రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు కొత్త కాదు కానీ, కొన్ని ఘటనలు అమితాశ్చర్యానికి గురి చేస్తాయి. ఆకర్షిస్తాయి. అవి సంభవించడానికి ప్రేరణ ఏమిటన్న ఆలోచనకు పురిగొల్పుతాయి. ఇటీ వలి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక అక్షరాలా అలాంటిదే. మూడు చోట్లా సీనియర్లను కాదని కొత్త ముఖాలను కాషాయ పార్టీ ఎంచుకున్న తీరు ఆశ్చర్యాన్నీ, ఆలోచననూ కలిగిస్తోంది.
కొత్త నేతల పేర్లు పెద్దగా తెలియ కున్నా... రకరకాల స్థానిక సామాజిక వర్గాల లెక్కలను పరిగణనలోకి తీసుకొన్నాకనే మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్ సహాయ్, రాజస్థాన్‌లో భజన్‌లాల్ శర్మలను అధిష్ఠానం ఎంపిక చేసినట్టుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు రానున్న వేళ కమలనాథులు అనుసరిస్తున్న ఈ కొత్త సీఎం ముఖాల వ్యూహం లోతుపాతుల పట్ల అంచనాలు, విశ్లేషణలను పెంచుతోంది.
ప్రజాస్వామ్యంలో సభలో సంఖ్యా బలంతో అధికార పీఠంపై కూర్చొనే రాజకీయ పార్టీకీ, ఎన్నికైన ఆ పార్టీ చట్టసభ సభ్యులకూ తమకు నచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొనే పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటాయి. అది ఆ పార్టీల అంతర్గత వ్యవహారం. అయితే, శ్రమించి పార్టీని అధికారంలోకి తెచ్చిన, నిలబెట్టిన సీనియర్ నేతలకు సీఎం పీఠం దక్కకపోవడం, రాజస్థాన్ లాంటి చోట్ల తొలిసారి ఎమ్మెల్యేనే సరాసరి సీఎంను చేయడం, మంత్రులుగా ఎన్నడూ పనిచేయనివారిని డిప్యూటీ సీఎంలను చేయడం విచిత్రమే.
కానీ నిత్యం ఎన్నికల పోరులో ఉన్నట్టే ఏడాది పొడుగూతా శ్రమించే బీజేపీకి తనవైన లెక్కలున్నాయి. విస్తృత రాజకీయ, సైద్ధాంతిక వ్యూహమూ ఈ ఎంపికలో కనిపి స్తోంది. ప్రతి రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమతూకం పాటిస్తూ, సామాజిక వర్గాల బలాబలాలను అంచనా వేసుకొంటూ ఈ కొత్త సీఎంల ఎంపికకు వ్యూహరచన చేశారని అర్థమవుతోంది. కొత్త సీఎంలు ముగ్గురూ హిందూత్వ వాదులే. ఆరెస్సెస్‌కు సన్నిహితులే. అధినేతలకు విధేయులే.
మాజీ కేంద్ర మంత్రి, ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడైన విష్ణుదేవ్‌ను అక్కడి సీఎం పీఠంపై కూర్చోబెట్టడం వెనుక దేశంలోని 9 శాతం ఆదివాసీలను అక్కున చేర్చుకొనే వ్యూహం ఉంది. ఇప్పటికే ద్రౌపదీ ముర్ముతో దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిని అందించిన బీజేపీ ఆ వర్గంతో ఓట్ల బంధాన్ని బలోపేతం చేసుకోవాలనేది ఎత్తుగడ. ఇక, మధ్యప్రదేశ్‌లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విద్యామంత్రిగా పనిచేసిన మోహన్ యాదవ్ రాష్ట్రంలో బలమైన ఓబీసీ వర్గానికి చెందినవారు కావడం కలిసొచ్చిన అంశం.
ఆయన డిప్యూటీలుగా బ్రాహ్మణ, ఎస్సీ వర్గీయుల్ని నియమించడంలో, ఇతర ప్రధాన ఓటుబ్యాంకుల్ని తృప్తిపరిచే యత్నం కనిపిస్తోంది. రాజస్థాన్‌లోనైతే అధికారిక ప్రకటన ముందు దాకా సమావేశ ఏర్పాట్లలో ఉన్న ఎమ్మెల్యే భజన్‌లాల్ పేరును ఆకస్మికంగా ప్రకటించారు. ఆయనే ఊహించని ఆ ఎంపిక మరోసారి పదవిపై ఆశపడ్డ వసుంధరకు అధిష్ఠానం వేసిన గుగ్లీ.
రాజవంశీయురాలైన వసుంధరా రాజె రెండు దశాబ్దాలలో తొలిసారిగా రాజస్థాన్‌లో ఇటు సీఎం కాకుండా, కనీసం సీఎం అభ్యర్థిగానైనా కాకుండా మిగిలారు. ఇక, మధ్యప్రదేశ్‌లో దీర్ఘకాలిక సీఎంగా పేరు తెచ్చుకొని, తాజా ఎన్నికల్లో ఏటికి ఎదురీది పార్టీని విజయతీరానికి చేర్చిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మళ్ళీ పగ్గాలు దక్కలేదు. ఛత్తీస్‌గఢ్‌కు ఒకప్పుడు సీఎంగా వ్యవహరించిన రమణ్ సింగ్ పరిస్థితీ అదే. ఇప్పుడిక ఒక విషయం స్పష్టం.
వసుంధరా రాజె, చౌహాన్‌లను పక్కనబెట్టడంతో కమలం పార్టీ ఇప్పుడిక ఒకప్పటి వాజ్‌పేయి, అద్వానీల శకం నుంచి పూర్తిగా బయటపడి, మోదీ, షాల కొత్త జమానాలోకి సంపూర్ణంగా చేరుకున్నట్టే. పాత కాపులుగా చక్రం తిప్పుతున్న అనేకులకు అనధికారికంగా... అధికార పీఠం నుంచి బలవంతపు పదవీ విరమణ ఇచ్చేసినట్టే. అయితే, సీఎం పదవి ఇవ్వనంత మాత్రాన బీజేపీలో ఈ సీనియర్ల కథ ముగిసిపోయిందని అనుకోలేం. రానున్న రోజుల్లో కాషాయపార్టీ వీరి సేవలను ఎలా వినియోగించుకుంటుందో వేచిచూడాలి.
ఏమైనా, ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది రోజుల తర్వాత బీజేపీ ఆచితూచి సీఎంల ఎంపిక తతంగాన్ని పూర్తిచేసింది. రాజకీయాల్లో తరాల మార్పే కాక అధికార మార్పిడి సైతం సాఫీగా సాగేలా చూసుకుంది. దేశంలో 60 ఏళ్ళు ఆ పైబడ్డ ఓటర్లు 15 నుంచి 20 శాతమే అని లెక్కలు వినిపిస్తున్న వేళ పెరుగుతున్న యువ ఓటర్లను ఆకర్షించే నవతరం నేతలను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దే పథకరచనకు విజయవంతంగా శ్రీకారం చుట్టింది.
వ్యక్తుల కన్నా వ్యవస్థ (పార్టీ) పెద్దదనే నిష్ఠురసత్యాన్ని నసాళానికి అంటేలా సీనియర్లకు సంకేతించింది. ఇక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త సీఎంలు బుధవారం కొలువుతీరారు. కొన్ని ధార్మికస్థలాలే లక్ష్యమనిపించేలా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లపై నిషేధమంటూ మధ్యప్రదేశ్‌లో మోహన్‌యాదవ్ పని మొదలెట్టేశారు. పాతవారిని మరిపించేలా పాలన అందించడమే కాక, తక్షణమే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మరిన్ని సీట్లు సాధించే సవాలు ఈ ముగ్గురు కొత్త సీఎంల ముందుంది.
బీజేపీ మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమదే విజయమన్న దిలాసా కనబరుస్తోంది. తరగని మోదీ మాయ, పార్టీ సైద్ధాంతిక పునాది, ప్రారంభం కానున్న అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 రద్దు సహా ఈ కులసమీకరణాలూ తమకు లాభిస్తాయనే భరోసాతో ఉంది. మార్పే మంత్రమని నమ్మిన బీజేపీ ఇప్పటికైతే అధికారంలో ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా ఓటర్లపై పట్టు నిలుపు కోవడానికీ, పెంచుకోవడానికీ పై స్థాయిలో మార్పులు కీలకమని ఆచరణలో పెట్టింది. కొత్త యంత్రాన్ని పాత సాఫ్ట్‌వేర్‌తో కాక, కొత్త సాఫ్ట్‌వేర్‌తో నడపాలని నమ్మిన బీజేపీ వ్యూహం ఏ మేరకు ఫలి స్తుందో చూడాలి. అది ఫలిస్తేప్రతిపక్షాలెంత ఆశపడ్డా ఢిల్లీ గద్దెపై మార్పును 2024లోనూ చూడలేవు.
మార్పులే మంత్రం!
Published Thu, Dec 14 2023 12:03 AM | Last Updated on Thu, Dec 14 2023 12:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment