వీఓఏలపై పచ్చపాతం
● చిరుద్యోగులపై కూటమి నేతల
వేధింపుల పర్వం
● ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ
డీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడి
● జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది ఉద్వాసనకు రంగం సిద్ధం
● వారి స్థానంలో కూటమి నేతలు సిఫారసు
చేసిన వారికి కట్టబెట్టేందుకు యత్నాలు
● తమ డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యమిస్తున్న వీఓఏలు
సాక్షి, రాజమహేంద్రవరం: చిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం ‘పచ్చ’పాతం చూపుతోంది. మంచి ప్రభుత్వం అంటూనే నిట్టనిలువునా ముంచుతోంది. ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్లను తొలగించి వారి ఉపాధికి గండి కొట్టింది. తాజాగా వీఓఏ (గ్రామ సమాఖ్య సహాయకులు)లను ఉద్వాసన పలికేందుకు కూటమి నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుబండి నడుపుతున్న వారిని తొలగించి ఆ కుటుంబాలు రోడ్డున పడేసేందుకు శ్రీకారం చుట్టారు. వారి స్థానంలో కూటమి నేతలు సిఫారసు చేసే వారిని నియమించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ నేతల అనుయాయులకు పోస్టులు ఇప్పించేందుకు కుట్రలు పన్నుతున్నారు. కొన్నేళ్లుగా సేవలందిస్తున్న చిరుద్యోగులపై కూటమి నేతలు మానవత్వం లేకుండా వ్యవహరిస్తుండటంపై చిరుద్యోగులు మండిపడుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రాంగణం ధర్నాలతో దద్దరిల్లుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినదిస్తున్నారు.
100 మంది ఉద్వాసనకు రంగం సిద్ధం
గ్రామ సమాఖ్య వ్యవహారాల్లో కీలక భూమిక పోషించే వీఓఏల తొలగింపునకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ తతంగమంతా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 19 మండలాలున్నాయి. ఒ క్కో మండలంలో సుమారు 50 మంది చొప్పున జిల్లా లో 827 మంది వీఓఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 100 మందికి ఉద్వాసన పలికేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎవరిని తొలగించాలన్న విషయమై ఆయా మండలాల్లోని టీడీపీ నేతలతో సమాలోచనలు చేసి జాబితాను రూపొందించినట్టు సమాచారం. తాము చెప్పిన వారిని వెంటనే తొలగించాలని డీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. తమకు అనుకూలమైన, సిఫారసు చేసిన వ్యక్తులను తొలగించే స్థానాల్లో నియమించాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తట్టుకోలేని కొందరు అధికారులు ఎక్కడ వచ్చిన తంటాలే అనుకుని వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఈ పరిణామం చిరుద్యోగులకు ఇబ్బందిగా మారుతోంది. ప్రతి నెలా వచ్చే వేతనంతో తమ కుటుంబాలను పోషించుకునే వాళ్లమని, ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ భద్రతపై ఆందోళన
వీఓఏలు ఉద్యోగ భద్రతపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే వారు ఆందోళన బాట పట్టారు. ఇటీవల కలెక్టర్ కార్యాలయం ఎదుట తూర్పుగోదావరి జిల్లా వీఓఏల సంఘం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. ఉద్యోగ భద్రత కోసం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, జెండర్ పేరుతో ఉద్యోగం నుంచి తొలగించడం తగదని తమ ఇతర డిమాండ్లు పరిష్కరించాలని గళమెత్తారు.
డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు
బ్యాంకర్లతో మాట్లాడి డ్వాక్రా సంఘాల సభ్యులకు రుణాలు ఇప్పించడంలో వీవోఏలు ఎంతో కీలకం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తీసుకువచ్చి గత ప్రభుత్వంలో పనిచేసిన వీవోఏలను తొలగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆసరాతో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలు చేసి డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచారు. రాజకీయ కక్షలతో తొలగిస్తున్న వీవోఏలకు అండగా నిలబడతాం.
– కాలాబత్తుల సుజాత, జిల్లా సమాఖ్య
మాజీ అధ్యక్షురాలు, పందలపర్రు.
ఇదేం తలనొప్పి?
ప్రస్తుతం పనిచేస్తున్న వీఓఏలను కాదని టీడీపీ నేతలు సిఫారసు చేసిన కొత్త వారిని నియమించుకుంటే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అనుభవం లేని వారిని నియమిస్తే సంఘం కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయినా అవేమీ లెక్కచేయకుండా టీడీపీ నేతలు వాళ్లు చెప్పిన వారినే నియమించాలని పట్టుబట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో ఇప్పటికే ఇద్దరు వీఓఏలను తొలగించారు.
విజ్జేశ్వరంలో జనసేన నేతలు ఓ వీఏఓను విధుల నుంచి వెళ్లిపోవాలని ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిసింది.
తిమ్మరాజుపాలెంలో టీడీపీ నాయకురాలు వీఓఏలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఆ పోస్టును తమకు అనుకూలమైన వారికి ఇప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
బాధ్యతలు కీలకం
స్వయం సహాయక సంఘాల్లో గ్రామ స్థాయిలో వీఓఏల బాధ్యతలు కీలకం. సంఘం నిర్వహణ, ఆర్థిక పరమైన వ్యవహారాలు, రుణాల మంజూరు తదితర పనులన్నీ వీరి ఆధ్వర్యంలోనే నడుస్తాయి. పది నుంచి 20 సంఘాలు సమూహంగా ఉండే ప్రతి గ్రామ సమాఖ్యకు ఒక వీఓఏ ఉంటారు. వారికి ప్రతి నెలా రూ.8 వేల గౌరవ వేతనం చెల్లిస్తారు. వీఓఏను విధుల నుంచి తొలగించాలంటే ఆ సమాఖ్యలే తీర్మానం చేయాలి. ఇవి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ప్రక్రియ అందుకు విరుద్ధంగా సాగుతోంది. స్వయం సహాయక సంఘాల్లో కీలకంగా వ్యవరించే వీఓఏలను తమ గుప్పెట్లో పెట్టుకుని సంఘాలపై అజమాయిషీ చెలాయించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే గ్రామ సంఘంలో తీర్మానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కొన్నిచోట్ల తీర్మానాలు లేకుండానే మండల ఏపీఎంలపై ఒత్తిడి పెంచి వీఓలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment