కుయ్‌ కుయ్‌.. కూత రాదోయ్‌ | - | Sakshi
Sakshi News home page

కుయ్‌ కుయ్‌.. కూత రాదోయ్‌

Published Mon, Nov 25 2024 8:00 AM | Last Updated on Mon, Nov 25 2024 8:00 AM

కుయ్‌

కుయ్‌ కుయ్‌.. కూత రాదోయ్‌

ప్రధాన డిమాండ్లు ఇవే..

● 108 ఉద్యోగులకు ప్రతి నెలా ఐదో తేదీ లోపు క్రమం తప్పకుండా వేతనాలు అందించాలి.

● సిబ్బందిని వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలి. జీఓ నంబర్‌ 49ను పునరుద్ధరించాలి.

● ఉద్యోగుల సర్వీసును బట్టీ రెగ్యులర్‌ చేయడంతో పాటు వాహనాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి.

● పైలట్‌ గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులకు సంబంధించి, వార్షిక ఇంక్రిమెంట్లు చెల్లించాలి.

● వేతన స్లాబ్‌లలో మార్పులు తీసుకురావాలి. ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి.

● వేతనంపై 40 శాతం ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి. బకాయిలను వేతనంతో పాటు చెల్లించాలి.

● ఉద్యోగులు ఇప్పటికే ఖర్చు చేసిన ఎలక్ట్రికల్‌ బిల్లులు, వాహనాల మైనర్‌ మరమ్మతులు సత్వరమే అందజేయాలి.

● వైద్య, ఆరోగ్య శాఖలో చేపట్టే నియామకాల్లో సర్వీసుకు అనుగుణంగా వెయిటేజ్‌ మార్కులు ఇవ్వాలి.

● ఈపీఎఫ్‌కు సంబంధించి యాజమాన్య వాటాను యాజమాన్యమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.

● అంబులెన్స్‌ల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు నూతన నియామకాలు చేపట్టాలి.

● వాహనాలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలి. రికార్డులు సక్రమంగా ఉండేలా చూడడంతో పాటు బీమా పూర్తిగా చెల్లించాలి.

● అంబులెన్స్‌ సిబ్బంది విధుల్లో మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందజేయాలి. ప్రతి మండల కేంద్రంలో సిబ్బందికి కనీస అవసరాలతో కూడిన శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలి.

నేడు చలో విజయవాడకు పిలుపు

చర్చలు విఫలమైతే రాత్రి నుంచే సేవలు బంద్‌

డిమాండ్లు పరిష్కరించక సిబ్బంది అసంతృప్తి

ఆలమూరు: ఆపదలో సంజీవని.. క్షతగాత్రులకు ప్రాణప్రదాయిని.. అందరి సంక్షేమకారిణి.. అత్యవసర వైద్య సేవల్లో రోగులు, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాణాపాయం తప్పిస్తున్న 108 అంబులెన్స్‌ అర్ధాంతరంగా ఆగిపోనుంది. ప్రమాద స్థలికి కుయ్‌ కుయ్‌మంటూ వచ్చే ఆ వాహనం మూగబోనుంది. దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై విసుగుపోయిన సిబ్బంది ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ అంబులెన్స్‌లను ప్రభుత్వమే నిర్వహించాలంటూ నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. వివిధ మండలాల్లో దశల వారీగా తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేయడంతో పాటు ఈ నెల 18న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని కలెక్టరేట్‌ కార్యాలయాల వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. అయినా కూటమి ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఈ నెల 25 నుంచి దీర్ఘకాలిక సమ్మెలోకి దిగాలని భావించారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులను అందజేశారు. అత్యవసర సేవలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్న తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టేందుకు రాష్ట్ర 108 సర్వీస్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం చర్చలకు పిలిచి తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే సమ్మె విషయమై పునరాలోచన చేస్తామని, లేకుంటే రాత్రి నుంచే 108 సేవలు నిలిపివేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదే క్రమంలో చలో విజయవాడను అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. విజయవాడకు వెళ్లే ప్రయత్నం విరమించుకోవాలని పోలీసు యంత్రాంగం 108 ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఎందుకంత వివక్ష

