ఏదైనా కావాలంటే అది ఇచ్చేవరకు మారాం చేస్తూనే ఉంటారు చిన్నారులు. కొందరు మాత్రం... తల్లిదండ్రుల కోపానికి భయపడి, కోరికను మనసులోనే దాచుకుని తమలో తామే బాధపడుతుంటారు. అనిశా దీక్షిత్‌ది ఇటువంటి మనస్తత్వమే. ఆమెకు సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. కానీ తన తండ్రి ‘‘నటనా గిటనా ఏం వద్దు’’ అని గట్టిగా చెప్పడంతో భయపడి మరోసారి నటన ఊసెత్తలేదు.
కానీ అనిశాతోపాటు పెరిగి పెద్దదైన నటనాసక్తి.. డిగ్రీ చదువుతున్నానని చెప్పి యాక్టింగ్ కోర్సు చేసేలా చేసింది. తొలిప్రయత్నంలోనే సినిమా అవకాశం వచ్చినప్పటికీ, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా నిరుత్సాహ పడకుండా యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. జీవితంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లను సానుకూల దృక్పథంతో తీసుకుంటూ ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చనడానికి అనిశా దీక్షిత్ ఉదాహరణగా నిలుస్తోంది.
భారత సంతతికి చెందిన అనిశ్, దివ్యాదీక్షిత్ దంపతులకు జర్మనీలో పుట్టింది అనిశా దీక్షిత్. విదేశంలో ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబం కావడంతో అనిశా అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ పెరిగింది. తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం వీధిన పడినంత పని అయ్యింది. దీంతో బంధువుల ఇంటిలో తల దాచుకున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం, వీధుల్లో చిన్నపాటి వస్తువులను విక్రయించి పొట్ట పోసుకునేవారు. ఇంతటి పేదరికంలోనూ అనిశా మంచి నటిగా ఎదగాలనుకునేది. తన ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి ‘‘నువ్వు నటివి కావాల్సిన అవసరం లేదు’’ అంటూ యాక్టింగ్ కోర్సు చేస్తానంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు.
ఎంబీఏ అనిచెప్పి..
డిగ్రీ పూర్తయిన తరువాత స్విట్జర్లాండ్‌లో ఎమ్‌బీఏ చేస్తానని ఇంట్లో చెప్పి.. అక్కడ ఎంబీఏలో చేరకుండా సీక్రెట్‌గా యాక్టింగ్, మోడలింగ్ కోర్సు చేసింది. వీకెండ్స్‌లో ఇంటికి వచ్చిన ప్రతిసారి అనిశా తండ్రి బిజినెస్‌కు సంబంధించిన విషయాలను అడుగుతుండేవారు. ఆ ప్రశ్నలకు తన స్నేహితురాలితో మాట్లాడి సరైన సమాధానాలు చెబుతూ తండ్రికి అనుమానం రాకుండా చూసుకునేది.
స్విట్జర్‌లాండ్‌లో కోర్సు పూర్తయ్యాక, వెంటనే ఇండియా వచ్చిన అనిశా ముంబైలోని యాక్టింగ్ స్కూల్‌లో చేరింది. ఈ స్కూలు ద్వారానే 2013లో బాలీవుడ్ సినిమా ‘పంజాబ్ బోల్దా’లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆ సినిమా విడుదల అవకముందే తన తండ్రి మరణించారు. ఈ సినిమాను ప్రేక్షకులను ఆదరించకపోవడంతో అనిశా సినిమా కెరియర్ ఆదిలోనే ముగిసింది.
ఫేస్‌బుక్ వ్లాగింగ్..
సినిమా అవకాశాలు రాకపోయినా అనిశా ఏమాత్రం నిరుత్సాహపడలేదు. స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పటి నుంచే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చిన్నచిన్న వ్లాగ్ వీడియోలను పోస్ట్ చేస్తుండేది. ఇండియా వచ్చిన తరువాత తన రోజూవారి పనులను వీడియోలు తీసి ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసేది. ఇలా క్రమంగా వీడియోలను అప్‌లోడ్ చేస్తూ మంచి ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్‌గా ఎదిగింది. సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉన్న సమయంలో..ఈ అనుభవాన్ని ఉపయోగించుకుని యూ ట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది.
రిక్షావాలా...
ఇండియాలో రవాణాకు వాడే ఆటో రిక్షా(ఆటో)ను తన వీడియోలలో ప్రధాన థీమ్‌గా తీసుకుంది. యూట్యూబ్ చానల్‌కు ‘రిక్షావాలా’ అని పేరు పెట్టుకుంది. ఆటోలో కూర్చోని.. ప్రారంభం లో సినిమా రివ్యూల వీడియోలను పోస్ట్ చేసేది. ‘రామ్‌లీలా’ సినిమా తొలి రివ్యూ వీడియో చేసింది. క్రమంగా లింగ ఆధారిత (జండర్ బేస్డ్) కామెడీ వీడియోలను అప్‌లోడ్ చేసేది. ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యేవి. భారత మహిళలు ఎదుర్కొంటున్న అనేక అభద్రతతో కూడిన అంశాలపై వీడియోలు చేయడంతో అనిశా బాగా పాపులర్ అయ్యింది.
ఆ వీడియోల వల్ల సమాజంలో మార్పులు చోటు చేసుకోవడంతో అనిశా సెలబ్రిటిగా మారడమేగాక, సోషల్ మీడియా స్టార్‌గా మారింది. రిక్షావాలి డాట్ కమ్ వెబ్‌సైట్ ప్రారంభించి, దీనిలో ఇండియా గురించిన ఆర్టికల్స్‌ను కూడా రాసేది. ప్రస్తుతం తన చానల్‌లో వివిధ కోణాల్లో వీడియోలు అప్‌లోడ్ చేస్తుంది. వీటిలో స్టోరీటైమ్స్, వ్లాగ్స్ నుంచి లఘు చిత్రాల రివ్యూలు చేస్తోంది. సెలబ్రెటీ గుర్తింపు వచ్చాక తన యూట్యూబ్ చానల్ రిక్షావాలా పేరుని మార్చి తన పేరునే చానల్ పేరుగా మార్చింది. ప్రముఖులతో వీడియోలు అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతం అనిశా చానల్‌కు ముఫ్పై లక్షల మంది సబ్‌స్క్రెబర్స్, ఇన్‌స్టాలో ఐదులక్షలమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment