తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు..రంగురంగుపూల బతుకమ్మలు.. ఇంటింటా పిండి వంటలు.. ఆనందోత్సాహాలతో ఆలింగనాలు..పిల్లల కేరింతలు... పెద్దల పలకరింపులు.. రాత్రుళ్లు దీపాల కాంతులు.. టపాసుల మోతలు ఇవే కదా.. దసరా సంబురాలు..
చిన్నపండుగొస్తుందంటే నెల ముందు నుంచే హడావిడి మొదలైపోతుంది. అలాంటిది అన్నింట్లోనూ పెద్ద పండుగ. . అలాంటిది అన్నింట్లోనూ పెద్ద పండుగ. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ దసరా వచ్చిందంటే.. ఊరూవాడంతా సంబురాలే. పట్నం విడిచి పల్లెకు పోవడానికి రెండు మూడు నెలల ముందే టికెట్స్ బుకింగ్ అయిపోతాయి. షాపింగ్ మాల్స్ జనంతో కిటకిటలాడతాయి. స్వీట్ షాపుల్లో ఆర్డర్లు పెరిగిపోతాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే పండుగ రోజుల్లో ప్రతి క్షణం మనసుకు సంతోషాన్నిచ్చేదే.
తొమ్మిది రోజుల పండుగ
తొమ్మిది రోజులు జరిగే ఈ పండుగలో.. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో పూజిస్తారు. అమ్మవారి తొమ్మిది రూపాల పేర్లు.. శైల పుత్రి, బాలా త్రిపుర సుందరి, గాయత్రీ దేవి, మహాలక్ష్మి దేవి, అన్నపూర్ణేశ్వరీ దేవి, లలితా త్రిపుర సుందరీ, మహా సరస్వతి దేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, శ్రీరాజరాజేశ్వరి దేవి.
ఇక పదవ రోజు..
విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. పొద్దున్నే లేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసి, తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు. రకరకాల ఆకులు, పండ్లు కూరగాయలు, ధూపదీపనైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేస్తారు.
పురాణాల్లో రాక్షస వధ కోసం
మహిషాసుర మర్దిని స్తోత్రం
దసరా రోజున మహిషాసుర మర్దిని దేవిని పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని మొక్కుతూ ‘అయిగిరి నందిని' స్తోత్రం చదివితే కొత్త శక్తి వస్తుంది అంటారు. దసరా రోజునే కాకుండా మిగతా రోజుల్లోనూ ఈ స్తోత్రం చదవొచ్చు. జీవితంలో నిరాశ కలిగినా, అనుకున్న పని చేయలేకపోతున్నా అమ్మవారిని తలచుకుంటే కొత్త శక్తి వస్తుందని చాలామంది నమ్ముతారు.
*అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే!
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే!
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే!
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యకపర్దిని శైలసుతే!!*
మంచి తరపున పోరాడిన వాళ్లు తమ ఆయుధాలకి పని చెప్పిన సందర్భం ఇదే. కాబట్టి చెడు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయుధపూజ చేస్తారు. రంగురంగుపూలతో బతుకమ్మ పేరుస్తారు. ఆడపడుచులంతా బతుకమ్మ చుట్టూ చేరి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ ఎంగిలిపూల, అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్న ముద్దల, సద్దుల బతుకమ్మ అంటూ పూజిస్తారు.
జమ్మి చెట్టు కథ
మహాభారతంలోని ఒక కథ కూడా విజయదశమి పండుగ నేపథ్యంగా ఉంది. పాండవులు రాజ్యాన్ని విడిచి అరణ్యవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చిన రోజు.. వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి, 'తిరిగొచ్చేవరకూ వాటిని చూసుకో” అని జమ్మి చెట్టుకి కడతారు. అరణ్యవాసం పూర్తయ్యాక వాళ్లు ఆశ్వయుజ మాసంలోని దశమి రోజున తిరిగొచ్చి తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై యుద్ధం చేసి తిరిగి తమ రాజ్యాన్ని పాండవులు దక్కించుకున్న విషయం తెలిసిందే.
వాళ్లు దశమిరోజున జమ్మిచెట్టు దగ్గరకు తిరిగి రావడం వల్లే దసరా పండుగను జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఆరోజున జమ్మి చెట్టుకి పూజలు కూడా చేస్తారు. అదే రోజు పాండవులు జమ్మిచెట్టుపై ఒక పాలపిట్టను చూశారు. అందుకని దసరా రోజున పాలపిట్టను చూసి, జమ్మిచెట్టుకు మొక్కితే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ కారణంగానే ఆయుధపూజ చేస్తారు.
దసరా రోజు రావణ సంహారం ఎందుకు ?
దసరా రోజున రామాలయాలు రామనామంతో మారుమోగిపోతాయి. ఎందుకంటే రామాయణ నేపథ్యంలో కూడా దసరా గురించి ఒక పురాణ కథ ఉంది. శ్రీరాముడు లంకలో రావణుడ్ని చంపింది దశమిరోజే. రాముడు దేవుడు.. రావణుడు రాక్షసుడు. ఇలా చూసినా చెడుపై మంచి గెలవడమే ఉంది.
కాబట్టి దసరా రోజున రామున్నిస్మరించుకుంటారు. పెద్ద మైదానాల్లో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. పది తలల రావణుడి బొమ్మను చేసి, దాన్ని బాణాసంచాతో కాలుస్తారు. దసరా తర్వాత 21 రోజులకు దీపావళి వస్తుంది. రావణుడ్ని చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యను చేరింది కూడా అప్పుడే.
విజయదశమి విజయగాథ
దసరా రోజున ప్రతి ఒక్కరూ మహిషామర్ధిని కథ చెప్పుకుంటారు. మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఇంద్రుడి పదవి కోసం దేవతలతో యుద్ధం చేసి వాళ్లను ఓడిస్తాడు. ఆ తర్వాత స్వర్గలోకాన్నే కాకుండా విశ్వాన్నంతటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ రాక్షసుడి బారి నుంచి లోకాన్ని కాపాడాలని ఇంద్రుడు త్రిమూర్తులతో చెప్పుకుంటాడు. అప్పుడు ఆ త్రిమూర్తులకు వచ్చిన కోపం ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది.
ఆ శక్తే ఒక స్త్రీ రూపమై జన్మిస్తుంది. త్రిమూర్తులతో శివుని శక్తి ముఖంగా, విష్ణువు శక్తి భుజాలు, చేతులుగా, బ్రహ్మ శక్తి పాదాలుగా ఆ స్త్రీ మహిషాసురుడిని చంపే శక్తిగా అవతరిస్తుంది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణ దేవుడు పాశాన్ని.. ఇలా ఒక్కో దేవుడు ఒక్కో ఆయుధాన్ని ఇచ్చి మహిషాసుర మర్దిని దేవిని యుద్ధానికి పంపిస్తారు.
ఆ యుద్ధంలో భీకరంగా పోరాడి మహిషాసురుడ్ని మట్టుబెడుతుంది అమ్మవారు. చెడుపై మహిషాసుర మర్దిని సాధించిన ఈ విజయానికి గుర్తుగా ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమినాడు దసరా పండుగ జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపం 'మహిషాసుర మర్దిని' రూపమే. అందుకే దసరా అనగానే దేవీ నవరాత్రి ఉత్సవాలు కళ్లముందుకొచ్చేస్తాయి.
అలయ్ బలయ్
జమ్మి చెట్టు ఆకుల్ని ‘బంగారం'తో పోలుస్తారు. అందుకని జమ్మి చెట్టుకు మొక్కినాక జమ్మి ఆకుల్ని తెంపి బంధువులకు, స్నేహితులకు ఇస్తారు. అంటే బంగారాన్ని చేతిలో పెట్టి కౌగలించుకోవడం అన్నమాట. ఈ సంప్రదాయం పేరే అలయ్ బలయ్. మగవాళ్లు ఆడబిడ్డల కాళ్లకు దండం పెట్టి జమ్మి ఆకులని చేతికిస్తారు. నాన్నమ్మ, అమ్మమ్మ, మేనత్త, అమ్మ, చిన్నమ్మలే కాదు.. అక్క, చెల్లి, వదినల కాళ్లు కూడా మొక్కుతారు. ఇలాంటి సంప్రదాయం ఒక్క తెలంగాణలోనే ఉంది. జమ్మి చెట్టును పూజిస్తూ చదివే స్తోత్రం..
శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!!
కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా తత్ర నిర్విఘ్న కర్రీత్వం భవ శ్రీరామ పూజితా!!
ఆయుధ పూజ విశేషం
కులవృత్తులు చేసేవాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధమే వాళ్లకు జీవితాన్నిస్తుంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీది నుంచి తీసిన రోజున దసరా. అందుకే ఆయుధపూజ చేయిస్తారు. బండి, మెషిన్, నాగలి, కొడవలి, పిల్లలకైతే పుస్తకాలు కూడా ఆయుధాలే. ఆయుధపూజ చేయించడం ద్వారా విజయం మనవైపే ఉంటుందని నమ్ముతారు.
వంటింటి ఘుమఘుమలు
దసరా వస్తుందంటేనే రకరకాల పిండి వంటలు చేయడానికి రెడీ అయిపోతారు. అరిసెలు, అప్పలు, సకినాలు, లడ్డూలు.. ఇలా ఎన్నో రకాల స్వీట్లు, హాట్లు వండిపెడతారు. వీటితోపాటు అమ్మవారికి రోజుకో వెరైటీలు నైవేద్యంగా పెడతారు. అంతేకాదు.. దసరా పండుగకు నోరూరించే నాన్వెజ్ స్పెషల్స్ అస్సలు మిస్సవ్వరు.
(చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ)
Comments
Please login to add a commentAdd a comment