రుడా చైర్మన్‌గా వెంకటరమణ చౌదరి బాధ్యతల స్వీకరణ
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరి ఆదివారం రాజమహేంద్రవరంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక చెరుకూరి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో శాఖ ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాజమహేంద్రవరం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలకు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తామన్నారు. బాధ్యతలు తీసుకున్న వెంకటరమణ చౌదరిని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అభినందించారు.
కిక్కిరిసిన అయినవిల్లి
అయినవిల్లి: కార్తిక మాసం ఆదివారం కావడంతో అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, వివిధ పూజలు నిర్వహించారు. స్వామికి మహా నివేదన అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 99 మంది, పంచామృతాభిషేకాల్లో ఆరుగురు దంపతులు, లక్ష్మీగణపతి హోమంలో 23 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. 21 మంది చిన్నారులకు తులాభారం, 21 మంది నూతన వాహన పూజ చేయించుకున్నారు. స్వామివారి అన్నదాన పథకంలో 5,420 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.4,02,986 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.
అప్పనపల్లి... భక్తులతో శోభిల్లి
మామిడికుదురు: బాలబాలాజీ స్వామి కొలువైన అప్పనపల్లి క్షేత్రం ఆదివారం కోలాహలంగా మారింది. కార్తిక మాసం ఆదివారం కావడంతో స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు పాత, కొత్త ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ధ్వజస్తంభం వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. స్వామివారి సన్నిధిలో నిత్య శ్రీలక్ష్మీ నారాయణ హోమంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.4.14 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణ రాజు తెలిపారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.55,307 విరాళాలుగా వచ్చాయి. 6,578 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 4,259 మంది అన్న ప్రసాదం స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment