వనాలకు పోటెత్తిన జనాలు
● సందడిగా కార్తిక మాసం ఆఖరి ఆదివారం
● పార్కింగ్ స్థలాలు లేక రోడ్డెక్కిన వాహనాలు
రాజానగరం: కార్తిక మాసం ఆఖరి ఆదివారం కావడంతో నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లోని వనాలు జనసంద్రంగా మారాయి. వ్యాపార, వాణిజ్యాలకు సంబంధించిన వ్యక్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వివిధ విభాగాల్లోని ఉద్యోగులకు ఆదివారం సెలవు రోజు కావడంతో కార్తిక మాసం ఆఖరి ఆదివారం ఎంజాయ్ చేసే అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా పిల్లాపాపలతో, బంధుమిత్ర సపరివారంగా విచ్చేసిన సందర్శకులతో వనాలు కళకళలాడాయి. ముఖ్యంగా రాజమహేంద్రవరానికి సమీపాన ఉన్న గోదావరి మహాపుష్కర వనంలో వివిధ వర్గాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వన సమారాధనలకు ఆహ్వానితులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జాతీయ రహదారిపై దాని ప్రభావం కనిపించింది. ఆ రహదారిని ఆనుకుని ఉన్న పుష్కర వనం ప్రాంతంలో కార్లు, మోటారు సైకిళ్లు పార్కు చేసేందుకు కేటాయించిన జాగా సరిపోకపోవడంతో వందలాది వాహనాలను జాతీయ రహదారి పై పార్కు చేయకతప్పలేదు. దీంతో వన సమారాధనలకు వచ్చేవారితో పాటు సాధారణ ప్రయాణికుల రాకపోకలకు కూడా కొంతమేర అంతరాయం ఏర్పడింది. ఇదే పరిస్థితి దివాన్‌చెరువులోని ఓనువులమ్మ వారి ఆలయం సమీపంలోని తోటలో నిర్వహించిన కార్తిక వన సమారాధనకు తప్పలేదు.
సరదాగా..
లాలాచెరువు, దివాన్‌చెరువు, చక్రద్వారబంధం, శ్రీరామపురం ప్రాంతాల్లో కార్తిక వన సమారాధనలు సందడిగా సాగాయి. ఆటలు, పాటల పోటీలు, వివిధ రకాల వినోద కార్యక్రమాలతో వయస్సులతో నిమిత్తం లేకుండా అంతా సరదాగా గడిపారు. రాజానగరంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వన సమారాధనలో లక్కీ డిప్‌లు తీసి, బహుమతులు అందజేశారు. ఆయా వర్గాలకు చెందిన వారు కుటుంబ సభ్యులతో సహా పాల్గొని, సరదాగా గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment