల్మెట్ ధరించి ఉంటే..
మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎంతగా చెబుతున్నా యువత పట్టించుకోవ డం లేదు. మోహిత్, వెంకన్న విషయంలోనూ ఇదే జరిగింది. హెల్మెట్లు ధరించి ఉంటే వీరు ప్రమాదం నుంచి బయటపడేవారని చూసిన వారంతా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment