ఇంత ఆరోగ్యం దాగి ఉందా తండ్రీ! | Dhanurmasam Special Goda Devi Devotional Article | Sakshi
Sakshi News home page

గోదా సంధించిన ధనుస్సు

Published Wed, Dec 23 2020 7:01 AM | Last Updated on Wed, Dec 23 2020 7:01 AM

Dhanurmasam Special Goda Devi Devotional Article - Sakshi

ధనుర్మాసం... ముగ్గులు, హరిదాసులు, గొబ్బిళ్లు, బొమ్మలు, ఆటలు పాటలు... మరో పక్క గోదాదేవి తెల్లవారుజామునే నిద్ర లేచి,  తన స్నేహితులను కూడా మేల్కొలుపుతుంది. అందరూ భక్తిగా శ్రీకృష్ణుడిని ధ్యానిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తున్న ఆచారం. గోదాదేవి ధనుర్మాసంతో మాట్లాడితే ఎలా ఉంటుంది. ధనుర్మాస పురుషుడు ఏమని సమాధానం చెప్పి ఉంటాడు. ధనుర్మాసంలో సామాజిక కోణం  ఏదైనా ఉందా... ఉండే ఉంటుంది. గోదాదేవి, ధనుర్మాసుడితో సంభాషిస్తే బహుశ ఇలా ఉండొచ్చు.

సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశిస్తూనే తన సహస్ర కిరణాలతో చలి బాణాలను ప్రపంచం మీదకు వదులుతున్నాడు. చలి గజగజలాడిస్తోంది మరి. చెట్లు వణికిపోతున్నాయి. నీళ్లు గడ్డకట్టిపోతున్నాయి. సూర్యుడు బారెడు పొద్దెక్కితేనే కానీ నిద్ర లేవనంటున్నాడు. పాపం చంద్రుడి పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది. నక్షత్రాలైతే ‘బాబోయ్‌ నిద్ర లేవటం మా వల్ల కాదు. మేం కొన్ని రోజులు హాయిగా నిద్రపోతాం’ అంటున్నాయి. పెద్దపులులు, సింహాలు, ఏనుగులు... ఎక్కడ కునుకు తీయాలో అర్థం కాక, పొదల కోసం పరిభ్రమిస్తూనే ఉన్నాయి. అమ్మ బాబోయ్‌ ఇదేం మాసంరా నాయనా, ఇంత వణికిస్తూ భయపెడుతోంది అంటోంది ప్రాణి కోటి సమస్తం.

చలితోనే స్నేహం చేస్తున్న చలిచీమలు ఏం చేస్తున్నాయో. చలి మొదలైతే చాలు చలి పులి అనేస్తాం. పులి కంటె భయంకరమైనది చలి. అయితేనేం... అన్నం పెట్టే రైతును ఆదరించే మాసంగా దనుర్మాసాన్ని ఆరాధిస్తోంది మానవాళి. అంతేనా ఈ మాసమంతా గోమయం, ఆనందమయం, ఆరోగ్య మయం. ధనుర్మాసంలో ధనుస్సును ఎక్కుపెట్టిన నెల్లాళ్లకు మకరం ప్రవేశించి, ధనుస్సు ను ముక్కలు ముక్కలు చేస్తేనే గానీ చలి పురుషుడు పారిపోడు. 
చలికి వణికిపోతున్నా, ఉదయాన్నే నిద్ర మేల్కొన్న గోదాదేవి ఒకనాడు ధనుర్మాసం దగ్గరకు వచ్చింది. వారిరువురి మధ్య చిన్న సంభాషణ జరిగింది (సృజన మాత్రమే)

గోదా: ‘అయ్యా! నమస్కారం
ధను: ప్రతి నమస్కారం తల్లీ! ఏమ్మా ఉదయాన్నే లేచావు!

గోదా: మీకు తెలీదా తండ్రీ! మా కన్నెపిల్లలమంతా నోము చేసుకుంటున్నాం కదా! ఉదయాన్నే నిద్ర లేచి స్నానాదులు చేసుకుని, పరిమళపుష్పాలు తీసుకుని రంగనాథుని సేవించాలి కదా!
ధను: అవును తల్లీ! ఈ చలికి ముసుగు వేసుకునేసరికి అన్నీ మరచిపోయాను.

గోదా: మీరు మాత్రం ముసుగు వేసుకుని పడుకుంటారు, మేం మాత్రం గజగజ వణికిపోతూ చన్నీటి స్నానం చేసి, వ్రతం ఆచరించాలి.
ధను: తల్లీ అసలు వ్రతం అంటే ఏమిటో తెలుసా నీకు?

గోదా: ఏముంది, ఒక విధానంలో చేసే పూజే కదా.
ధను: వ్రతం అంటే క్రమశిక్షణ. వ్రతం అంటే నియమానుసారంగా పనిచేయటం. వ్రతం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాదు... పంచభూతాలు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుంటే మానవులు అదుపు తప్పుతున్నారు. అలా ఉండకూడదని మీ వంటి యువతుల ద్వారా చెప్పించటమే వ్రతాలలోని పరమార్థం.

గోదా: నిజమే స్వామీ. ఇంతకీ వ్రతం చేయటంలోని అంతరార్థం ఏమిటో కాస్త దుప్పటి తొలగించి వివరించు స్వామీ. 
ధను: వ్రతం చేయటమంటే ఆర్భాటంగా పట్టు వస్త్రాలు ధరించి, ఖరీదైన పూలు పండ్లతో అర్చించటం కాదు. త్రికరణశుద్ధిగా అంటే మనసు, వాక్కు, శరీరం ఈ మూడూ ఒక పని మీద లగ్నం కావాలి. ప్రదర్శన ఉండకూడదు. నువ్వు చేసే పని మీద నీ మనసు లగ్నం చేయాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాం. ఇటువంటి వాటి కోసమే వ్రతాలు, పూజలు, నోములు ఉద్దేశించబడ్డాయి.

గోదా: నిజమే తండ్రీ.
ధను: మరో విషయం చెప్పనా, ముఖ్యంగా ఆడపిల్లలకు ఉదయానే నిద్ర లేవటం ఆరోగ్యం. ఆమె శరీరం సుకుమారంగా ఉంటుంది. ఆ సౌకుమార్యాన్ని చలికి అలవాటు చేయడం కోసమే ఇటువంటివి నిర్దేశించబడ్డాయి. 

గోదా: ఇంత ఆరోగ్యం దాగి ఉందా తండ్రీ!
ధను: అంతేకాదు తల్లీ, సృష్టిలో స్త్రీకి స్త్రీ శత్రువు అంటారు. అది అవాస్తవం అని చూపటానికే ఇటువంటి వ్రతాలు. కన్నె పిల్లలంతా కలిసికట్టుగా ఆచరించే పూజ ఇది. ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా... ఇరుగుపొరుగు స్త్రీలను ఆహ్వానించి వారికి తాంబూలం ఇస్తాం. ఇప్పుడు చెప్పు ఎవరికి ఎవరు శత్రువో. 

గోదా: నిజమే తండ్రీ! అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరు వచ్చిన మాసంలోనే ముగ్గులు, గొబ్బిళ్లు, మూడు రోజుల పండుగలు.. పిండివంటలు ... ఇవన్నీ ఎందుకు తండ్రీ?
ధను: బంగారుతల్లీ! చంద్రుడు ధవళ కాంతులీనుతున్నప్పటికీ, వెండి వెన్నెలలు కురిపిస్తున్నప్పటికీ, అమృతకిరణుడు, సుధామయూఖుడు అనుకున్నప్పటికీ, ఆయన కూడా పరుగులు తీస్తూనే ఉంటున్నాడు. అందువల్ల క్రిమికీటకాలు బద్దకం వదిలి విజృంభిస్తాయి. 

గోదా: ఓహ్‌ అందుకేనా అవి ఇంట్లోకి రాకుండా గుమ్మాలలో వరిపిండితో ముగ్గులు వేసి, గొబ్బిళ్లు ఉంచి, వాటిమీద పూలు అలంకరిస్తారు.
ధను: ఇందులో మరో పరమార్థం చెప్పనా, ఆవుపేడతో గొబ్బిళ్లు చేస్తారు మీరు. ఆవుపేడను మించిన క్రిమిసంహారకం లేదు. అందుకే పేడతో గొబ్బెమ్మ ఆకృతి రూపొందించి, వాటి మీద ముగ్గు, పసుపు, కుంకుమ వేసి, ఆ పైన గొబ్బిపూలతో అలంకరించి, ముగ్గు నడిబొడ్డున ఉంచుతాం. 

గోదా: అవును నిజమే. మీరు చెప్పినది అక్షర సత్యం.
ధను: మరొకటి, ఆడపిల్లలకు ఏ పనైనా అందంగా, పద్ధతిగా చేయటమంటే చాలా ఇష్టం. వాళ్లు మాత్రమే చేయగలుగుతారు. ఈ పనుల వల్ల ఆరోగ్యంతోపాటు, సృజన శక్తి కూడా పెరుగుతుంది. ఏ పనినైనా మంచి మనసుతో, క్రమశిక్షణతో, త్రికరణశుద్ధి గా చేయటం వల్ల పాపపుణ్యాల మాట అటుంచితే, ఆరోగ్యం సమకూరుతుంది. 

గోదా: ఈరోజు మీరు మాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఒక్కో పండుగలోని సామాజిక కోణం తెలుసుకోవాలనే విషయం అర్థమైంది స్వామీ. ఇంక నేను బయలుదేరతాను. నా స్నేహితురాళ్లను నిద్ర లేపి, మీరు సూచించిన విధంగా వ్రతం ఆచరించుతాను. 
ధను: మంచిది తల్లీ! శుభమస్తు.
(గోదాదేవి అందరినీ నిద్ర మేల్కొలపటానికి బయలుదేరింది)
– సృజన: డాక్టర్‌ వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement