వాకౌట్లు, వాయిదాలు, అరుపులు, కేకలతో తరచు వార్తల్లోకెక్కే పార్లమెంటు కనీసం కొత్త భవనం ప్రారంభోత్సవ సందర్భంలోనైనా పండుగ కళను సంతరించుకుంటుందని ఆశిస్తే అది సాధ్యపడేలా లేదు. నూతన పార్లమెంటు భవనాన్ని ఎవరు ప్రారంభించాలన్న అంశం చుట్టూ ఇప్పుడు వివాదం రాజుకుంది. పనిలో పనిగా రాజ్యాంగ చట్రంలో ఎవరి పాత్రేమిటన్న చర్చ కూడా మొదలైంది. ఈ ఆదివారం నూతన పార్లమెంటు భవనం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటమే తాజా వివాదానికి మూలం.
రాజ్యాంగం నిర్దేశించిన మూడు వ్యవస్థల్లో శాసన వ్యవస్థ ఒకటి కనుక రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ప్రారంభిస్తేనే బాగుంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే ప్రధాని పార్లమెంటులో మెజారిటీ పక్షానికి మాత్రమే నాయకుడని, అందువల్ల ఆయన ప్రారంభించటం సరికాదంటున్నాయి. తమ వాదనకు ప్రభుత్వం సమ్మతించటం లేదని అలిగి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించటానికి నిర్ణయించుకున్నాయి. మొత్తంగా 20 పార్టీలు బహిష్కరణ పిలుపులో భాగం కాగా, 25 పార్టీలు ఈ వేడుకకు హాజరవుతున్నాయి. ఏ నిర్ణయాన్నయినా అందరూ ఆమోదించాలని లేదు. విభేదించే హక్కు, భిన్నా భిప్రాయాన్ని ప్రకటించే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది. కానీ ఆ పరిధి దాటి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడే సమస్య మొదలవుతుంది.
సమస్త అధికార సౌధాలూ ఒకేచోట ఉండాలని నిర్ణయించి అందుకోసం బృహత్తరమైన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూనుకుంది. అందులో నూతన పార్లమెంటు భవనం ఒకటి. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తారు. దేశ పౌరుల ప్రయోజనాలు, భద్రతతో ముడిపడివుండే అనేక అంశాలు అక్కడ చర్చకొస్తాయి. చట్టాలు రూపొందుతాయి. ప్రతి పక్షం ఏమి ఆశిస్తున్నదో ప్రభుత్వం తెలుసుకోవటం, ప్రభుత్వ వైఖరేమిటో విపక్షాలు గ్రహించటం ఎక్కడో ఒకచోట రెండు పక్షాలూ అంగీకారానికి రావటం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుంది. లేదంటే పరస్పరం విభేదించుకోవటానికైనా ఆ పక్షాల మధ్య అంగీకారం కుదరాలి. ఇవేమీ లేకుండా ఎప్పుడూ కత్తులు నూరుకోవటమే, ఎదుటి పక్షంపై పైచేయి సాధించటమే ధ్యేయంగా మారితే అలాంటిచోట ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుందా? అందుకే బహిష్కరణ నిర్ణయం ఎలాంటి సందేశం పంపుతుందో విపక్షాలు ఆలోచించుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తున్న దనో, దాని నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయనో విమర్శిస్తే, నిలదీస్తే అర్థం చేసుకోవచ్చు. అడపా దడపా విపక్షాలు ఆ పని చేస్తూనే ఉన్నాయి. నూతన సౌధాన్ని రాష్ట్రపతి ప్రారంభించటమే సరైందన్న తమ అభిప్రాయాన్ని ప్రజలముందుకు తీసుకువెళ్లటంలో కూడా తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఆ వాదనను ఆమోదించటమో, తిరస్కరించటమో ప్రజలు తేల్చుకుంటారు. జనం తీర్పుకే దాన్ని విడిచిపెట్టి యధావిధిగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే విపక్షాల హుందాతనం వెల్లడయ్యేది. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంటు నూతన సౌధం సమకూర్చుకోవటం ఎంతో ప్రాముఖ్యతగల ఘట్టమని విపక్షాలే ప్రకటించివున్నాయి.
మరి అటువంటి ముఖ్య ఘట్టానికి ముఖం చాటేయటం ఏం సబబన్న విజ్ఞత వాటికి ఉండొద్దా? స్వాతంత్య్ర వచ్చిన తొలినాళ్లలో పార్లమెంటుతోపాటు రాష్ట్రాల్లోని చట్టసభలన్నిటా పరిణత చర్చలు జరిగేవి. ఆరోగ్యకరమైన విధా నాలూ, సంప్రదాయాలూ అమలయ్యేవి. కానీ రాను రాను అవి బలప్రదర్శనలకు వేదికలవుతు న్నాయి. నేలబారు రాజకీయాలే దర్శనమిస్తున్నాయి. మొన్న మార్చిలో రూ. 45 లక్షల కోట్ల విలువైన కేంద్ర బడ్జెట్ లోక్‌సభలో ఎలాంటి చర్చా లేకుండా గిలెటిన్‌తో ముగిసిపోయిందని గుర్తుంచుకుంటే మన పార్లమెంటు ఎలాంటి దుఃస్థితిలో పడిందో అర్థమవుతుంది. అదానీ వ్యవహారంపై దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటుకు అంగీకరించాలని విపక్షాలూ... దేశ వ్యవ హారాల్లో విదేశీ జోక్యం కోరినందుకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అధికార పక్షమూ పట్టుబట్టడంతో బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. కనీసం కొత్త పార్లమెంటు భవనంలోనైనా అధికార, విపక్షాలు సరికొత్త ఒరవడికి నాంది పలుకుతాయనుకుని భ్రమించిన వారికి విపక్షాల బహిష్కరణ పిలుపు నిరాశ మిగిల్చింది.
పార్లమెంటుపై రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగినప్పుడు దాన్ని కేవలం రెండు చట్టసభల సముదాయంగా మాత్రమే పరిగణించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దేశంలో మున్ముందు చోటుచేసుకోవాల్సిన సామాజిక, ఆర్థిక మార్పులకు దాన్నొక సాధనంగా రాజ్యాంగ నిర్మాతలు పరిగణించారు. ఈ లక్ష్యసాధనలో పార్లమెంటు విఫలమైతే దేశంలో అశాంతి ప్రబలుతుందని కూడా హెచ్చరించారు. కానీ వర్తమాన రాజకీయ నేతలకు అదేమీ గుర్తున్నట్టు లేదు. వారు ఎదుటి పక్షాన్ని శత్రువుగానే భావిస్తున్నారు. అంతకుముందు సంగతెలావున్నా గత పదేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. ప్రజాస్వామ్యానికి ఈ మాదిరి వైఖరి తోడ్పడుతుందో, దాన్ని కడతేరుస్తుందో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఇరుపక్షాలూ పరిణతితో మెలగాలి. దేశ ప్రజల విశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలిగిన విపక్షాలను ఒప్పించేందుకు, వాటిని కలుపుకొని పోయేందుకు బీజేపీ ప్రయత్నించాలి. తమ అభ్యంతరాల అంతస్సారం ప్రజల్లోకి వెళ్లింది గనుక అంతకుమించటం మితిమీరడంతో సమానమవుతుందని విపక్షాలు గుర్తించాలి. ప్రజాస్వామిక స్ఫూర్తిని విస్మరించటం సరికాదని గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment