మహిళలపై జరిగే నేరాలపై అప్రమత్తం
ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మహిళలు, బాలికలపై జరిగే నేరాల, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ పోలీసు అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ యాక్ట్ కేసులలో సాంకేతిక సహకారం తీసుకుని నగదును రికవరీ చేయాలన్నారు. జిల్లా అంతటా సైబర్ నేరాలు, సోషల్ మీడియా, యాంటీ డ్రగ్స్, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ వార్షిక తనిఖీ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఐజీకి ఎస్పీ డి.నరసింహకిషోర్, ఇతర పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి కేసుల ప్రగతిపై ఆరా తీశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఎస్పీతో చర్చించారు. శరన్నవరాత్రి మహోత్సవాలు, రానున్న దీపావళి సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సమష్టి కృషి, సమన్వయంతో జిల్లాలో అక్రమ మద్యం, గంజాయి, నాటుసారా విక్రయాలు, అక్రమ రవాణను నియంత్రించాలని వివరించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ సర్వీస్‌లో రిమార్కు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఐజీ, ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు, డీఎస్పీ కె.రమేష్ బాబు, డీఎస్పీ ఎస్. భవ్య కిశోర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment