ఒకప్పుడు ఏ ఊరికైనా వెళ్తే, ఆ ఊరు దానికదే ముచ్చటగా కనబడేది. ఆ ఇళ్ల నిర్మాణం, వాటి వాకిళ్లు, వాటి ముందరి చెట్లు, అవి పాకలే అయినా సరే భిన్నంగా ఉండేవి. కలిమిలేముల సమస్య కాదిది. ఈ భూప్రపంచంలో ఆ ఊరిని పోలిన ఊరు ఇంకోటి ఉండకపోయేది. అది దానికదే యునీక్, స్పెషల్. ఇప్పుడు ఏ ఊరిని చూసినా అవే సిమెంటు పౌడరు అద్దుకున్న ముఖాల్లా ఉంటాయి.
అంతవరకూ పోనీ అనుకుంటే, ఏ ఊరిలోనైనా ఒకే రకం బ్యానర్లు తగులుతాయి. మనం ఇంకో ఊరికి పోయామన్న అనుభూతే దొరకదు. పోనీ మనుషులను అయినా పలకరిద్దామా అంటే, వాళ్లందరూ ఒకే విషయాలు మాట్లాడుతుంటారు. మనం మన ఊరిలో మాట్లాడే విషయాలే ఆ పక్క ఊరిలో కూడా మాట్లాడుతుంటే వినడం ఎంత విసుగు! ఈ ‘ఒకే రకం’ అనేదే ఇప్పుడు పెద్ద సమస్య. ఏదీ ప్రత్యేకంగా ఉండదు, ఎందులోనూ జీవం తొణికిసలాడదు.
నాస్టాల్జియాను కలవరించడంలో అంత దోషమేమీ లేదు. అది మన విలువైన గతం. ప్రపంచంలో ఇలాంటి మనిషి ఒక్కడే ఉన్నాడు అని నమ్మకం కలిగించేట్టుగా ఎవరూ ఉండటం లేదు. అతనూ అదే పాపులర్ సినిమా గురించో, అవే రాజకీయాల గురించో మాట్లాడతాడు. కారణం ఏమంటే, అందరమూ ఒకే రకమైన సమాచారాన్ని డంప్ చేసుకుంటున్నాం. కెరియర్ వరకూ ఏమో గానీ, కరెంట్ ఎఫైర్స్‌లో మాత్రమే జీవితం లేదు.
సమాచారం రోజురోజుకూ దొర్లిపోయేది. అందులో జీవిత కాలానికి స్వీకరించగలిగే బరువు ఉండదు. కానీ ప్రపంచమంతా అనుసంధాన మయ్యాక అందరూ చూస్తున్నది ఒకటే, అందరూ చదువుతున్నది ఒకటే. వేరు చూపు లేదు, వేరు ఆలోచన లేదు, వేరుగా దర్శిస్తున్నది లేదు. మొత్తంగా ఒరిజినాలిటీ అనేది లేకుండా పోయింది. అసలు అనుభవాలే భిన్నంగా ఉండకపోయాక ఇంక ఒరిజినాలిటీ ఎక్కyì నుంచి వస్తుంది?
కానీ ప్రకృతి మనిషినే కాదు, జీవరాశినే అలా పుట్టించలేదు. ప్రతిదీ దానికదే భిన్నమైనది. ఉదాహరణకు కంచర గాడిదల చర్మాలు జాగ్రత్తగా చూడండి. అన్నీ నలుపూ తెలుపూ చారలే. కానీ ఏ ఒక్క చార కూడా ఇంకో చారను పోలివుండదు. ఏ ఒక్కదాన్ని పోలిన చారలు ఇంకోదానికి ఉండవు. వాటిదైన చర్మపుముద్ర అది! ప్రతి చెట్టు, ఆకు, పువ్వు – ఏ ఒక్కటీ ఒకే రకంగా ఉండవు. కానీ స్థూలంగా అంతా ఒకటే.
ఆ సూక్ష్మమైన తేడానే ఎవరికి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కానీ అదే పోగొట్టుకుంటున్నామా అని అనుమానం. ‘‘ప్రతి మనిషికంటూ ఉన్న తనదైన రహస్యం ఏదో మాయమైపోయి, అది కేవలం సమాచారంతో భర్తీ అయిపోయింది. జీవిత రహస్యానికీ, ఈ సమా చారానికీ ఏ సంబంధమూ లేదు. ఈ జీవిత రహస్యం అనేది కొంచెం సంక్లిష్టమైనదీ, సులభంగా అర్థం చేసుకోలేనిదీ. దాని చుట్టూ మనం నర్తించగలం, అబ్బురపడగలం. కానీ అది కిలోబైట్లు, గిగా బైట్ల సమాచారంతో మాత్రం భర్తీ చేసుకోలేనిది’’ అంటారు స్వెత్లానా అలెక్సీవిచ్.
చెర్నోబిల్ దుర్ఘ టన, సోవియట్ పతనం, సోవియట్– అఫ్గానిస్తాన్ యుద్ధం లాంటి బీభత్సాల అనంతరం స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరితోనూ స్వెత్లానా మాట్లాడారు. బాధిత జనాల్ని ఇంటర్వ్యూలు చేస్తూ వెలువరించిన మౌఖిక చరిత్రలకుగానూ రష్యన్ భాషలో రాసే ఈ బెలారూస్ పాత్రికేయురాలు నోబెల్ గౌరవం పొందారు. ‘‘ప్రపంచంలో ఎటు చూసినా ఈ ‘బనాలిటీ’ (ఒరిజినాలిటీ లేకుండా పోవడం) నిండిపోయివుంది.
వారిదైన సొంత మాట మాట్లాడేస్థాయికి తేవాలంటే మనుషులలోని దీన్ని ఒలిచెయ్యాలి. అప్పుడు మాత్రమే వాళ్లు అంతకు ముందు ఏ మనిషీ చెప్పలేని మాటలు చెబుతారు. మనుషులను ఆ స్థాయికి తీసుకెళ్లడం నాకు ముఖ్యం’’ అంటారు స్వెత్లానా. అప్పుడు మాత్రమే ‘‘నాకు అది తెలుసని నాక్కూడా తెలియదు’’ అని వాళ్లే ఆశ్చర్యపోతారు.
యుద్ధం లేదా అత్యంత విపత్కర పరిస్థితుల్లోనే మనిషి ఉద్వేగమూ, వివేకమూ పైస్థాయికి వెళ్తాయి. విషయం మొత్తాన్నీ చాలా పైచూపుతో చూడగలిగే దృష్టి అలవడుతుంది. ఆ స్థితిలో చేయగలిగే వ్యాఖ్యానం జీవితాన్ని దర్శింపజేస్తుంది. అందుకే ప్రపంచంలో చాలా కళాఖండాలు యుద్ధ ఫలితంగా పుట్టాయి. కానీ గొప్ప కళ సంభవించడం కోసం కల్లోలం జరగకూడదు. కళ కంటే కూడా ఏ కాలంలోనైనా ప్రాణం ముఖ్యం. అందుకే మామూలు జీవితాన్నే మహత్తరంగా మార్చుకో గలగడం తెలియాలి. ‘ఒక పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బతుకుతా’నన్న కవీంద్రులం కావాలి.
జీవితంలో నలిగిపోయిన మనిషి మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఆ నలిగిన మనిషి ఎవరు? ఆ ప్రశ్నకు జవాబు: ఎవరు కాదు? ప్రతి ఒక్కరూ జీవితాన్ని గొప్ప దృష్టితో చూడగలగడానికి అర్హులే అయినప్పుడు మరి అందరూ ‘ఒకే రకం’ అన్న ఫిర్యాదు ఎటుపోయింది? సమాచార బదలాయింపు అనే అర్థంలేని మాటలకే మనం పరిమితమవుతున్నాం కాబట్టి.
నిజంగా ఒక లోలోతైన సంభాషణ జరగడానికి అవకాశం ఇస్తున్నామా? మాట్లాడే మనుషులు ఉండటమే కాదు, ఆ మాటలకు అంతేస్థాయిలో ప్రతిస్పందించగలిగేవాళ్లు కూడా ఉన్నప్పుడే గొప్ప సంభాషణలు జరుగుతాయి. సాంకేతికంగా అవి ఎక్కడా రికార్డు కాకపోవచ్చుగాక. కానీ మూకుమ్మడి మానవాళి ఉద్వే గపు సంరంభంలో అజ్ఞాతంగా భాగమవుతాయి. వివేకపు రాశులుగా పోగుపడి మనల్ని వెనకుండి నడుపుతాయి.
ఆ జీవన సంగీతం చాలా సున్నితమైనదీ, చెవి నుంచి చెవికి సోకేంత రహస్యమైనదీ, వెన్నెల కింద నానమ్మ పక్కన పడుకుని ఏమీ మాట్లాడకుండానే ఏదో అర్థం చేసుకోవడం లాంటిదీ! ఆ జీవనసంగీతమే ప్రపంచంలో వ్యాపిస్తున్న నిర్హేతుకత, మూర్ఖత్వాలకు జవాబు కాగలదు.
జీవన సంగీతం
Published Mon, Jun 20 2022 1:34 AM | Last Updated on Mon, Jun 20 2022 1:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment