ప్రతీకాత్మక చిత్రం
నేను ప్రెగ్నెంట్‌ను. ఇప్పుడు అయిదవ నెల. ఈ మధ్య అంటే ఓ పదిరోజులుగా .. ఎడమ బ్రెస్ట్‌లో గడ్డలాగా తగులుతోంది. అది నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో అలా ఉంటుందా? చెకప్ చేయించుకోవాలా? తెలియజేయగలరు. – వి. ఆనంది, జగదల్పూర్
ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్స్‌లో చాలా మార్పులు జరుగుతుంటాయి. మూడవ నెల నుంచే ఈ మార్పులు కనిపిస్తాయి. బ్రెస్ట్స్ సైజ్ పెరగడం, నిపుల్ ఏరియా డార్క్‌గా అవడం, కొంచెం నొప్పి వంటివి ఉండడం సహజం. కానీ గడ్డలు తగలడం.. ఈ అయిదవ నెల సమయంలో నార్మల్ కాదు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న ప్రసూతి వైద్యులను సంప్రదించాలి.
ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ అనేది సురక్షితం. డాక్టర్ పరీక్ష చేసి.. రెండు వైపులా బ్రెస్ట్స్‌కి అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తారు. ఎక్స్‌రే సురక్షితం కాదు. స్కానింగ్‌లో బ్రెస్ట్ టిష్యూలో ఉండే మార్పులను కనిపెట్టవచ్చు. చాలాసార్లు అంటే 90 శాతం ఇవి క్యాన్సర్ గడ్డలు కావు. ఇవి క్యాన్సర్‌కారకం కాని ఫైబ్రోఎడినోమా గడ్డలే అయి ఉంటాయి. ఇవి బ్రెస్ట్ సైజ్‌తోపాటు కొంచెం పెరిగి, ప్రెగ్నెన్సీలో బయటపడవచ్చు.
ఒక చోట బ్రెస్ట్ టిష్యూ గట్టిపడి ఇవి ఏర్పడతాయి. చాలా మందిలో ఇవి 1–2 సెంటిమీటర్ల నుంచి 5–6 సెంటిమీటర్ల పరిమాణంలో ఉండొచ్చు. వీటిని అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటివల్ల ఏ ప్రమాదమూ ఉండదు. కానీ ప్రసవం తర్వాత కూడా ఫాలోఅప్ స్కాన్ చేయించుకుంటూ సైజులో మార్పులు కనిపెట్టుకుంటూ ఉండాలి. వీటివల్ల ఫ్యూచర్‌లో పాలు ఏర్పడడానికి కానీ, ఇవ్వటానికి కానీ ఏ ఇబ్బందీ ఉండదు.
కొంతమందిలో ఇవి చాలా పెద్దగా అయి అయిదు సెంటిమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే excision బయాప్సీ ద్వారా చిన్న సర్జరీతో తీయటం జరుగుతుంది. కానీ అది ప్రెగ్నెన్సీలో ఎమర్జెన్సీ గా చెయ్యవలసిన అవసరం లేదు. అరుదుగా నిపుల్ నుంచి గ్రీన్ కలర్ డిశ్చార్జ్ రావటం, నిపుల్ ఏరియాలో గుంటలు పడడం, బ్రెస్ట్ అంతా ష్రింక్ అవటం లాంటి మార్పులు ఉంటే అవి ప్రమాద సంకేతాలన్నమాటే.
అలాంటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో abdominal shielding చేసి బిడ్డకు ఎక్స్‌రే కణాలు పడకుండా మమ్మోగ్రఫీ అనే టెస్ట్ చేస్తారు. ఇది క్యాన్సర్‌ను కనిపెట్టే టెస్ట్. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో సీనియర్ ప్రసూతి వైద్యులు, బ్రెస్ట్ స్పెషలిస్ట్ మీ కేస్‌ను హ్యాండిల్ చేసి తగిన ట్రీట్‌మెంట్/ బయాప్సీ/ సర్జరీ గురించి అవగాహన కల్పిస్తారు. అందుకే బ్రెస్ట్‌లో ఎలాంటి గడ్డలు తగిలినా వెంటనే డాక్టర్‌ను కన్సల్ట్ చేయాలి.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment