విజయోస్తు! | Sakshi Editorial On Tokyo Olympics | Sakshi
Sakshi News home page

విజయోస్తు!

Published Fri, Jul 23 2021 12:03 AM | Last Updated on Fri, Jul 23 2021 12:03 AM

Sakshi Editorial On Tokyo Olympics

నూట పాతికేళ్ళ చరిత్ర ఉన్న ప్రపంచ ప్రఖ్యాతమైన ఆటల పండుగకు మళ్ళీ వేదిక సిద్ధమైంది. అనేక సవాళ్ళ మధ్య అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాల్సిన ఒలింపిక్స్‌ క్రీడోత్సవానికి జపాన్‌ రాజధాని టోక్యో ముస్తాబైంది. క్రమశిక్షణ, కచ్చితమైన ప్రణాళికలకు పేరున్న జపాన్‌లో ఇవాళ మొదలవుతున్న ఈ విశ్వక్రీడా సంబరం కోవిడ్‌ బాధిత ప్రపంచంలో కాస్తంత కొత్త ఉత్సాహం నింపుతోంది. 206 దేశాల నుంచి 11 వేల పైచిలుకు అథ్లెట్లు ఇలా పోగై, పోటీలకు దిగడం మానవాళి పోరాటస్ఫూర్తికీ, ఏది ఏమైనా జీవితం ముందుకు సాగాలనే ఆకాంక్షకూ అచ్చమైన ప్రతీక. గతంలో రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో మాత్రమే ఒలింపిక్స్‌ రద్దయ్యాయి. ఒకే ఒక్కసారి – అదీ కరోనా వల్ల గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ ఈ ఏడాదికి మారింది. పోటీల కన్నా ముందే టోక్యో ఒలింపిక్స్‌ గ్రామంలో కరోనా కేసులు పదికి చేరాయి. అలా అనేక భయాల మధ్య జనం లేకుండానే జరుగుతున్న ఒలింపిక్స్‌ ఇవి. అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం కొత్తగా 18 ఈవెంట్లను చేర్చి, పురుషులకు దీటుగా మహిళా అథ్లెట్లకూ 49 శాతం చోటిచ్చి, లింగ సమానత్వ దిశగా అడుగులు వేసిన ఒలింపిక్స్‌ కూడా ఇవే. అందుకే, ఈ విశ్వ క్రీడా సంబరం ఈసారి అనేక విధాల ప్రత్యేకమైనది.

ఊహలకందని ఆట తీరు, ఊహించని విజేతల ఆవిష్కారం ప్రతి ఒలింపిక్స్‌లో ఉండే ప్రత్యేకత. ఈసారీ కరోనా సహా అనేక సవాళ్ళ మధ్య ఈ ఆటల పోరులో, వీలైనన్ని పతకాలు సాధించి సగర్వంగా జాతీయ జెండా ఎగరేయడం కోసం భారత బృందం సిద్ధమవుతోంది. టోక్యోలో మన దేశం నుంచి 18 క్రీడాంశాల్లో 127 మంది బరిలోకి దిగుతున్నారు. కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ, భారత ఒలింపిక్‌ సంఘం ఊహించినంత కాకున్నా, భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో ఇది పెద్ద బృందమే. పదమూడేళ్ళ క్రితం బీజింగ్‌లో కేవలం 12 క్రీడాంశాల్లో మనం పోటీ పడితే, ఈసారి 18 అంశాలకు విస్తరించడం మరో విశేషం. ఈక్వెస్ట్రియన్, సెయిలింగ్, ఫెన్సింగ్, చివరకు స్విమ్మింగ్‌లోనూ మన అథ్లెట్లు నేరుగా అర్హత సంపాదించారు. పోటీ పడుతున్న అనేక ప్రతిభాపాటవ దేశాలతో పోల్చిచూస్తే ఇది పెద్ద విషయం కాదేమో. కానీ, మనవరకు ఇది మంచి పురోగతే!  

నిజానికి, ఇప్పటి వరకు గడచిన 24 ఒలింపిక్స్‌లలో మనం సాధించినవి 28 పతకాలే. ఒలింపిక్స్‌కు వెళ్ళే మన అథ్లెట్ల సంఖ్యకూ, సాధిస్తున్న పతకాలకూ మధ్య నిష్పత్తి ఏమంత గొప్పగానూ లేదు. అయిదేళ్ళ క్రితం 2016లో బ్రెజిల్‌ రాజధాని రియో డిజనీరోలో జరిగిన ఒలింపిక్స్‌ అందుకు ఓ మచ్చుతునక. అప్పట్లో మన దేశం నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది అథ్లెట్లు వెళితే, ఇద్దరే (బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, రెజ్లింగ్‌లో సాక్షీ మలిక్‌) పతకాలతో తిరిగొచ్చారు. కానీ, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 80 మంది చిల్లరే వెళ్ళినా, అరడజను పతకాలు సాధించాం. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో మన అత్యుత్తమ ప్రదర్శన అదే. కాబట్టి, ఒలింపిక్స్‌కు వెళుతున్న అథ్లెట్ల సంఖ్యను బట్టి భారత బృందం సామర్థ్యాన్ని అంచనా వేయలేమని గ్రహించాలి. 

పదమూడేళ్ళ క్రితం 2008 నాటి బీజింగ్‌ ఒలింపిక్స్‌కు మన దేశం నుంచి దాదాపు 55 మంది అథ్లెట్లే వెళితే, మూడు పతకాలు వచ్చాయి. భారత్‌కు ఇప్పటి వరకు వ్యక్తిగత పోటీల్లో దక్కిన ఏకైక బంగారు పతకం అప్పుడే లభించింది. రైఫిల్‌ షూటింగ్‌లో అభినవ్‌ బింద్రా సాధించిన స్వర్ణం అది. అలా ఆసారి మనం పతకాల పట్టికలో 51వ స్థానంలో నిలిచాం. ఆ తరువాత మాత్రం (2012లో 55వ స్థానం, 2016లో 67వ స్థానం) పతకాల పట్టికలో మన స్థానం కిందకే వెళ్ళింది. ఈ నేపథ్యంలో ‘ఇన్ని కోట్ల జనాభా ఉన్న భారత్‌కు కేవలం ఈ మాత్రం పతకాలేనా’ అని పదే పదే వినిపించే అవమానకరమైన ప్రశ్నకు జవాబివ్వడం కోసం అయిదేళ్ళుగా ప్రభుత్వం, ఆటగాళ్ళు శ్రమిస్తున్నారు. కేంద్రం రూ. 1169.65 కోట్ల ఖర్చుతో 18 జాతీయ క్రీడా సమాఖ్యలకూ, 128 మంది ఒలింపిక్స్‌ ఆశావహులకూ అండగా నిలిచింది. అందుకే, మునుపటి కన్నా ఈసారి మరిన్ని ఆశలు మొగ్గతొడిగాయి. 

ఈసారి భారత బృందంలో క్రీడాసంస్కృతి బలంగా ఉన్న హరియాణా, పంజాబ్‌ లాంటి వాటితో పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్‌– ఇలా విస్తృతమైన ప్రాంతీయ వైవిధ్యం చోటుచేసుకుంది. ఏడేళ్ళ వయసులో అనాధగా మారి, జీవితంలో కష్టపడి పైకొచ్చిన రేవతీ వీరమణి (మిక్స్‌డ్‌ రిలే పరుగు) లాంటి కదిలించే కథలున్న వాళ్ళూ ఉన్నారు. పీవీ సింధు, భమిడిపాటి సాయి ప్రణీత్, సాత్విక్‌ సాయిరాజ్‌ (బ్యాడ్మింటన్‌), సానియా మీర్జా (టెన్నిస్‌), వై. రజని (హాకీ), ఆచంట శరత్‌ కమల్‌ (టేబుల్‌ టెన్నిస్‌) లాంటి తెలుగు పేర్లూ ఉన్నాయి. ఇందులో సానియా మీర్జా, శరత్‌ కమల్‌లు నాలుగోసారి ఇలా ఒలింపిక్స్‌లో పాల్గొంటూ ఉండడం విశేషం.

ఇక, ఈసారి ఒలింపిక్స్‌లో షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, జావలిన్‌ త్రో తదితర అంశాలలో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ అంచనా. పతకాల పట్టికలో మన వాటా రెండంకెలకు చేరినా ఆశ్చర్యం లేదని ఆశిస్తున్నారు. అందుకే, భారతీయుల ఆశల దివ్వె ఇప్పుడు ఒలింపిక్‌ జ్యోతిగా వెలుగుతోంది. వెరసి, ఇప్పుడు అందరి కళ్ళూ టోక్యో మీదే! రానున్న ఈ 17 రోజుల్లో... ప్రతిష్ఠాత్మక పతకాల వేటలో... మన ఆశల మూట నెమ్మదిగా తెరుచుకోనుంది. ఈసారి మనం మునుపటి కన్నా ఎక్కువ పతకాలు సాధిస్తామని అధికారులు, అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ ఆగస్టు 8న ఒలింపిక్స్‌ ముగింపు నాటికి ఈ స్వప్నం ఏ మేరకు సాకారమైందో స్పష్టమ వుతుంది. అంతవరకు శతాధిక కోట్ల భారతీయులు అందరి నోటా ఒకటే మాట... విజయోస్తు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement