అనుకున్నదే అయింది. ఊహాగానాల్ని నితీశ్ కుమార్ నిజం చేశారు. ‘ఇండియా’ కూటమిలో నుంచి బయటకురావడం, కూటమిలోని ఆర్జేడీతో కలసి బిహార్‌లో నడుపుతున్న సర్కార్‌కు స్వస్తి చెప్పడం, ‘ఎన్డీఏ’లో మళ్ళీ చేరుతున్నట్టు ప్రకటించడం, ముందుగా మాట్లాడిపెట్టుకున్న బీజేపీ మద్దతుతో ఆదివారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. దీంతో, రానున్న ఎన్నికల రాజకీయ నాటకంలో ఒక అంకం ముగిసింది. కొత్త చర్చ మొదలైంది.
తొమ్మిదోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతూ, ఎన్డీఏ నుంచి ఇక అటూ ఇటూ ఎక్కడికీ పోనంటూ నితీశ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరూ నమ్మడం లేదు కానీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ బిహారీ బాబు తాజా పిల్లిమొగ్గల పర్యవసానం ఏమిటి, మోదీపై యుద్ధానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు – ఒక వర్గం ఓటర్లు ఆశపడ్డ ‘ఇండియా’ కూటమి భవితవ్యం ఏమిటి, ఎన్డీఏ కూటమికి ఎంతగా లాభిస్తుందన్న చర్చ ఆగడం లేదు.
తరచూ పొత్తులు మారుస్తూ, నోటికొచ్చిన వివరణతో నెట్టుకొస్తున్న నితీశ్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైన నేత. రెండేళ్ళలో రెండోసారి, దశాబ్ది పైచిలుకులో అయిదోసారి రంగులు మార్చి, తాజాగా తొమ్మిదోసారి పీఠమెక్కి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న ఆయన తీరును పలువురు తప్పుబట్టడంలో ఆశ్చర్యం లేదు. అసలు ‘ఇండియా’ కూటమి కట్టడంలో సూత్రధారే నితీశ్. దశాబ్దాల రాష్ట్ర రాజకీయ అనుభవం అనంతరం జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆయన మోజుపడ్డారు.
కూటమికి సమన్వయకర్తగా వ్యవహరించాలనీ, కాలం కలిసొస్తే రాబోయే ప్రతిపక్ష సర్కారుకు ప్రధాన మంత్రి కావాలనీ కలలు కన్నారు. కానీ, ఛాన్స్ తన దాకా రాకపోవచ్చని గ్రహించేశారు. పీతలబుట్ట లాంటి ప్రతిపక్షాలు, బలం పెరుగుతున్న బీజేపీ లాంటివి చూసి నితీశ్ ప్లేటు తిప్పేశారు. గెలుపు గుర్రంపై పందెం కాస్తే, పీఎం కాకున్నా ప్రయోజనాలైనా నెరవేరతాయను కున్నారు. ‘చస్తే మళ్ళీ వెళ్ళన’ని ఏడాది క్రితం అన్న ఎన్డీఏ కూటమిలోకే నిస్సిగ్గుగా ఫిరాయించారు.
ఇందులో ప్రతిపక్ష కూటమి స్వయంకృతమూ ఉంది. ఆ మధ్య 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు, వాటిపైనే దృష్టిపెట్టి కూటమి తన పనిని పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. అలా 3 నెలల పైనే వృథా అయింది. సార్వత్రిక ఎన్నికల సన్నాహం, ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయ సాధన వెనకపట్టు పట్టింది. కనీసం 300 లోక్‌సభా స్థానాల్లో పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ పట్టుబట్టడమూ కూటమి పక్షాలకు మింగుడుపడలేదు.
పోనీ ఆ డిమాండ్‌కు తగ్గట్టు కాంగ్రెస్ తన బలిమిని చూపగలిగిందా అంటే అదీ లేదు. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింటిలో హస్తం వీగిపోయింది. ‘ఇండియా’ కూటమిలో తనదే పైచేయిగా ఉండాలన్న ఆ పార్టీ ఆశ అడియాసే అయింది. మునుపటంత బలం లేని జాతీయ పార్టీని తమ భుజాలపై మోయడానికి బలమైన ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు. పైగా, కన్వీనర్ అంటూ ఎవరినీ ఎంపిక చేయకపోవడం మరో తప్పిదం. కనీస ఉమ్మడి అజెండా మొదలు సీట్ల పంపిణీ దాకా అన్నిటినీ పేరబెట్టేసరికి చివరకు వ్యవహారం చేయి దాటింది.
ఎన్నికలు కొద్ది నెలల్లోనే ఉన్నా, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఇచ్చినంత ప్రాధాన్యం వాటికి ఇవ్వట్లేదన్నది కాంగ్రెస్‌పై మరో విమర్శ. ఈ యాత్ర ద్వారా ప్రజా బాహుళ్యంలో బలం పుంజుకొని, తమకు మరిన్ని సీట్ల కోసం గట్టిగా బేరం చేయాలనేది ఆ పార్టీ భావననీ ఓ విశ్లేషణ. ఏమైనా, ప్రతిపక్షాలు అనైక్యతతో ఇలా కుమ్ములాడుకుంటూ ఉండగానే, బీజేపీ మాత్రం ఎన్నికలకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను సైతం నియమించేసింది.
గత వారం బులంద్‌షహర్‌లో సభతో ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల సమరభేరి మోగించారు. జైపూర్ లాంటి చోట్ల ర్యాలీలతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కొద్ది నెలల క్రితమే 5 రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడింటిని గెలుచుకోవడం సైతం బీజేపీకి కొత్త ఊపునిచ్చింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి మీడియా, అలాగే కేంద్ర సర్కార్ హంగామాతో హిందూత్వకు మారుపేరుగా ఆ పార్టీ తన స్థానం సుస్థిరం చేసుకుంది.
అందుకే, దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిన ఈ హిందూత్వ ప్రభంజనానికి ఎదురొడ్డడం ప్రతి పక్షాలకు అగ్నిపరీక్షే. పైగా, మందిర్ ప్లస్ మండల్‌గా మారిన బీజేపీ వ్యూహం పదునైనది. మండల్ రాజకీయాల ఉద్ధృతిలో వచ్చిన కుల ఆధారిత పార్టీలకు సెగ తగులుతోంది. అయితే, మోదీ సర్కార్ విభజన రాజకీయాలు చేస్తోందనీ, ప్రజాస్వామ్యానికిది ప్రమాద భరితమనీ అన్న నోటితోనే నితీశ్ మళ్ళీ అదే పంచన చేరడం ఆయన ఇమేజ్‌ను పలచన చేసింది.
కుల సమీకరణలు నిష్ఠురసత్యమైన ప్పటికీ, బిహార్‌లో బలం తగ్గుతున్న నితీశ్‌కూ, ఆయన పార్టీకీ తాజా పిల్లిమొగ్గ అద్భుత భవితను అందించకపోవచ్చు. నితీశ్ నైజం తెలుసు గనక ఆయన్ని అడ్డం పెట్టుకొని, లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాల బిహార్‌లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. అవసరం తీరాక ఆ దోస్తీ కొనసాగకపోవచ్చు. లోక్‌సభ తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లోపు ఏమవుతుందో, మన ‘పల్టూ రామ్’ ఏం చేస్తారో చెప్పలేం.
నెలల క్రితం ఆశ రేపిన ప్రతిపక్ష కూటమి ఇప్పుడు బలహీనమైందన్నది నిజం. కానీ, ఇంతటితో కూటమి కథ ముగిసిందనడం తొందరపాటే. తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ పాలనపై దేశమంతా తృప్తిగా ఏమీ లేదు. ధరలు, నిరుద్యోగం, విభజన రాజకీయాలపై జనంలో అసహనం ఉన్నా, మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం విషాదం.
మోదీని దింపాలనే తప్ప పాజిటివ్ అజెండా చెప్పలేకుంటే ఈ అసంతృప్త, అనిశ్చిత ఓటర్ గణాన్ని ప్రతిపక్షాలు ఆకర్షించలేవు. ప్రతిపక్షాలంటే కుమ్ములాటల కూటమనే భావన తొలగించకపోతే, ఎన్ని ఎన్నికలొచ్చినా అది ఎడ్వాంటేజ్ బీజేపీయే. ఇది వికసిత, ఆత్మనిర్భర్ భారత్ అవునో కాదో కానీ, ‘ఇండియా’ మటుకు వెలిగిపోవడం లేదంటున్నది అందుకే!
పిల్లిమొగ్గల రాజకీయం
Published Tue, Jan 30 2024 12:02 AM | Last Updated on Tue, Jan 30 2024 12:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment