కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నవారిని విమర్శించడానికి మనసొప్పదు. వారు తప్పు చేసినా సరే. కానీ ఇదేంది జీ? మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టాలనిపిస్తున్నది? మీరు సింపతీ కోసం లీక్ చేసిన పడక సీన్ ఫోటోలను చూసి ఉన్నప్పటికీ... మిమ్మల్ని తిట్టకుండా ఉండటం సాధ్యం కావడం లేదు. ఇది ఒక్కడి తహతహ కాదు. లక్షలాదిమంది మానసిక స్థితి. ఉన్మత్త ప్రేలాపనలతో మీరు అచ్చొత్తి ఫ్రీగా పంచుతున్న మీ అశుద్ధ పత్రికను చదివిన పాఠకులు అస్వస్థతకు గురవుతున్నారు. మీ కడుపు నొప్పితో, మీ కక్కుడు పారుడు రోగంతో జనసమూ హంలో జుగుప్సాకర వాతావరణాన్ని తయారు చేస్తున్నారు జీ. మంచిది కాదు జీ. మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ కుతంత్రాన్ని పన్నుతున్నారో ఆ ప్రయోజనం నెరవేరేది కాదని మీకు తెలియదా? అయినా... ఏమో గుర్రం ఎగరకపోతుందా అనే దింపుడు కళ్లం ఆశతో ఇంత దిగజారుడుతనం వాంఛనీయం కాదు జీ!
మీ పేరు చివర జీ అక్షరం వింతగా ఉన్నది జీ. అది పెట్టుడు పేరో, దత్త పేరో తెలియదు గానీ అందులో తెలుగు దనం, తెలుగు సంప్రదాయం లేదు జీ. ‘తెలుగు భాష కోసం పుట్టిన ఏకవీర నేనే’నని తమరు వీరతాళ్లు వేయించుకుంటారు కదా! ఈ మరాఠీ సంప్రదాయ పేరు అందుకు నప్పలేదు జీ. ఇంగ్లిషు పదాలకు మీ విషపత్రికలో చేసే తెలుగు అనువాదా ల్లాగే ఉన్నది. ‘పిల్లి కాదు మార్జాలం’ అన్నట్టుగా ‘కుప్పుస్వామి అయ్యర్ మేడ్ డిఫికల్ట్’ అన్నట్టుగా మీ పత్రిక అనువాదాలుంటాయి. ఇదీ అలాగే ఉన్నది. దగుల్బాజీ అనే మాట పారశీక సంప్రదాయం నుంచి వచ్చిందేమో కానీ శతాబ్దాల కిందనే తెలుగులో కలిసిపోయింది. కనుక చివర్లో జీ ఉన్నప్పటికీ అది తెలుగు మాటగానే రూపాంతరం చెందింది. ఆ మాటను జనసామాన్యం యథేచ్ఛగా వాడేస్తున్నప్పటికీ దాని అసలు అర్థం మోసగాడు అనే! ఈ పేరేదో బాగా అతికినట్టున్నది. చూస్తారా?
మీరు మోసగాళ్లే కదా జీ. అలా అని పలు సందర్భాల్లో కోర్టులు కూడా అభిప్రాయపడ్డాయిగదా జీ! ఎన్టీ రామారావు కూడా అదే అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించినట్టు న్నారు కదా! జీజే రెడ్డి సహకారంతో మీరు వ్యాపారంలో వేసిన తొలి అడుగుల్లో మోసం లేదా? యాభయ్యేళ్ల కింద మీరు విశాఖపట్నంలో ‘ఈనాడు’ ప్రారంభించినప్పుడు మిమ్మల్ని నమ్మి భూమి లీజుకిచ్చిన ఆదిత్య వర్మకు మీరు చేసిందేమిటి? మోసమే కదా! అది రుజువైంది కదా! దాన్ని దగుల్బాజీ వ్యవ హారం అంటారా అనరా? పైగా వర్మ భూమిని కొంతభాగం రోడ్డు విస్తరణకు అప్పగించి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని తమరు కైంకర్యం చేయలేదా జీ! దీన్నేమంటారు? ఈ వ్యవహారంలో మీ మీద ఫోర్జరీ కేసు పెట్టాలని న్యాయస్థానం ఆదేశించలేదా? ఫోర్జరీ కూడా మోసమే కదా!
సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫిలిం సిటీలో వేలాది ఎకరాల భూమిని మీరు పోగేశారని రెవెన్యూ అధికారులు నిర్ధారించలేదా? అది మోసం కాదా? ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని కూడా భోంచేశారు కదా! చిట్‌ఫండ్ పేరుతో ఫిలింసిటీలో ఉన్న 137 ఎకరాల భూమి చట్టప్రకారం చందాదారులకు దక్కాలి కదా? మీరెందుకు చంకలో పెట్టుకున్నారు? మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మీరు వసూలు చేసిన 2600 కోట్ల డిపాజిట్లు మోస పూరితమైనవిగా రిజర్వ్ బ్యాంక్, సుప్రీంకోర్టులు నిర్ధారించాయా, లేదా? చిట్‌ఫండ్స్ పేరుతో మీరు మోసగించారని చందాదారులు ఫిర్యాదులు చేశారా, లేదా? సీఐడీ కేసు నడుస్తు న్నదా, లేదా? ఇంకా చెప్పాలా? అబ్బబ్బ... తనువంతా ఇన్ని మచ్చలేంది స్వామీ? పైగా వేరొకరిపై నిత్యం అభాండాలా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకుంటున్నారా?
ఎన్టీ రామారావు ఏమన్నారు? మీ పత్రిక ఓ చెత్త కాగితాల కట్ట. మీరు గోబెల్స్‌ను మించిన దుష్ప్రచారకులు. తిమ్మిని బమ్మిని చేయడమే మీ నైజం. చివరికి మీరు చరిత్ర పెంట కుప్పలోనే మిగిలిపోతారు. అవే మాటలు కదా ఆయనో ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ ఘడియలు తరుముకొచ్చి నట్టున్నాయి కదూ! అనారోగ్యంతో మంచం మీద ఉంటే మా నాన్న కాగితాల మీద సంతకాలు తీసుకున్నారనీ, నానా మాటలు అన్నారనీ స్వయంగా మీ కుమారుడే చెప్పిన విషయం మర్చిపోయారా? మీ విశ్వసనీయతకు ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఇంకేముంటుంది? ఇంతటి ఘనత వహించిన తమరు చిత్తం వచ్చినట్టు కాకమ్మ కథలు చెబితే జనం నమ్ముతారా?
ఈ కాకమ్మ కథలనూ, కనికట్టు రాతలనూ ఎవరూ ఊహించలేని అధమాధమ స్థాయికి తీసుకెళ్లారేమిటి జీ? పత్రికా ప్రమాణాల పాతాళం డైవింగ్‌లో మీ రికార్డులను మీరే బద్దలు కొట్టారు. హుర్రే! ఈ ఫీట్ ఇంకెవడి వల్లా కాదు. ఈ వయసులో అదేదో బూస్టర్ గోళీ వేసుకున్నట్టు ఇంత ఉన్మత్త ఆవేశమేమిటో? కారణముందిలే! అసలే జగన్‌మోహన్‌రెడ్డి అంటే అస్సలు పడదు. ఆయన పేద వర్గాల రాజకీయ ప్రతినిధి. తమరు పెత్తందారీ వర్గాల కులగురువుగా నేమ్ ప్లేట్‌ను వాకిట్లో తగిలించుకున్నవారు. అయిదేళ్లుగా మీ వర్గం ఆటలు సాగడం లేదు. మీ కాకమ్మ కథలు పండటం లేదు. పేదలకు చదువు చెబుతున్న సర్కారు బళ్లు ఆధునికతను సంతరించు కున్నాయి. మీ పెత్తందారీ వర్గ పిల్లలతో సమానంగా పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకోగలుగుతున్నారు.
నాణ్యమైన వైద్యం పేదల ఇంటి ముంగిట్లోకి వచ్చింది. కార్పొ రేట్ వ్యాపారులకు సెగ తగిలింది. చిన్న రైతులకు వ్యవ సాయం గిట్టుబాటు కావడం మొదలైంది, లాభాల బాట వైపు కూడా పయనం ప్రారంభమైందని దేశదేశాల నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి చూస్తున్నాయి. ప్రభుత్వ చేయూతతో సామాన్య మహిళలు సైతం సంపద సృష్టిలో పాల్గొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. రిటెయిల్ వ్యాపారం అనూహ్య లాభాలనార్జిస్తున్నది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు దేశంలోనే అగ్రస్థానంలో పెరుగుతున్నది. కరోనా కాటేసిన కాలం పోగా మిగిలిన స్వల్పకాలంలోనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. పెత్తందార్లు పంచుకు తినవలసిన సొమ్ము ప్రజల చేతుల్లో వృద్ధి పొందుతున్నది. జగన్‌మోహన్‌రెడ్డి మీద పెత్తందారీ వర్గా నికి కంటగింపు కలగడానికి ఈ కారణాలు చాలవా?
తప్పుడు ప్రచారాలతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో అపోహలు సృష్టించడానికి గురు పత్రిక నాయకత్వంలోని యెల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అయినా ఫలితం కనిపించడం లేదు. నిరాశా నిస్పృహలతో ఆ మీడియా హద్దుల్ని దాటేస్తున్నది. మర్యాదలను అతిక్రమిస్తున్నది. సంప్ర దాయాలను చాపచుట్టేసింది. కనీస ప్రమాణాలను కూడా అటకెక్కించింది. గజ్జి సోకిన గ్రామ సింహాల్లా యెల్లో మీడియా వర్తిస్తున్నది. వారి ఖర్మ కొద్దీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఘట్టం ఇప్పుడే వచ్చింది. పీఠంతో కలిపి 206 అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహం. ప్రపంచంలో అంబేడ్కర్ విగ్రహా లన్నిటిలోకీ పెద్దది. విజయవాడ నడిబొడ్డున ఖరీదైన ప్రాంత మైన బందర్ రోడ్డుపై పద్దెనిమిదిన్నర ఎకరాల స్వరాజ్ మైదాన్ ఆయన స్మృతివనానికి వేదికైంది.
పెత్తందారీ వర్గానికి ఇది మరో కంటగింపు కారణం. ప్రాంతీయ పెత్తందారీ వర్గా నికీ, ఆ వర్గం వైభవానికీ గుర్తు బందర్ రోడ్డు. ఈ రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు పోనూ మిగిలిన ఖరీదైన భవనాల్లో ముప్పాతిక శాతానికి పైగా ఒకే వర్గ పెత్తందారీ కుటుంబాల వారివే. విజయవాడ నగరంలో ఏం జరగాలన్నా బందర్ రోడ్డు బాద్షాలు ఎస్ అంటే ఎస్! నో అంటే నో!! రాష్ట్ర విభజన తర్వాత బందర్ రోడ్డు మీదుగా ఒక మెట్రోలైన్‌ను కేంద్రం కేటాయించింది. మనవాళ్ల భవనాలు చాలా కూల గొట్టవలసి వస్తుంది కనుక నాటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది. చంద్రబాబు పార్టీకి అభివృద్ధి అంటే పెత్తందారీ వర్గం అభివృద్ధి మాత్రమే! వారికి నష్టం కలిగించే అభివృద్ధిని అస్సలు సహించరు.
మెట్రోలైన్‌నే కాదు రోడ్డు విస్తరణను సైతం ఈ వర్గాలు అడ్డుకున్నాయి. ఇదే రోడ్డు మీద లీజుకు తీసుకున్న స్థలంలో తిష్ఠ వేసిన ‘ఈనాడు’ జీ రోడ్డు విస్తరణకు ససేమిరా అన్నారు. మూడు దశాబ్దాలపాటు భూ యజమానిని ముప్పుతిప్పలు పెట్టి రెండు దశాబ్దాల పాటు రోడ్డు విస్తరణను అడ్డుకొని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇరవై రోజుల కింద తట్టాబుట్టా సర్దుకొని, అన్ని గేట్లూ మూసుకొని తరలిపోవలసి వచ్చింది. చెన్నయ్‌లోని ‘ది హిందూ‘ కార్యాలయాన్ని ‘మౌంట్ రోడ్ మహావిష్ణు’ అనేవారట. అదేవిధంగా తన కార్యాలయాన్ని కూడా బందర్ రోడ్డు బాద్షాగానో, జాంగ్రీగానో పిలిపించు కోవాలని ఆయన ఆశించాడట! కానీ కథ అడ్డం తిరిగింది.
వందేళ్ల కిందట ఒకసారి స్వరాజ్ మైదాన్‌లో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో దళిత సంఘాల సభ జరిగిందట! అప్పుడు స్థానిక పెత్తందార్లు కొండ మీద ఉన్న అమ్మవారి ఆలయం తలుపులు మూయించారట. దళితులు ఆలయానికి రాకూడ దన్న దుష్ట తలంపుతో! ఆ పెత్తందార్ల ఆటలు ఏదో రూపంలో సాగుతూ వచ్చాయి. ఇప్పటిదాకా ఒక లెక్క. ఇప్పుడొక లెక్క! ఇప్పుడు బెజవాడంటే కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేడ్కర్! జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత స్క్రీన్‌ప్లే మారింది. పెత్తందార్లు, వారి మీడియా కడుపు మంట ద్విగుణం, త్రిగుణం కావడానికి ఈ పరిణామాలన్నీ కారణం. ఆ కడుపు మంట ఫలితమే విగ్రహావిష్కరణ రోజున యెల్లో పత్రికల నిండా పరుచుకున్న అశుద్ధం.
ఆ పద్దెనిమిది ఎకరాల్లో ఓ పెద్ద మాల్ కట్టించి తన వాళ్లందరూ వ్యాపారాలు చేసుకునేలా చూడాలని అప్పట్లో చంద్ర బాబు ప్లాన్ చేశాడట! మిగిలి ఉన్న కొన్ని ప్రభుత్వ కార్యా లయాలను ఎక్కడికన్నా తరలిస్తే బందరు రోడ్డు మీద ఇక తమదే గుత్తాధిపత్యం. కలలు చెదిరిపోయి ఇప్పుడు అంబే డ్కర్ వచ్చి చేరాడు. అదే బందరు రోడ్డు మీద ముప్పయ్యేళ్ల క్రితం తమ పెత్తనాన్ని ధిక్కరించిన వంగవీటి రంగాను అడ్డు తొలగించుకోగలిగారు. ఇప్పుడెట్లా? మింగలేక కక్కలేక చస్తు న్నారు. అంబేడ్కర్‌పై ప్రేమ లేకున్నా అది బయటకు ప్రకటించలేరు. దళితులపై భూస్వాముల దాడులు, దౌర్జన్యాలకు ‘ఈనాడు’లో మొదటి నుంచి ప్రాధాన్యత లభించేది కాదు. కారంచేడులో దళితుల నెత్తురు ఏరై పారినప్పుడు కూడా ఆ పత్రికలో ఓ చిన్న క్రైమ్ వార్తగానే వచ్చింది. అటువంటి ‘ఈనాడు’ అంబేడ్కర్ ఆశయాల పట్ల గౌరవాన్ని నటిస్తూ ఒక దిక్కుమాలిన వార్తను అచ్చేసింది.
‘అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకెక్కడిది జగన్’ అంటూ జీ పత్రిక ఒక ఫుల్‌పేజీని కేటాయించింది. అంబేడ్కర్‌కు ముడిపెడుతూ తలాతోకా లేని ఓ పది పాయింట్ల సొల్లు కార్చారు. ఈ చచ్చు పాయింట్లకు గ్రామసీమల్లోని ఏ సాధారణ పౌరుడైనా గట్టిగా సమాధానం చెప్పగలడు. అంత పారదర్శ కంగా జగన్ ప్రభుత్వం తన విధానాలను అమలు చేస్తున్నది. మద్యనిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం మద్యాన్ని పారిస్తున్నదట! దశలవారీ మద్య నియంత్రణకు వైసీపీ హామీ ఇచ్చిన మాట నిజం. ఆ హామీకి కట్టుబడి 43 వేల బెల్ట్‌షాపులను తొలగించారు. మద్యం ప్రైవేటు వ్యాపారాన్ని రద్దు చేసి నియంత్రణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసు కున్నది. 4,380 నుంచి 2,934 వరకు షాపుల సంఖ్యను తగ్గించారు. రాత్రి తొమ్మిది గంటల వరకే అమ్మకాలకు అనుమతి నిచ్చారు. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం.
సహజ వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగేలా వినియోగించుకోవాలని అంబేడ్కర్ చెప్పారు. జగన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నదని ‘ఈనాడు’ భాష్యం. ఇసుక మీద ప్రభుత్వానికి ఎవరి హయాంలో ఆదాయం వచ్చింది? గ్రానైట్, సున్నపు రాయి, మాంగనీస్, రోడ్ మెటల్... ఇలా మైనింగ్ కారక్రమాలన్నింటిలో ఏ ప్రభుత్వం హయాంలో ఎక్కువ ఆదాయం వచ్చింది? ఈ లెక్క లేవీ చెప్పకుండా బట్టకాల్చి మీద వేసే బద్మాష్ గిరీకి ‘ఈనాడు’ పాల్పడింది. ఆదాయాలకు మూలమైన పరిశ్ర మలను ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవని అంబేడ్కర్ చెప్పారు.
కానీ జగన్ ప్రభుత్వానికి భారీ పరిశ్ర మలను తీసుకు రావడం సాధ్యం కాలేదట. పైపెచ్చు కొన్ని పరిశ్రమలు పారిపోయాయట. రాష్ట్రంలో తమ కార్యక్రమా లను విస్తరించబోతున్నట్టు అమరరాజా గ్రూప్ అధికారికంగా ప్రకటిస్తే ఆ సంస్థ పారిపోయిందంటూ ‘ఈనాడు’ గీకి పారే సింది. జగన్ హయాంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో ఒక్క పరిశ్రమల శాఖ ద్వారానే 99 ఒప్పందాలు జరిగితే ఇప్పటికే 78 యూనిట్లు పని ప్రారంభించాయి. ఇంకో 21 ఒప్పందాలకు సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం ఒప్పందాలు 386. వీటిద్వారా ఆరు లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా.
చంద్రబాబు హయాంలో కూడా ఇటువంటి మీట్ జరిగింది. పార్టీ కార్యకర్తలకు కోట్లు వేసి నకిలీ ఒప్పందాలు చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. అప్పటికీ ఇప్పటికీ ఏమైనా పోలిక ఉన్నదా?ఇంగ్లిష్ మీడియంలో చదువొద్దని అంబేడ్కర్ చెప్పారట. జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదట! పేద వర్గాల ఇంగ్లిష్ చదువుల మీద పెత్తందార్లు ఎంత ద్వేషం పెంచుకున్నారో ఈ అభూత కల్పనను చూస్తేనే అర్ధమవు తుంది. ఇంగ్లిష్ మీడియంపై ఏ అంబేడ్కరిస్టుతోనైనా ఓ గంటసేపు మాట్లాడి ఉంటే ఎంతోకొంత జ్ఞానోదయమై ఉండేది. ప్రతిపక్షాలు, పత్రికలు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని అంబేడ్కర్ చెబితే జగన్ ప్రభుత్వం వారిని రాచిరంపాన పెడు తున్నదట. అధికారంలో ఉన్న వారిని పచ్చి బూతులు తిట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, అసత్య ప్రచారాలకు తెగ బడినా సరే కేసులు పెట్టొద్దని అంబేడ్కర్ ఎక్కడ చెప్పాడో మాత్రం ఆ పత్రిక చూపెట్టలేకపోయింది.
ఇటువంటి తలాతోకా లేని పాయింట్లతో కార్యక్రమాన్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నించిన యెల్లో మీడియా గుండెలు గుభేల్ మనేలా, కళ్లలో గుంటూరు కారం మండేలా లక్షలాదిమంది పేద వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ జైత్రయాత్ర ఏప్రిల్‌లో ఎన్నికలు ముగిసేవరకే కాదు, ఆ తర్వాత కూడా కొనసాగనున్నది. ‘తెలుగుదేశం’ రాజ కీయ కూటమి పెద్దలూ, యెల్లో మీడియా గద్దలూ అందరూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఎందుకైనా మంచిది. కౌంటింగ్ రోజున వారందరి ఇళ్ల ముందు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత. కడుపు మంట అదుపు తప్పితే ఏమౌతుందో ఏమో!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
దగుల్బాజీ పాత్రికేయం!
Published Sun, Jan 21 2024 12:01 AM | Last Updated on Sun, Jan 21 2024 11:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment