చైనాపై ‘నిషేధాస్త్రం’ | India Banned PUBG Among 118 Chinese Apps | Sakshi
Sakshi News home page

చైనాపై ‘నిషేధాస్త్రం’

Published Fri, Sep 4 2020 1:16 AM | Last Updated on Fri, Sep 4 2020 1:16 AM

India Banned PUBG Among 118 Chinese Apps - Sakshi

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద ఇంకా కవ్వింపు చర్యలు ఆపని చైనాపై మరోసారి మన దేశం నిషేధాస్త్రం ప్రయోగించింది. రెండు నెలలక్రితం 59 యాప్‌లు, జూలై నెలాఖరున 47 యాప్‌లు నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా బుధవారం ఆ దేశానికే చెందిన మరో 118 యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.  గతంలోలాగే ఈసారి కూడా కేంద్రం అవి చైనాకు చెందినవన్న కారణంతో చర్య తీసుకున్నట్టు చెప్పలేదు. మన పౌరుల వ్యక్తిగత గోప్యతకూ, డేటా భద్రతకూ, దేశ సార్వభౌమత్వానికి ఇవి ముప్పు కలిగిస్తున్నాయని తెలిపింది. ఈమధ్య ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ దేశీయ ఆట బొమ్మల తయారీతోపాటు వీడియో గేమ్‌ల ప్రస్తావన కూడా చేశారు. వర్తమానంలో డిజిటల్‌ మార్కెట్‌ వ్యవస్థ కీలకమైనది. యాప్‌ల రూపకల్పనలో ప్రపంచంలోనే అందరికన్నా ముందున్న చైనాకు అది మరింత ముఖ్యం. చైనాలో పౌరులు ఏది చూడొచ్చు...ఏది చూడకూడదన్న నియంత్రణలుంటాయి. మనకు ఆ సమస్య లేదు. జనాభా కూడా అధికం కనుక వినియోగదారుకు ప్రయోజనం కలిగించే...లేదా కావలసినంత కాలక్షేపాన్నిచ్చే యాప్‌ వచ్చిందంటే డౌన్‌లోడ్‌లు కట్టలు తెంచుకుంటాయి. ఆ సంఖ్య వందలు వేలుగా...వేలు లక్షలుగా...లక్షలు కోట్లుగా మారడానికి ఎంతో కాలం పట్టదు. ఆ రకంగా యాప్‌  యాజమాన్యాలకు ఏటా వేల కోట్ల ఆదాయం వచ్చిపడుతుంటుంది. చైనా యాప్‌లలో చాలా భాగం ఇలాంటి ఆర్జనలో ఆరితేరాయి. మనతో యధావిధిగా వాణిజ్యం సాగిస్తూనే, మరోపక్క ఎల్‌ఏసీ వద్ద మనల్ని చికాకు పెట్టొచ్చని భావిస్తున్న చైనాకు ఈ యాప్‌ల నిషేధంతో కాస్తయినా షాక్‌ ఇవ్వొచ్చన్న ఉద్దేశం మన ప్రభుత్వానికి వుంది. అలాగే డిజిటల్‌ రంగంలో సూపర్‌ పవర్‌గా ఎదగాలని బలంగా వాంఛిస్తున్న చైనాకు చెక్‌ పెట్టడానికి ఇది తోడ్పడుతుందని ఆ రంగంలోని నిపుణుల భావన. అలాగే వేరే దేశాలు సైతం ఇదే బాట పడితే తమ ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నామన్న అభిప్రాయం అక్కడి టెక్‌ కంపెనీల్లో, నిపుణుల్లో ఏర్పడుతుంది. ఇవన్నీ ఎల్‌ఏసీ వద్ద బుద్ధిగా మసులుకోవడానికి చైనాను ఎంతవరకూ పురిగొల్పుతాయో చెప్పలేం.

మన దేశంలో సెల్‌ఫోన్‌లు, వాటిలో వినియోగించే డేటా చవగ్గా లభ్యం కావడం మొదలైన దగ్గరనుంచీ ఈ యాప్‌లపై అందరికీ మోజు పెరిగింది. కనుకనే నిషేధం విధిస్తారన్న కథనాలు వచ్చినప్పటినుంచి అందరూ కంగారుపడ్డారు. లోగడ నిషేధించిన యాప్‌లలో టిక్‌టాక్‌ వుండటమే చాలామందిని బాధించింది. ఎందుకంటే అది పల్లెలు, పట్టణాలన్న వ్యత్యాసం లేకుండా...అన్ని వయసులవారినీ ఆకట్టుకుంది. ఆడ మగ తేడా లేకుండా అందరికందరూ తమ తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించడానికి దాన్నొక వేదికగా ఎంచుకున్నారు. ఎవరి ఆసరా లేకుండా, డబ్బుతో పనిలేకుండా జనంలో పాపులర్‌ అయ్యారు. మారుమూల ప్రాంతాల్లో అక్షరాస్యత అంతంతమాత్రంగావున్న అతి సాధారణ పౌరులు సైతం లక్షలాదిమంది అభిమానుల్ని సంపాదించుకోగలిగారు. పర్యవసానంగా వారి ఆదాయం ఊహకందని స్థాయికి చేరుకుంది. తాజా జాబితాలోవున్న పబ్‌జీ యాప్‌ అలాంటిదే. దానికున్న జనాదరణ చాలా ఎక్కువ. ఆ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగావున్న వీరాభిమానుల్లో 24 శాతంమంది మనవాళ్లేనని, పెద్ద మార్కెట్‌వున్న దేశం కూడా మనదేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈ యాప్‌ను రూపొందించింది దక్షిణ కొరియాకు చెందినవారైనా...దీనికి సంబంధించిన మొబైల్‌ యాప్‌ను చైనా సంస్థ టెన్‌సెంట్‌ అభివృద్ధి చేసింది.  వేర్వేరు ప్రాంతాల్లో వుండే వందమంది వరకూ ఒక గేమ్‌లో భాగస్వాములుగా మారి ఆడేందుకు పబ్‌జీ అవకాశమిస్తుంది. నిజానికి ఇది చైనాకు చెందిందా, మరో దేశానికి చెందిందా అన్న మీమాంసతో సంబంధం లేకుండా వేలాదిమంది ఈ యాప్‌ను నిషేధించాలని చాన్నాళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. కొందరైతే న్యాయస్ధానాలను ఆశ్రయించారు. ఎందుకంటే ఈ గేమ్‌లో పిల్లలు భాగస్వాములై సమయం వృథా చేసుకోవడమే కాదు...అందులో పూర్తిగా తలమునకలై ప్రాణాలు కోల్పోయారు. తెలిసీ తెలియక లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నవారు అనేకమంది. నిరుడు ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చ’ పేరిట విద్యార్థులతో, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించినప్పుడు ఒక బాలుడి తల్లి పబ్‌జీ యాప్‌వల్ల చదువులు నాశనమవుతున్నాయని ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు పబ్‌జీ నిషేధించి కేంద్రం మంచిపని చేసింది. అయితే పిల్లలపై మానసికంగా దుష్ప్రభావం చూపే, వారి విలువైన సమయాన్ని వృధా చేసే యాప్‌లు దేశీయమైనవి అయినా అనుమతించకూడదు. ఆ విషయంలో కేంద్రం జాగ్రత్తలు తీసుకోవాలి.   

మొబైల్‌ గేమింగ్‌ పరిశ్రమ చూస్తుండగానే భారీగా ఎదుగుతోంది. 2016లో ఇక్కడ ఆ పరిశ్రమ ఆదాయం రూ. 1,949 కోట్లయితే... అది ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. పబ్‌జీ మార్కెటింగ్‌లో టెన్‌సెంట్‌ కొత్త కొత్త పోకడలతో మిగిలిన గేమింగ్‌ యాప్‌లను స్వల్పకాలంలోనే అధిగమించింది. యాప్‌ల రూపకల్పనలో మన దేశానికి చెందిన ఔత్సాహికులు కూడా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా మన పురాణాలు, ఇతిహాసాలు, జానపద గాథలు ఆధారంగా రక్తికట్టే గేమ్‌ల తయారీకి కృషి చేస్తున్నారు. అయితే ఔత్సాహికులకు మన దేశంలో ఎదురయ్యే సమస్యలు వీరికి కూడా అడుగడుగునా అవరోధాలుగా మారాయి. ఆదరణ ఎంతవరకూ వుంటుందో తెలియని యాప్‌పై పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. పబ్‌జీ కి పోటీగా ప్రస్తుతం నాలుగైదు యాప్‌లున్నాయి. ఇన్నాళ్లూ భారీగా వ్యయం చేయగల పబ్‌జీతో పోటీపడటం వాటికి కష్టమైంది. ఇప్పుడు వాటి పని సులభమవుతుంది. అయితే యాప్‌ల నిషేధం దానంతటదే చైనాలో మార్పు తీసుకురాలేదు. ఎల్‌ఏసీ వద్ద దురాక్రమణను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగినప్పుడే అది దారికొస్తుంది. అందులో మన సైన్యం తలమునకలైవుంది. ఆ ప్రయత్నం సఫలం కావాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement