![hinglaj mata mandir in balochistan](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/5666.jpg.webp?itok=rC_9mlOY)
పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ హింగుళామాత మూలస్థానం
1982లో ఇందూరులో భవసార్ క్షత్రియ సమాజ్‌ఆధ్వర్యంలో నిర్మాణం
రెండు నెలల కిందట ధ్వజస్తంభం ఏర్పాటు
ఏటా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు, పండుగలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 52 శక్తి స్వరూపాల్లో ఒకటైన హింగుళాదేవి(Hinglaj Mata Mandir) ప్రధాన ఆలయం పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్(balochistan) ప్రాంతంలో ఉంది. కరాచీకి 90 కిలోమీటర్ల దూరంలో హింగుళ పర్వతంపై హింగోసీ నదీతీరం ఈ శక్తిపీఠానికి మూలస్థానం. హింగుళా మాత అసలు పేరు కోటరి. హింగుళ పర్వతంపై ఉండటంతో హింగుళాదేవిగా ప్రసిద్ధి పొందింది. ఈ పర్వతంపై గుహలో హింగుళామాత నిత్యం జ్వలిస్తూ దర్శనమిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరైన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలో హింగుళాదేవి ప్రస్తావన ఉంది. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన ఈ శక్తిస్వరూపిణి ఆలయాన్ని నిజామాబాద్ జిల్లా ఇందూరులో 1982లో నిర్మించారు. రెండు నెలల కిందట ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. రంగరి (వస్త్రాలకు రంగులు వేసే) కులానికి చెందిన ‘భావసార్ క్షత్రియ సమాజ్’వారు ఈ ఆలయాన్ని నిర్మించారు.
దేశవిభజన సమయంలో వచ్చిన భవసార్ క్షత్రియ సమాజ్..
దేశవిభజన సమయంలో రంగరి (భవసార్ క్షత్రియ సమాజ్) కులస్తులు బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి రాజస్తాన్‌కు వలస వచ్చారు. తర్వాత కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో వీరు వెయ్యి కుటుంబాలకు పైగా ఉన్నారు. ప్రాచీన చరిత్ర ప్రకారం క్షత్రియులుగా ఉన్న వీరిని అంతమొందించేందుకు పరశురాముడు వెంటాడితే వీరి వంశీయులు దేవీమాత శరణు కోరారు. హింగుళాదేవి వీరిని కాపాడింది. అలాగే వీరికి వ్రస్తాలకు రంగులు అద్దే కళను కటాక్షించింది. అప్పటి నుంచి ఈ వృత్తిని చేస్తున్నట్లు ఈ సమాజ్ పెద్దలు తెలిపారు. వీరు కొలిచే హింగుళా దేవి ఆలయాలు రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఈ సమాజ్ వారుండే ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు.
ఇందూరులోని హింగుళా మాత ఆలయంలో ప్రతిరోజూ అభిõÙకం నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం భజనలు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి యజ్ఞం, సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నదానం చేస్తారు. దసరా నవరాత్రులు నిర్వహిస్తారు. ఇందూరులో ఊరపండుగ అయ్యాక వారం రోజుల తర్వాత పసుపు, కుంకుమ, కాగడాలతో పాటలు పాడుతూ గోందాల్ ఉత్సవాలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment