కొన్ని సమావేశాలకు ఎక్కడ లేని ప్రత్యేకతా ఉంటుంది. సమయం, సందర్భం, చేపట్టిన అంశం, హాజరయ్యే ప్రతినిధులు – ఇలా అందుకు ఏదైనా కారణం కావచ్చు. మరి, కీలకమైన అవన్నీ కలగలిసిన సమావేశమంటే దానికుండే ప్రాధాన్యం చెప్పనక్కర లేదు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ)కి చెందని ప్రతిపక్షాలన్నీ ఈ శుక్రవారం పాట్నాలో జరుపుతున్న సమావేశం సరిగ్గా అలాంటిదే.
వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఉమ్మడి ప్రణాళికను మథించేందుకు ప్రతిపక్ష నేతలు ఒక దగ్గరకు వస్తున్నారు. ఆలోచన మంచిదే. పాలక పక్షాన్ని ఎదుర్కొనేందుకు ఇది మంచి ప్రయత్నమే. అయితే, ఆచరణలో ప్రతిపక్ష ఐక్యత ఓ ఊహకందని పజిల్ కూడా కావడంతో పాట్నా భేటీ ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యం గనక, ఢిల్లీ గద్దెపై ఎవరి ఆశలు వారికున్న బడా నేతల మధ్య ఐక్యత ఏ మేరకు ఫలిస్తుంది, నిలుస్తుందనే సందేహాలనూ కలిగిస్తోంది.
ఆ మధ్య కొద్దికాలం క్రితమే బీజేపీ వ్యతిరేకిగా అవతారమెత్తిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాషాయ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలనూ ఏకం చేయాలని తపిస్తున్నారు. కొన్నాళ్ళుగా వివిధ పార్టీల అగ్రనేతల్ని కలుస్తూ, కూటమి కట్టడానికి సమాలోచనలు చేస్తున్నారు. అందులో భాగమే పాట్నాలో ఈ మెగా భేటీ. దాదాపు 20 కీలక ప్రతిపక్షాలకు చెందిన నేతలను సాదరంగా స్వాగతించి, ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
నిత్యం కీచులాడుకొంటూ, ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నించే ప్రతిపక్షాల మధ్య ఇది ఓ అపురూప దృశ్యం. ఉమ్మడి కార్య క్రమం, పార్లమెంట్ లోపల – బయట ఉమ్మడి అజెండా, క్షేత్రస్థాయి వ్యూహం లాంటివన్నీ ఈ భేటీ అజెండాలో భాగం. అలా ఇది ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని పెంచనుంది. వచ్చే ఎన్నికలు భీకరపోరు కానున్నాయనే సంకేతం ఇవ్వనుంది. కాషాయ పార్టీకి కంటి మీద కునుకు కరవయ్యేలా చేయనుంది.
ప్రతిపక్షాల ఐక్యతా అజెండాలో అనేకం ఉన్నప్పటికీ, అవి అత్యవసరంగా పరిష్కరించుకోవా ల్సిన సమస్యలూ అనేకం. ముందుగా ఆ పార్టీలు తమ మధ్యనున్న విభేదాలను రూపుమాపుకోవాల్సి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సారథి క్రేజీవాల్ లాంటివారు సుప్రీమ్ కోర్ట్ తీర్పును సైతం పక్కన పెట్టేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఐక్యతా పోరాటాన్ని ఆశిస్తున్నారు.
కానీ, ఆర్డినెన్స్‌పై ఆప్‌ను సమర్థించే విషయంలో కాంగ్రెస్ సందిగ్ధంలో ఉండడం అర్థం చేసుకోదగినదే. ఢిల్లీ, పంజాబ్‌లలో ‘ఆప్’కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. త్వరలో ఎన్నికలు జరగనున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో సైతం చొచ్చుకుపోవాలని ‘ఆప్’ కత్తులు నూరు తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ తమ పార్టీ సామాజిక న్యాయ అజెండానే కాపీ కొట్టారంటూ కేజ్రీవాల్ ఆరోపణలూ చేశారు.
మరి, పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న ఈ పార్టీలు ఎలా కలుస్తాయి? రెండు కత్తులు ఒకే ఒరలో ఎలా ఇముడుతాయి? యూపీలో సమాజ్‌వాది పార్టీకి కాంగ్రెస్, బీఎస్పీలతో; బెంగాల్‌లో తృణమూల్‌కు కాంగ్రెస్, వామపక్షాలతో; ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఉప్పూ నిప్పూ పరిస్థితులే ఉన్నాయి. వాటిని అవి ఎలా సర్దుబాటు చేసుకుంటాయో చూడాలి.
లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడికక్కడ బీజేపీపై ఒకే బలమైన ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టడం చెప్పినంత సులభం కాదు. ఎన్నికల తర్వాత కన్నా ఎన్నికల ముందే ఐక్యతా రాగాలాపనకు పార్టీలకు ఇలాంటి సమస్యలెన్నో! అందుకే, ఐక్య ప్రతిపక్షం ఆలోచన మంచిదైనా, సరైన అజెండా, ఆచరణాత్మక ప్రణాళిక, అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని పక్షాలకూ ఆమోదయోగ్యుడైన ఉమ్మడి నేత లేకపోతే కష్టం.
ప్రతిపక్షాలన్నీ పరస్పర నమ్మకంతో సాగించాల్సిన సుదీర్ఘ ప్రయాణమిది. అలాంటప్పుడు అను మానాల నివృత్తి అయినా, ఆచరణ ప్రణాళికైనా ఒక రోజు మాటల మథనంతో సాధ్యమనుకుంటే అత్యాశ. ఇలాంటి భేటీలు తరచూ జరగాలి. బలమైన పాలకపక్షాన్నీ, జనాకర్షక విన్యాసాల్లో దిట్ట అయిన దాని సారథినీ ఎదుర్కొనాలంటే, ప్రతిపక్షాలన్నీ తమ మధ్య పాత పగలను పక్కన పెట్టాలి.
స్వీయ ప్రయోజనాల కన్నా ఉమ్మడి శత్రువుపై విజయమే వాటి లక్ష్యం కావాలి. అందుకవసరమైతే కొంత త్యాగానికి కూడా సిద్ధం కావాలి. అంతటి దీక్ష, దృఢ సంకల్పం, చిత్త శుద్ధి ఎన్ని పార్టీలకు ఉందన్నది విమర్శకుల సందేహం. అందుకే, ఒక్కరోజు పాట్నా భేటీపై అతిగా అంచనాలు ఎవరికీ లేవు. అదే సమయంలో కలసి పోరాడాలన్న ఆశయంలో ఇది ముందడుగనడంలో అనుమానం లేదు.
ఎన్నికలకు మరో 11 నెలల కన్నా తక్కువ వ్యవధి మాత్రమే ఉన్నందున పాట్నా భేటీ సాక్షిగా ప్రతిపక్షాలు తమలో తాము పట్టువిడుపులు ప్రదర్శించాలి. ఐక్యంగా ఉండడం ఎంత ముఖ్యమో, తమ కూటమి అసలైన ప్రత్యామ్నాయమనే నమ్మకం ప్రజల్లో కల్పించడం అంతకన్నా ముఖ్యం. అలాగే, పాలక నేతకు తమ ప్రత్యామ్నాయం ఎవరో స్పష్టం చేయగలిగి ఉండాలి.
ఒకప్పుడు కాంగ్రెస్, ఇందిరా గాంధీలకు వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో సాగిన ప్రతిపక్ష ప్రయోగం మాదిరిగా... మళ్ళీ అంత నమ్మకం కలిగించగలిగితేనే ఏ కూటమి అయినా ఫలిస్తుంది. ఎన్నికల క్షేత్రంలో ఫలితాలు సాధిస్తుంది. ఏది ఏమైనా, ప్రభుత్వం లోటుపాట్లను ఎత్తిచూపుతూ, ప్రజల పక్షాన నిలదీసే దృఢమైన ప్రతిపక్షం ఉంటేనే ఏ ప్రజాస్వామ్యమైనా నాలుగు కాళ్ళపై నిలుస్తుంది, నడుస్తుంది. తొమ్మిదేళ్ళ తర్వాత దేశంలో ఇప్పుడా అవసరం ఎంతైనా ఉంది. తాజా పాట్నా భేటీ ఆశలు రేపుతోంది అందుకే!
ప్రతిపక్షాల ఆశల పందిరి
Published Fri, Jun 23 2023 12:16 AM | Last Updated on Fri, Jun 23 2023 5:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment