ప్రకృతి చెక్కిన అందాల చిత్రం
శివోహం
ఈ జలపాతాల దిగువన సాక్షాత్తూ మహాశివుడే లింగరూపుడై కొలువై ఉండటం మరో విశేషం. జలపాతంలో స్నానమాచరించిన భక్తులు.. అనంతరం భారీ రాతి బండల నడుమ గుహలో ఉన్న శివలింగాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ధారపల్లి జలపాతం వద్ద శివలింగం పైభాగంలో రాళ్లకు ఉండే సుద్దను విబూదిగా ధరిస్తారు. ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి శివుడిని దర్శించుకుంటే సకల పాపాలూ హరిస్తాయని నమ్ముతారు.
రాచపల్లిలోని ఆంధ్ర అరుణాచల క్షేత్రం
ప్రకృతి గీసిన ఆ అందాల చిత్రాన్ని చూస్తే ఎవ్వరైనా చిత్తరువు కావాల్సిందే. అప్పటి వరకూ మనసులో ఉన్న అన్ని అలజడులనూ మరచిపోయి.. సంభ్రమంతో అక్కడి ఆనందజలపాతాల్లో మునిగి తేలాల్సిందే. ఎత్తయిన కొండలు.. వాటిపై దట్టంగా అలముకున్న వనాలు.. జలజలా ప్రవహిస్తూ, ఎత్తు నుంచి కిందకు దూకుతూ.. సహజసిద్ధంగా జాలువారే జలపాతాలు.. ఇటువంటి అందాల ప్రకృతి ఒడిలో అందంగా ఒదిగిపోయిన చూడముచ్చటైన ప్రాంతానికి చిరునామా ధారపల్లి అటవీ ప్రాంతం.
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని బురదకోట గ్రామ పంచాయతీ పరిధి ధారపల్లి, ఎరకంపాలెం, తోటపల్లి అటవీ ప్రాంతాలు ప్రకృతి అందాలకు నెలవులు. ఆకాశం నుంచి శివుని శిరస్సు పైకి దూకిన గంగమ్మ.. అక్కడి నుంచి హిమ శిఖరాల మీదుగా నేల మీదకు చేరినట్లు.. దారపల్లి, ఎరకంపాలెం జలపాతాలు గంగావతరణ ఘట్టాన్ని గుర్తుకు తెస్తూంటాయి. ఇవి కార్తిక వన విహారానికి కేంద్రాలుగా ఉన్నాయి. మొన్నటి వరకూ ప్రచారానికి దూరంగా.. స్థానికులు మాత్రమే సేద తీరే ప్రాంతంగా మిగిలిపోయిన ఈ జలపాతాలు.. కొన్నేళ్లుగా పర్యాటకుల్ని, ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం కార్తిక మాసం కావడంతో జిల్లా నలుమూలల నుంచీ తరలి వస్తున్న యాత్రికులతో ఈ అటవీ ప్రాంతం, ఇక్కడి జలపాతాలు సందడిగా మారుతున్నాయి.
ధారపల్లి
చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు.. పక్షుల అరుపులు తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేని ప్రాంతం ధారపల్లి. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని, పర్యాటకులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుందీ ప్రాంతం. ఇక్కడ కొండ వాలులో ఎంతో ఎత్తు నుంచి వస్తున్న ప్రవాహమే.. జలపాతమై.. స్వచ్ఛమైన నీటితో పరవళ్లు తొక్కుతూ కిందకు దూకుతూ.. సందర్శకులకు కనువిందు చేస్తుంది. పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు ఈ అందాల ప్రదేశం మధురానుభూతిని పంచుతుంది. కనువిందు చేసే దారపల్లి అందాలను తిలకించే యాత్రికుల సంఖ్య రోజు రోజుకూ రెట్టింపవుతోంది. గతంలో మహాశివరాత్రి, కార్తిక వన సమారాధనలకు మాత్రమే పరిమితమైన ఈ ప్రాంతం.. ప్రస్తుతం నిత్యం సందర్శకులతో కళకళలాడుతోంది. జిల్లా నలు మూలల నుంచే కాకుండా రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు ఇక్కడకు తరలి వచ్చి.. ఇక్కడే వంటలు చేసుకొని.. సాయంత్రం వరకూ హరిత వనాల్లో ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. ప్రత్తిపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారికి 18, అన్నవరానికి 35, కాకినాడకు 65 కిలోమీటర్ల దూరంలో దారపల్లి ఉంది. ఉత్తరకంచి గ్రామం వరకూ రహదారి ఉన్నా అక్కడి నుంచి ధారపల్లి వరకూ రోడ్డు అత్యంత అధ్వానంగా ఉండేది. పెద్దిపాలెం నుంచి కిత్తుమూరిపేట వరకూ ఉన్న ఐదు కిలోమీటర్లు రహదారిని పునర్నిర్మించారు. ఉత్తరకంచి – పెద్దిపాలెం, కిత్తుమూరిపేట – ధారపల్లి మధ్య రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. దీనిని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి పర్యాటకులు మరింతగా పెరుగుతారు.
ఎరకంపాలెం
ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అందాల ప్రాంతం ఎరకంపాలెం. ఇక్కడి మల్లిఖార్జునలొద్దులో ఉన్న జలపాతం ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటుంది. అన్నవరానికి 36, కాకినాడకు 66 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. పెద్దిపాలెం నుంచి ఇ.గోకవరం మీదుగా ఎరకంపాలెం చేరుకోవచ్చు.
ఆధ్యాత్మిక కేంద్రంగా..
ప్రత్తిపాడు మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరాన.. జాతీయ రహదారిపై రాచపల్లి అడ్డురోడ్డు నుంచి కిలోమీటర్ దూరంలో నెలకొల్పిన శ్రీరమణా సేవాశ్రమంలో అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రా అరుణాచలంగా.. ప్రముఖ ఆధ్య్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. మూడున్నర దశాబ్దాలుగా రమణ తత్వాన్ని బోధిస్తున్న శ్రీరమణ సేవాశ్రమం అనేక మందిని ఆధ్యాత్మిక మార్గాన నడిపిస్తోంది. ఆంధ్రా అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ప్రస్తుత కార్తిక మాసంలో ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది. ఇక్కడి నుంచి మరో 15 కిలోమీటర్ల దూరంలో తోటపల్లి అటవీ ప్రాంతంలో నెలకొల్పిన శ్రీశాంతి ఆశ్రమం ఆధ్యాత్మికత, సేవాతత్వానికి పెట్టింది పేరుగా నిలిచింది. ఇక్కడకు కొన్ని దశాబ్దాలుగా నిత్యం యాత్రికులు తరలి వచ్చి, తరిస్తూంటారు.
తోటపల్లి జలపాతం వద్ద సందర్శకులు
చూడచక్కని ధారపల్లి జలపాతం
మైమరపించే వనసౌందర్యం
చూడచక్కని జలపాతాలు
భక్తిభావాన్ని పెంపొందించే
ఆంధ్రా అరుణాచల క్షేత్రం
కార్తిక వన విహారానికి కేంద్రంగా
దారపల్లి అటవీ ప్రాంతం
అధిక సంఖ్యలో తరలి వస్తున్న
సందర్శకులు
తోటపల్లి
ఈ ప్రాంతంలోనే ఉన్న మరో ప్రకృతి సౌందర్య ఖని తోటపల్లి. ఇక్కడి జలపాతం కూడా సందర్శకులను కట్టిపడేస్తుంది. ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి నుంచి 17, అన్నవరానికి 33, కాకినాడకు 64 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. ప్రత్తిపాడు నుంచి శాంతి ఆశ్రమం మీదుగా తోటపల్లి జలపాతానికి చేరుకోవచ్చు.
ఆకట్టుకునే జలాశయాలు
ఈ జలపాతాలకు దిగువన సుబ్బారెడ్డి సాగర్, కట్టుచింతల ప్రాజెక్టులు ఉన్నాయి. ధారపల్లి, ఎరకంపాలెం జలపాతాల వద్ద విహరించిన పర్యాటకులు ఈ జలాశయాల వద్ద కూడా ఉల్లాసంగా గడుపుతున్నారు. ఒకసారి సందర్శిస్తే మళ్లీమళ్లీ రావలసిందే అనే రీతిలో ఈ ప్రాంతాలు ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment