ఎన్నిక అపహాస్యమే అయినా... | Sakshi Editorial On Russia Vladimir Putin | Sakshi
Sakshi News home page

ఎన్నిక అపహాస్యమే అయినా...

Published Wed, Mar 20 2024 12:02 AM | Last Updated on Wed, Mar 20 2024 12:02 AM

Sakshi Editorial On Russia Vladimir Putin

అనుకున్నదే అయింది. ఫలితం ముందే నిర్ణయమై, అపహాస్యంగా మారిన రష్యా ఎన్నికల్లో అందరూ ఊహించినట్టే వ్లాదిమిర్‌ పుతిన్‌ అయిదో పర్యాయం అధ్యక్షుడయ్యారు. కంటితుడుపుగా సాగిన రిగ్గింగ్‌ ఎన్నికలన్న విమర్శకుల ఆరోపణలకు తగ్గట్టే ఆయన మునుపెన్నడూ, ఎవరికీ రానన్ని ఓట్లతో అఖండ విజయం సాధించారు. పుతిన్‌ గెలుపు ముందే నిశ్చయమైనా, సోమవారం అధికారిక వెల్లడింపుతో ఒక తంతు పూర్తయింది.

అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో భిన్నాభిప్రాయాలకూ, రాజకీయ పోటీకీ కాసింత అవకాశమైనా ఇచ్చిన 71 ఏళ్ళ ఈ మాజీ గూఢచారి ఇప్పుడు అందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరని తేలిపోయింది. వెరసి, పుతిన్‌ హయాంలో రష్యాలో పాలన నిరంకుశత్వం నుంచి ఏకఛత్రాధిపత్యం, ఏకవ్యక్తి పాలన దిశగా వెళుతున్నట్టు ప్రపంచానికి ఖరారైంది. 

సోవియట్‌ పతనానంతర కాలంలో ఎన్నడూ లేనట్టు రష్యా ఎన్నికల్లో పుతిన్‌ అత్యధికంగా 88 శాతం దాకా ఓట్లు సాధించడం స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రధానిగా అయితేనేం, అధ్యక్షుడిగా అయితేనేం పాతికేళ్ళుగా పీఠంపై ఉన్న పుతిన్‌ ఇప్పుడిక రష్యాపై పూర్తిగా పట్టు బిగించారన్న మాట. అధ్యక్షుడిగా కొనసాగేందుకు వీలుగా ఇప్పటికే ఆయన రాజ్యాంగాన్ని మార్చేశారు. తాజా విజయంతో మరో ఆరేళ్ళు ఆ పదవి ఆయనదే.

ఇలాగే, వచ్చే 2030లో సైతం పుతిన్‌ విజయం సాధిస్తే, కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. అదే జరిగితే, 31 ఏళ్ళ పాటు అధికారం చలాయించిన స్టాలిన్‌ రికార్డును పుతిన్‌ తిరగరాసినట్టవుతుంది. పైపెచ్చు, పుతిన్‌ ఈసారి విజయం సాధిస్తూనే... అమెరికా సారథ్యంలోని ‘నాటో’ కూటమి గనక ఉక్రెయిన్‌లో బలగాలను మోహరిస్తే సహించబోమన్నారు. అదే గనక జరిగితే ‘పూర్తిస్థాయిలో మూడో ప్రపంచ యుద్ధమే’ అని హెచ్చరించడం గమనార్హం. 

నిజానికి, మార్చి 15 – 17 మధ్య జరిగిన తాజా ఎన్నికలు పెద్ద ప్రహసనం. అభ్యర్థులుగా అధి కారిక ఆమోదం పొందిన ప్రత్యర్థులు పేరుకు రంగంలో ఉన్నారు. కానీ, బరిలో నిలిచేందుకూ, పోటీలో గెలిచేందుకూ వారు ఇసుమంతైనా ప్రయత్నించలేదు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న మరో ఇద్దరు పాపులర్‌ వ్యక్తులు సైతం మొదట బరిలో ఉన్నారు. తీరా పుతిన్‌ విజ యంపై ఎంతో కొంత ప్రభావం చూపగల వారి అభ్యర్థిత్వాన్ని సాంకేతిక కారణాలతో తోసిపుచ్చారు.

ఇక గత 2018 ఎన్నికల వేళ పుతిన్‌కు కంటిలో నలుసైన జనాకర్షక ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ గత నెల ఓ ఆర్కిటిక్‌ జైలులో అంతుచిక్కని రీతిలో మరణించారు. మాస్కో యుద్ధం సందర్భంగా రష్యా కలిపేసుకున్న నాలుగు ఉక్రెయిన్‌ ప్రావిన్సుల్లోనూ ఓటింగ్‌ జరిగింది. అయితే, సాయుధ బలగాల కనుసన్నల్లో బలవంతపు ఓటింగ్‌ వల్ల ఫలితం ఏమిటన్నది అర్థమై పోయింది. ఒకపక్క ఎన్నికలు జరుగుతుండగానే రష్యా భూభాగంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు కొనసాగాయి. కీవ్, దాని పాశ్చాత్య భాగస్వామ్య పక్షాల నుంచి మాస్కోకు ముప్పు తప్పదని తేల్చాయి. 

పుతిన్‌ అయిదోసారి గెలిచినా, ప్రజాక్షేత్రంలో అసమ్మతి పుష్కలం. ఫక్తు ఫార్సుగా మారిన ఎన్నికల్ని నిరసిస్తూ, కొందరు ఓటర్లు బ్యాలెట్‌ బాక్సుల్లో రంగు పోశారు. అలాగే, నావల్నీ నివాళికి వేలాది రష్యన్లు హాజరవడం గమనార్హం. అయితే, దేశాన్ని పూర్తిస్థాయి ఏకవ్యక్తి పాలనగా మార్చేసేందుకు పుతిన్‌కు దక్కిన వరం – ఉక్రెయిన్‌తో యుద్ధం. ‘ప్రత్యేక సైనిక చర్య’గా స్వల్పకాలిక దాడితో ఉక్రెయిన్‌పై పైచేయి సాధించాలని ఆయన మొదట భావించారు.

తీరా అది దీర్ఘకాలిక పోరై, నష్టా లకు దారి తీసింది. అయినా, అణచివేత కొనసాగిస్తూ, పాశ్చాత్య ప్రపంచంతో సుదీర్ఘ యుద్ధంలో అంతిమ విజయం మనదేనంటూ రష్యన్లతో పుతిన్‌ నమ్మబలికారు. సలహాదారుల మాట పెడచెవిన పెట్టి, యుద్ధాన్ని ప్రచారంలో ప్రధానాంశం చేశారు. యుద్ధంపై నిరసన నేరమంటూ, నిరసించే పౌరులంతా ‘విదేశీ ఏజెంట్లే’ అంటూ చట్టమే చేశారు. ఎవరేమనుకున్నా మళ్ళీ అధ్యక్షుడయ్యారు.

దేశమంతా తన వెంటే ఉందని చాటేందుకు పుతిన్‌ ఈ ఎన్నికను అవకాశంగా వాడుకున్నారు. అణచివేత మాట అటుంచితే, రష్యాలో ఇప్పటికీ పాపులర్‌ నేతనని నిరూపించుకున్నారు. ఉక్రెయిన్‌తో పోరులోనూ మొదట కొద్దినెలలు గట్టి ఎదురుదెబ్బలు తగిలినా, అనూహ్యంగా ఇప్పటికీ పట్టు నిలుపుకొన్నారు. కఠినమైన ఆర్థిక ఆక్షలు ఎదురైనా, దేశ ఆర్థిక వ్యవస్థను అంచనాలను మించేలా నిలబెట్టగలిగారు.

పాశ్చాత్య బ్రాండ్లు దేశం విడిచివెళ్ళినా, అదే విధమైన స్థానిక ఉత్పత్తులతో సామన్యులపై ప్రభావం పడకుండా చూసుకున్నారు. ముడి చమురు కొనుగోళ్ళకు యూరప్‌ అడ్డం తిరిగినా, భారత్, చైనా, టర్కీలతో ఆదాయం పుష్కలంగా కొనసాగేలా చూసుకున్నారు. రష్యాకు రాజకీయ, ఆర్థిక సుస్థిరత సమకూర్చినప్పటికీ, దేశాన్ని నిరంకుశ పాలనలోకి దింపడమే పెద్ద చిక్కు.

అయితే, ఇష్టమున్నా, కష్టమైనా కనీసం మరో ఆరేళ్ళ పాటు రష్యా సారథి పుతినే. అమెరికా, దాని మిత్రపక్షాలు సహా అందరూ ఆ వాస్తవాన్ని గుర్తించాలి. ఎలాగోలా పుతిన్‌కు నచ్చజెబితే తప్ప ఉక్రెయిన్‌ యుద్ధానికి ఇప్పుడప్పుడే తెర పడే పరిస్థితి లేదని గమనించాలి. పుతిన్‌తో వైరం పెరిగినకొద్దీ అది తూర్పు ఐరోపాకే కాక మొత్తం ప్రపంచానికే తలనొప్పి అని గ్రహించాలి.

పాశ్చాత్యప్రపంచం సైతం తన వైఖరిలోని తప్పులను ఆత్మపరిశీలన చేసుకోవాలి. రష్యాకు మిత్రదేశాలైన భారత్, చైనా లాంటివి ఈ శత్రుత్వ ధోరణి సద్దుమణిగేలా ప్రయత్నించాలి. 2022లో ఉక్రెయిన్‌పై పుతిన్‌ జరపదలచిన అణ్వస్త్రదాడిని ఆపింది భారత ప్రధాని, ఇతర నేతలేనంటూ వస్తున్న తాజా కథనాలు విస్మరించలేనివి. అమెరికా, రష్యాలు రెంటితోనూ బలమైన బంధమున్న భారత్‌ శాంతియుత పరిష్కారానికై కృషి చేయాలి. ఎందుకంటే, ఉక్రెయిన్‌ యుద్ధం మరింత కాలం కొనసాగడం మానవాళికి ఏమాత్రం మేలు కాదు! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement