సమాఖ్య స్ఫూర్తిని నిలబెడతారా? | Sakshi Editorial on PM Modi Headed Inter-State Council Reconstituted | Sakshi
Sakshi News home page

సమాఖ్య స్ఫూర్తిని నిలబెడతారా?

Published Thu, May 26 2022 12:36 AM | Last Updated on Thu, May 26 2022 12:38 AM

Sakshi Editorial on PM Modi Headed Inter-State Council Reconstituted

ఆలస్యమైనా ఇన్నాళ్ళకు అవసరమైన చర్య చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. అంతర్‌ రాష్ట్ర మండలి (ఐఎస్సీ)ని ఎట్టకేలకు పునర్నిర్మిస్తూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రధానమంత్రి సారథ్యం వహించే ఐఎస్సీతో పాటు, హోమ్‌ మంత్రి అమిత్‌ షా ఛైర్మన్‌గా మండలి స్థాయీ సంఘాన్ని సైతం ప్రభుత్వం పునర్నిర్మించింది. ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు, అడ్మినిస్ట్రే టర్లను ఐఎస్సీలో సభ్యుల్ని చేశారు. రాజ్యాంగపరంగా మనది వివిధ రాష్ట్రాల యూనియన్‌ అయినా, ఆచరణలో సమాఖ్య స్ఫూర్తి కొరవడుతోందని ఆరోపణలు వస్తున్న వేళ ఈ మండలి పునర్నిర్మాణం స్వాగతనీయం. కాకపోతే, దేశంలో సహకార సమాఖ్య పద్ధతిని ప్రోత్సహించి, అండగా నిలవాల్సిన మండలి ఆ పని చేస్తోందా? రాష్ట్రాల వాదన వినేందుకు క్రమం తప్పకుండా సమావేశమై, కౌన్సిల్‌నూ, జోనల్‌ కౌన్సిళ్ళనూ క్రియాశీలంగా ఉంచాల్సిన ప్రభుత్వాలు దాన్ని ఆచరిస్తున్నాయా?

సర్కారియా కమిషన్‌ సిఫార్సుల మేరకు ఇప్పటికి సరిగ్గా 32 ఏళ్ళ క్రితం 1990 మేలో ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థ – అంతర్‌ రాష్ట్ర మండలి. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండే ‘వస్తు, సేవల పన్ను’ (జీఎస్టీ) మండలి కన్నా, పన్నుల ఆదాయ పంపిణీ చట్రాన్ని సిద్ధం చేసే నిపుణులు సభ్యులుగా ఉండే ఆర్థిక సంఘం కన్నా ఇది భిన్నమైనది. భారత రాజ్యాంగంలోని 263వ అధికరణం ఈ మండలి ఏర్పాటుకు ప్రాతిపదిక. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఈ కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. కొందరు కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులు. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీలోని వివాదాస్పద అంశాలను పరిశీలించి సలహాలివ్వడం కౌన్సిల్‌ పని. కేంద్ర, రాష్ట్రాలకు ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాలను లోతుగా చర్చించడం దాని విధి. వివాదాల పరిష్కారానికీ, ప్రభుత్వ విధానాలు – ఆచరణల మధ్య మెరుగైన సమన్వయానికి సిఫార్సులు చేసే బాధ్యత దానిదే.  

ఆశలు, ఆశయాలు బాగున్నా ఆచరణలో మాత్రం మండలి స్ఫూర్తిని పాలకులు ఎంతవరకు కొనసాగిస్తున్నారంటే అనుమానమే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే తంతు. ఉదాహరణకు, ఐఎస్సీ ఏర్పాటైన నాటి నుంచి 2018 వరకు 28 ఏళ్ళ కాలంలో 12 సమావేశాలే జరిగాయి. పదో సమావేశం 2006లో జరగగా, ఆ తర్వాత దశాబ్ద కాలానికి 2016లో కానీ పదకొండోసారి సమావేశం కాలేదు. 2017లో 12వ భేటీ తర్వాత ఇప్పటి దాకా కౌన్సిల్‌ సమావేశమే అయినట్టు లేదు. ఐఎస్సీ స్థాయీ సంఘమైతే 2005 తర్వాత ఏకంగా పుష్కరకాలానికి 2017లో కానీ సమావేశం కాలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఐఎస్సీ పునర్నిర్మాణం కేంద్ర, రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలను పోగొట్టే చర్చలకు కొత్త ఊపునిస్తుందని ఆశిస్తున్నారు.

నిజానికి కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పలు కమిషన్లు విస్తృత సిఫార్సులు చేశాయి. వాటిలో అమలుకు నోచుకున్నవి తక్కువే. జస్టిస్‌ సర్కారియా సారథ్యంలోని కమిషన్‌ సైతం 1988లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అనేక సిఫార్సులు చేసింది. ఆ కమిషన్‌ చేసిన 247 సిఫార్సుల్లో 35 సిఫార్సులను ఐఎస్సీ తోసిపుచ్చింది. జస్టిస్‌ మదన్‌ మోహన్‌ పుంఛీ సారథ్యంలో ఇదే అంశంపై 2007లో మరో కమిషన్‌ ఏర్పాటైంది. 2010లో ఆ కమిషన్‌ ఇచ్చిన 270కి పైగా సిఫార్సుల్లోనూ అధిక  భాగం అటకె క్కాయి. ప్రభుత్వ చట్టాలపై రాష్ట్రపతి నిర్ణయానికి 6 నెలల గడువు, ప్రధాని – రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన ప్యానెల్‌ కలసి గవర్నర్‌ను నియమించడం లాంటి కీలక సిఫార్సులు పుంఛీ కమిషన్‌ చేసింది. రాజకీయంగా సున్నితమైన ఈ సిఫార్సులను పాలకులు సహజంగానే పక్కనపెట్టేశారు. 

కొంతకాలంగా కేంద్రం తమ హక్కులను హరిస్తోందని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తి పోయి, ఏక కేంద్రక ప్రభుత్వ దిశగా పాలకులు వెళుతున్నారని అనుమానిస్తున్నాయి. ఆర్థిక సమాఖ్య విధానానికీ తూట్లు పడ్డాయంటున్నాయి. జీఎస్టీ సహా వివిధ అంశాలను ఉదాహరిస్తు న్నాయి. రేపు జీఎస్టీ పరిహార చెల్లింపునకు పెట్టుకున్న వ్యవధి ముగిశాక, కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య ఆదాయాల వాటాలో భిన్నాభిప్రాయాలు రావడం ఖాయం. ఈ పరిస్థితుల్లో చర్చల ద్వారా ఘర్షణను నివారించి, సమాఖ్య భావన పరిఢవిల్లాలంటే, అంతర్‌ రాష్ట్ర మండలే శరణ్యం. 15వ ఆర్థిక సంఘం ఛైర్‌పర్సన్‌ ఎన్కే సింగ్‌ సహా నిపుణుల మాటా అదే. ఆదాయమిస్తున్న దక్షిణాదిని కొట్టి, బల హీన ఉత్తరాది రాష్ట్రాలకు పెడుతున్నారనే భావన ప్రబలకుండా చూసుకోవాల్సింది పాలకులే. మెరుగైన పనితీరు కనబరచడమే తమ నేరమైందని వాపోయే పరిస్థితి రాష్ట్రాలకు తేకూడదు. 

ప్రభుత్వాల మధ్య ఈ ఒరిపిడిని నివారించే కీలక సంస్థగా అంతర్‌ రాష్ట్ర మండలి ఎదగాలంటే, ముందు క్రమం తప్పకుండా సమావేశమయ్యేలా ఒక షెడ్యూల్‌ పెట్టుకోవాలి. అలాగే, నిర్ణీత కాలా నికి జరిగే ఈ సమావేశాలు ఫలవంతం కావడం మరీ ముఖ్యం. అందుకోసం మండలికి ఒక శాశ్వత సెక్రటేరియట్‌ ఏర్పాటు చేస్తే మంచిదని నిపుణుల భావన. భారత యూనియన్‌లో ఇప్పటికీ ఓ సంస్థాగతమైన ఖాళీ ఉంది. ప్రభుత్వాల మధ్య ఘర్షణ చేతులు దాటక ముందే, పన్ను ఆదాయాల పంపిణీలో అసమానతలు ఉన్నాయన్న ఆరోపణలు మరింత బలం పుంజుకోక ముందే ఆ ఖాళీని పూరించాలి. గడచిన రెండు సమావేశాల్లో సహకార సమాఖ్య విధానం, దాని స్ఫూర్తిపై సుద్దులు చెప్పిన కేంద్ర పాలకులు అదేదో ఆచరణలో చూపిస్తే రాష్ట్రాలు సంతోషిస్తాయి. ఆలస్యంగానైనా అంతర్‌ రాష్ట్ర మండలిని పునర్నిర్మించడం ఆ చర్యల్లో తొలి అడుగు అవుతుందని ఓ చిన్న ఆశ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement