
లంచ్, డిన్నర్‌లలో వండిన అన్నం కొన్నిసార్లు మిగిలిపోతుంటుంది. అలా మిగిలిన అన్నాన్ని పులిహోర, ఎగ్‌రైస్, వెజ్ రైస్ చేసుకోవడం మామూలే. తరచూ మసాలా రైస్ తినబుద్దికాదు. అందువల్ల మిగిలిపోయిన అన్నాన్నీ మరింత రుచిగా ఇలా కూడా చేయవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు...
ఇన్‌స్టంట్ ఊతప్పం తయారీకి కావల్సినవి:
మిగిలిన అన్నం – కప్పు ; బొంబాయి రవ్వ – అరకప్పు ;
పెరుగు – కప్పు; క్యారట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు – కప్పు;
అల్లం తరుగు – టీస్పూను ; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ;
జీలకర్ర – టీస్పూను ; ఉప్పు – రుచికి సరిపడా; నూనె ఊతప్పం వేయించడానికి – తగినంత.
తయారీ విధానమిలా..
- పెద్దగిన్నెలో రవ్వ, పెరుగు వేసి కలిపి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అన్నంలో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
- గ్రైండ్ చేసిన అన్నాన్ని రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి. దీనిలో కప్పు నీళ్లుపోసి కలపాలి.
- ఇప్పుడు కూరగాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని వేడెక్కిన పెనంపై నూనె వేసి ఊతప్పంలా వేయాలి.
- డువైపులా నూనె చల్లుకుంటూ చక్కగా కాల్చుకుంటే ఇన్‌స్టంట్ ఊతప్పం రెడీ. ∙కూరగాయ ముక్కలను పిండిలో కలపకుండా ఊతప్పం పైన చల్లుకుని కూడా కాల్చుకోవచ్చు.