ఇసుక వివరాలు ఆన్‌లైన్ చేయాలి
● అన్ని రీచ్‌లలో ఇసుక
అందుబాటులో ఉండాలి
● అధికారులకు కలెక్టర్ ప్రశాంతి ఆదేశం
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): రీచ్‌ల వారీగా లభ్యత ఉన్న ఇసుక వివరాలు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇసుక సరఫరా, రెవెన్యూ తదితర అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇసుక బుకింగ్ విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అన్ని రీచ్‌లలో ఇసుక అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. సాంకేతిక బృందాల ఆధ్వర్యంలో ఎప్పటి కప్పుడు ఇసుక వివరాలు నమోదు చేయాలన్నారు. అప్‌లోడ్ చేసిన వివరాలు ఆన్‌లైన్‌లో, యాప్‌లో కూడా నమోదు అయ్యేలా పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. బల్క్ బుకింగ్ విధానంలో జాయింట్ కలెక్టర్ వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టాలన్నారు. బల్క్ బుకింగ్ కేటాయింపులు, సరఫరా తదితర అంశాలపై జేసీ స్వయంగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బుకింగ్ విధానంలో అలాట్ అయిన వాటిని తిరస్కరించకుండా, ఇసుక అందుబాటులో ఉండే క్రమంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీవోలు క్షేత్ర స్థాయిలో వ్యక్తిగత పర్యవేక్షణ తప్పనిసరి అని తెలిపారు. ఇసుక తవ్వకాల విషయంలో ముందుకు రాని బోట్స్ మ్యాన్ సొసైటీ సభ్యుల స్థానంలో వేరొక బోట్స్ మ్యాన్ సొసైటీ సభ్యులకు కేటాయించి ఇసుక తవ్వకాలలో ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment