‘అన్నీ సజావుగా ఉంటే మనం ఎదగం. సవాళ్లు వచ్చినప్పుడే ఎదుగుతాం’ అంటారు మణిపూర్ ఉక్రుల్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ షున్‌సింగ్ రగోయ్. ఉక్రుల్‌లోని వినో బజార్‌లో ఆమెకు చిన్న స్టోర్ ఉంది. అందులో పెళ్లికూతురి డ్రస్సులను తయారు చేస్తుంటారామె. భర్త పాంగ్‌చన్ రగోయ్ ఆమెకు కోడిజైనర్‌గా పని చేస్తుంటాడు. ఇద్దరి జీవితం సజావుగా సాగుతూ ఉన్నా లాక్‌డౌన్ సమస్యలు తెచ్చిపెట్టింది. పెళ్లిళ్లు ఆగిపోయాయి. మొదలైనవి ఆర్భాటాలను తగ్గించుకున్నాయి. ‘ఒకటి పోతే ఇంకొకటి వెతుక్కోవాలి అనుకున్నాను‘ అంటుంది షున్‌సింగ్.
పెళ్లిళ్లు ఆగినా ప్రాణవాయువు ఆగదు కదా. కరోనా టైమ్‌లో అందరి ప్రాణవాయువు నిలవాలంటే మాస్క్ తప్పనిసరి. కొత్తరకం మాస్క్‌లు తయారు చేద్దాం అనుకుంది షున్‌సింగ్. వెంటనే ఎంబ్రాయిడరీ ద్వారా మాస్క్ మీద అందమైన డిజైన్‌లను సృష్టించడం మొదలు పెట్టింది. మణిపూర్ ఎత్నిక్ డిజైన్స్, పక్షులు, పూలు మాస్క్‌ల మీద ప్రత్యక్షమయ్యాయి.
ముక్కూ ముఖం కనిపించకపోయినా మాస్క్ మీద ఉన్న డిజైన్లతో మనుషులు అందంగా కనిపించసాగారు. షున్‌సింగ్ రగోయ్ మాస్క్‌లు కొద్ది రోజుల్లోనే పాపులర్ అయ్యాయి. సెలబ్రిటీలు వీటి గురించి ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కటి 500 చేసే ఈ డిజైనర్ మాస్క్‌లు మరోచోట దొరకవు. వీళ్ల నుంచి కొనాల్సిందే. ఫేస్‌బుక్‌లో yanvai అని కొడితే వాళ్ల వివరాలు కనిపిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం. తెప్పించుకోండి. అందరూ తల తిప్పి చూసేలా చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment