
ఒకటి కాదు... రెండు కాదు... మూడు దశాబ్దాల పైగా సుదీర్ఘ నిరీక్షణ. ఎట్టకేలకు అది ఆదివారం నాడు ఫలించింది. కశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో సరికొత్త మల్టీపర్పస్ సినిమా హాళ్ళు రెండింటిని జమ్మూ–కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రారంభించారు. అలాగే, కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్ సైతం 3 స్క్రీన్లతో మంగళవారం శ్రీనగర్‌లో మొదలైంది. పాలకులు చెబుతున్నట్టు కశ్మీర్‌లో సినీ రంగానికి ఇది చరిత్రాత్మక దినమే. 1980ల తర్వాత టీవీలో, ఇటీవల ఓటీటీలలో తప్ప థియేటర్లలో పదుగురితో కలసి సినీ సందర్శన అనుభవమే లేని కొత్త తరానికి ఇది మరో ప్రపంచపు స్వాగతమే. అదే సమయంలో వెండితెరతో పాటు జనజీవితాలూ వెలిగిపోవడానికి ఇది సరిపోతుందా?
తీవ్రవాదంపై పోరులో తెరపై గెలిచే సినిమా... నిజజీవితంలో అదే తీవ్రవాదానికి దశాబ్దాలుగా బాధితురాలవడమే విచిత్రం. మిగిలిన భారతీయుల్లా కల్లోలిత కశ్మీర్ వాసులూ సాధారణ జీవితం గడపడానికీ, తీరికవేళ సినీవినోదాన్ని ఆస్వాదించడానికీ ఈ కొత్త సినిమా హాళ్ళు ఉపకరిస్తాయని భావన. అందుకే, ప్రతి జిల్లా ముఖ్యపట్టణంలో సినిమా హాలు నెలకొల్పాలని పాలకుల నిశ్చయం. అలా కేంద్రపాలిత జమ్మూ – కశ్మీర్‌లోని 20 జిల్లాల్లోనూ థియేటర్లు పెడతారు. జిల్లా పాలనా యంత్రాంగంతో కలసి ప్రభుత్వ ‘మిషన్ యూత్ డిపార్ట్‌మెంట్’ ఈ థియేటర్లను నెలకొల్పుతుంది. వాటి నిర్వహణను నిపుణులకు అప్పగిస్తారు. ఇందులో భాగంగా అనంతనాగ్, శ్రీనగర్, రాజౌరీ, పూంbŒ∙లాంటి చాలాచోట్ల త్వరలో సినీ వినోదశాలలు రానున్నాయి. అక్కడ సినిమా షోలతో పాటు విజ్ఞానభరిత వినోదం, యువతకు నవీన నైపుణ్యాభివృద్ధి వసతులు కల్పించాలని ప్రణాళిక.
కనువిందైన మంచు కొండలు, కాదనలేని డాల్ సరస్సులో నౌకా విహారం వగైరాతో అందమైన ప్రకృతి, ఆహ్లాదభరిత వాతావరణంతో చాలాకాలం సినిమా షూటింగ్‌లకు కశ్మీర్ కేంద్రం. రాజ్ కపూర్ నుంచి తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్, చిరంజీవి సినిమాల దాకా అన్నీ కశ్మీర్ అందాలను కెమెరాకంటితో బంధించినవే. 1989 నాటి వేర్పాటువాద విజృంభణతో ఆ పరిస్థితే పోయింది. మరోపక్క ఎందరో కశ్మీరీలు హిందీ చిత్రసీమలో పేరు తెచ్చుకున్నా, ఎప్పుడో 58 ఏళ్ళ క్రితం తొలి పూర్తినిడివి కశ్మీరీ ఫీచర్ ఫిల్మ్ ‘మైంజ్ రాత్’తో మొదలైన ‘కశ్మీరీ భాషా సినీపరిశ్రమలో ఇప్పటికీ ఎదుగూబొదుగూ లేదు. తర్వాత కొద్ది ఫిల్మ్‌లే వచ్చాయి. తీవ్రవాదుల భయానికి స్థానిక, పరభాషా చిత్రాల నిర్మాణం రెండూ స్తంభించాయి. చిత్రప్రదర్శనపై అప్రకటిత నిషేధం వచ్చిపడింది.
నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం, అనంతర పాలకులూ థియేటర్లు తెరిచేందుకు ప్రయత్నించినా తీవ్రవాద దాడులతో అవేవీ విజయవంతం కాలేదు. పైరసీ రాజ్యమేలుతోంది. హాలులో సినిమా చూడడానికి సినీప్రియులు కశ్మీర్ దాటి పొరుగు రాష్ట్రాలకు వెళుతున్న పరిస్థితి. లోయలో సాధారణ పరిస్థితి తెస్తున్నామంటూ 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన పాలకులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్ము – కశ్మీర్‌ను మళ్ళీ భారతీయ సినీనిర్మాణ పటంపైకి తీసుకురావా లని కేంద్రపాలిత ప్రాంత పాలనాయంత్రాంగం గత ఏడాది ఓ సరికొత్త చలనచిత్ర విధానాన్ని తెచ్చింది. హిందీ నిర్మాతలను మళ్ళీ కశ్మీర్ వైపు ఆకర్షించడానికి ప్రత్యేక వసతులు కల్పించింది. ఇప్పుడీ ప్రయత్నాలన్నిటి వల్ల కశ్మీరీలకు వెండితెర వినోదం అందుబాటులోకి రావడమే కాక, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరిగి, ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగవుతాయనేది ఆలోచన.
వర్తమాన సంస్కృతి, విలువలతో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిఫలించే సినిమా మనోనేత్రానికి ద్వారాలు తీస్తుంది. మతమౌఢ్యంతో అన్నిటినీ నిరాకరించలేం. సౌదీ అరేబియా లాంటి దేశాలు సైతం పంథా మార్చుకొని, సినీ ప్రదర్శనలపై 35 ఏళ్ళ నిషేధాన్ని నాలుగేళ్ళ క్రితం 2018లో ఎత్తివేసి, మార్పును ఆహ్వానించడం ఒక సరికొత్త అధ్యాయం. సినిమా అనే శక్తిమంతమైన సృజనాత్మక సాధనం ఆసరాగా కశ్మీరీలను ప్రధాన స్రవంతిలో మమేకం చేయాలనే ఆలోచన మంచిదే. అయితే, అదొక్కటే సరిపోదు. దాని కన్నా ముందుగా చేయాల్సినవీ చాలానే ఉన్నాయి. ఇలాంటి ప్రతి చిన్న ప్రయత్నం స్థానిక వాణిజ్య కార్యకలాపాలకు కొత్త ప్రోత్సాహమే. కానీ, పాలకులు కశ్మీర్‌కు పారిశ్రామిక పెట్టుబడులు రప్పించి, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచి పోషించాల్సిన లక్ష్యం ఇప్పటికీ సుదూరంగా నిలబడి చేరబిలుస్తోంది.
కశ్మీర్ పండిట్‌ల కన్నీటి గాథలపై ‘కశ్మీరీ ఫైల్స్’ లాంటి ప్రచార చిత్రానికి పాలకులు ఇటీవల అండగా ఉండి, అక్కున చేర్చుకున్నారు. మరి, లోయలో సురక్షితంగా జీవించే పరిస్థితులు ఎందుకు కల్పించలేక పోతున్నారు? వారి సమస్యల పరిష్కారానికి ఇప్పటికీ ఎందుకు పూచీ పడలేకపోతు న్నారు? అవన్నీ జరగాలంటే ముందుగా స్థానిక ప్రజల మనసు గెలుచుకోవాలి. అభివృద్ధి సహా అన్నిటిలో తామూ భాగస్వాములమనే భావన కల్పించాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా తమ ప్రాంతాన్ని తామే పాలిస్తున్నామనే భావన కల్పించాలి. సైనికుల ఉక్కుపాదంతోనో, ఢిల్లీ ప్రభువుల కనుసన్నల్లోని పాలనా యంత్రాంగంతోనో అది సాధ్యం కాదు. నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ నుంచి తాజాగా ఓటర్ల జాబితాలో పేర్ల దాకా రకరకాల జిమ్మిక్కులతో పైచేయి కోసం ప్రయత్ని స్తున్న ఏలికలు దొడ్డిదోవ ప్రయత్నాలు మానుకోవాలి. నిజాయతీగా, నిష్పాక్షికంగా, ఎంత త్వరగా కశ్మీర్‌లో ఎన్నికలు జరిగితే అంత మేలు. కశ్మీర్ సమస్యల పరిష్కారం సినిమాల్లో చూపినంత సులభం కాదు... సినిమాలు చూపినంత సులభం కూడా కాదు. ఆ సంగతి పాలకులకూ తెలుసు!
Comments
Please login to add a commentAdd a comment