రేయింబవళ్లు విధి నిర్వహణే పరమావధిగా అత్యవసర సేవలు అందిస్తూ అనేక మందికి పునర్జన్మ ఇస్తూ ఆపద్బాంధవులుగా ఖ్యాతి గాంచిన 108 అంబులెన్స్‌ సిబ్బందిపై ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష పూరిత విధానంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాహనంలో ఒక్కో ఉద్యోగి 12 గంటలకు పైగా పనిచేయాల్సి వస్తోంది. సిబ్బంది కొరత కారణంగా ఉన్న ఉద్యోగులకు వారాంతపు సెలవులు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. గత మూడు నెలల నుంచి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ వాహనాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉండటంతో విధుల్లో ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలన్న వినతిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగడం అనివార్యమైందనే ఉద్యోగులు చెబుతున్నారు. ఈ అంబులెన్స్‌లను నిర్వహిస్తున్న అరబిందో ఫార్మాను తప్పించాల్సిన పరిస్థితులు తలెత్తితే సత్వరమే ఉద్యోగులు అనేక రాయితీలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి ఏకకాలంలో ఒక సంస్థలో ఐదేళ్లు పనిచేస్తే గ్రాట్యుటీ చెల్లించాలి. అయితే గత ప్రభుత్వంలో 108 వాహన నిర్వహణ బాధ్యతను 2020 జూలై 1న ప్రారంభించారు. ఇప్పటికప్పుడు ప్రభుత్వం అరబిందో ఫార్మా నిర్వహణను రద్దు చేస్తే ఐదేళ్ల కాలపరిమితి పూర్తవ్వడానికి అవకాశం లేకుండా పోతుంది. దీనివల్ల తమకు అందాల్సిన గ్రాట్యుటీ నష్టపోతామని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ నిర్వహణ సంస్థ అరబిందో ఫార్మాను తప్పించాల్సి వస్తే తమకు గ్రాట్యుటీని ప్రభుత్వమే పూర్తిగా చెల్లించడంతో పాటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పరిధిలోకి 108 వాహన సేవలను విలీనం చేయాలని కోరుతున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నా పట్టించుకోకపోవడంపై నిరవధిక సమ్మె చేపట్టేందుకు ఉద్యోగులు నిర్ణయించుకున్నారు.

సేవలు ఆగితే అంతే..

దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోరుతూ 108 ఉద్యోగులు సమ్మె ప్రారంభిస్తే అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. క్షేత్ర స్థాయిలో అత్య వసర వైద్య సేవలు అందించే వీరు సేవలను నిలిపివేస్తే పరిస్థితి ఏంటనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. సమ్మె ప్రారంభమైతే జిల్లాలో ప్రమా దాల్లో చిక్కుకున్న వారికి సకాలంలో సేవలు అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 108 వాహనాలు 62 ఉన్నాయి. అందులో 116 మంది డ్రైవర్లు, 120 మంది ఎమర్జెన్సీ టెక్నీషియన్‌ (ఈఎంటీ)లు విధులు నిర్వహిస్తున్నారు. మూడు జిల్లాల్లో ప్రతి నెలా సు మారు 1.50 లక్షల మందికి పైగా రోగులు పలు రకాల వైద్య సేవలు పొందుతున్నారు. తమ సమస్యలకు పరిష్కారం దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వస్తోందని ఉద్యోగుల రాష్ట్ర యూనియన్‌ చెబుతుంది. ఈ మేర కు 108 సర్వీసెస్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూని యన్‌ జిల్లా స్థాయి మండల స్థాయి అధికారుల వరకూ సమ్మె నోటీసులను ఇప్పటికే అందజేసింది.

అంబులెన్స్‌లో రోగిని ఆసుపత్రికి

తరలిస్తున్న ఉద్యోగులు (ఫైల్‌)

జిల్లా 108 ఈఎంటీలు డ్రైవర్లు

వాహనాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

కోనసీమ జిల్లా 22 39 42

తూర్పుగోదావరి జిల్లా 21 38 41

కాకినాడ జిల్లా 19 36 37

No comments yet. Be the first to comment!
Add a comment
కుయ్‌ కుయ్‌.. కూత రాదోయ్‌1
1/2

కుయ్‌ కుయ్‌.. కూత రాదోయ్‌

కుయ్‌ కుయ్‌.. కూత రాదోయ్‌2
2/2

కుయ్‌ కుయ్‌.. కూత రాదోయ్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement