క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి భక్తులు ఫిర్యాదు చేయొచ్చు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి విచ్చేసే భక్తులు వారు ఎదుర్కొన్న అనుభవాలు, అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను ఉన్నతాధికారులకు తెలియచేసేందుకు ఆలయంలో వివిధ ప్రాంతాలలో క్యూఆర్ కోడ్లను బుధవారం ఏర్పాటు చేశారు. ఆ కోడ్‌ను సెల్‌ఫోన్ ద్వారా స్కాన్ చేయగానే అందులో ఒక ప్రశ్నావళి డౌన్లోడ్ అవుతుంది. అందులో భక్తుని పేరు, చిరునామా, ఫోన్ నంబర్, దేవస్థానానికి విచ్చేసిన తేదీ, దర్శనం లేదా పూజ, వ్రతమాచరించిన సమయం, సంతృప్తికరంగా సిబ్బంది సేవలందించారా లేక ఇబ్బంది పెట్టారా, దేవస్థానంపై వారి అభిప్రాయం లేదా ఫిర్యాదు తదితర విషయాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఆ ప్రశ్నావళి నేరుగా దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలోని స్పెషల్ డెస్క్‌కు చేరుతుంది. వారు దానిని విశ్లేషించి అందులో ఫిర్యాదులు లేదా అభిప్రాయాలను దేవస్థానానికి పంపిస్తారు. దేవస్థానం అధికారులు ఆ భక్తునికి ఫోన్ చేసి పూర్తిగా వివరాలు తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను కమిషనర్ కార్యాలయం మోనటరింగ్ చేస్తుంది. రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలన్నింటిలో ఈ విధంగా క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆదేశించారు.
గతంలో ఫిర్యాదు బాక్స్‌లు,
ఈ మెయిల్స్..ఇప్పుడు క్యూ ఆర్ కోడ్స్
గతంలో ఫిర్యాదు పుస్తకాలు, బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ఆ తరువాత దేవస్థానం ఈ మెయిల్ అడ్రస్‌ను పలుచోట్ల ప్రదర్శించారు. అయితే అప్పుడు భక్తులు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపించేవి. ఇప్పుడు తాజాగా క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వారి ఫిర్యాదులు తెలియజేయాలని కోరుతున్నారు. ఇవి నేరుగా కమిషనర్ కార్యాలయానికి చేరుతాయి కనుక స్థానిక అధికారులపై ఒత్తిడి ఉండి, భక్తుల ఫిర్యాదులు పరిష్కరించే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment