ట్రస్ట్‌బోర్డు నియామకానికి ఏర్పాట్లు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి నియామకానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రస్తుత ధర్మకర్తల మండలి (ట్రస్ట్‌బోర్డు) కాలపరిమితి ఫిబ్రవరి ఎనిమిదో తేదీతో ముగుస్తుంది. కొత్త ధర్మకర్తల మండలిలో సభ్యుల కోసం పేర్లు పంపించాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోరింది. దీంతో మంత్రులు, ఆయా శాసనసభ్యులపై ఆశావహుల ఒత్తిడి మొదలైంది.
16 మందికి స్థానం కల్పించిన
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
గతంలో ధర్మకర్తల మండలిలో కేవలం ఎనిమిది మంది మాత్రమే సభ్యులు ఉండేవారు. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ట్రస్ట్బోర్డులలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండాలని, 50 శాతం మహిళలు ఉండాలని భావిస్తూ మొత్తం 16 మందితో ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేసింది. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఐవీ రోహిత్‌తో బాటు మరో 15 మంది సభ్యులుగా నియమితులయ్యారు. వీరిలో ఏడుగురు మహిళలు. మొత్తం 15 మందిలో ఎనిమిది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కావడం విశేషం. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీ ప్రకారం నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ట్రస్ట్‌బోర్డులో స్థానం కల్పించారు. దేవస్థానం చరిత్రలో ఈ విధంగా సగంమంది మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఏర్పాటైన ట్రస్ట్‌బోర్డుగా నిలిచిపోయింది. 2024 జూన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ట్రస్ట్‌బోర్డులో చాలామంది సభ్యులు రాజీనామా చేశారు.
పైరవీలు మొదలు
అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యత్వాల కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు 50 మంది, జనసేన, బీజేపీల నుంచి డజన్ల సంఖ్యలో ఈ సభ్యత్వాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ, జనసేన నుంచి ఇద్దరు చొప్పున ట్రస్ట్‌బోర్డులో నియమించాలని ఆ పార్టీలు కోరుతున్నాయి. సత్యదేవుని ఆలయం కలిగిన ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గతంలో మాదిరిగా ఇద్దరికి ట్రస్ట్‌బోర్డులో అవకాశం కల్పించనున్నారు. పిఠాపురం, జ గ్గంపేట, కాకినాడ టౌన్ లేదా కాకినాడ రూరల్, తుని నియోజకవర్గాల నుంచి టీడీపీల నుంచి ఒక్కొక్కరికి ట్రస్ట్‌బోర్డులో అవకాశం లభించే అవకాశం ఉంది. అనపర్తి నియోజకవర్గం, కోనసీమ నుంచి కూడా ఒక్కొక్కరికి అవకాశం కల్పించనున్నారు. గతంలో గుంటూరు జిల్లా నుంచి కూడా ఒకరికి ఈ ట్రస్ట్‌బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ట్రస్ట్‌బోర్డు సభ్యత్వాలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment