‘ది ఫాదర్ అండ్ ది అసాసిన్’ నాటకంలో...
‘అమ్మాయిలు నటించడం ఏమిటి?’ అనే ఆశ్చర్యం నుంచి రంగస్థలానికి వెలుగులు అద్దిన ప్రసిద్ధ నటీమణుల వరకు ఎంతో చరిత్ర ఉంది. రంగస్థలానికి సంబంధించిన చరిత్రలో మరో విశిష్టమైన పేరు ఇందు. లండన్‌లోని ప్రసిద్ధ రాయల్ నేషనల్ థియేటర్‌కు ఇందు రుబసింగంను ఆర్టిస్టిక్ డైరెక్టర్, జాయింట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించారు. 60 సంవత్సరాల
చరిత్ర ఉన్న నేషనల్ థియేటర్‌కు మహిళా దర్శకురాలిని ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియమించడం ఇదే తొలిసారి....
ఇందు తల్లిదండ్రులు ఇంగ్లాండ్‌లో సిర్థపడిన శ్రీలంక తమిళులు. నాటింగ్‌హమ్ సిటీలోని నాటింగ్‌హమ్ గర్ల్స్ హైస్కూల్ లో విద్యాభ్యాసం చేసింది ఇందు. హల్ యూనివర్శిటీలో థియేటర్ ఆర్ట్స్‌లో డాక్టరేట్ చేసింది. థియేటర్ రాయల్, స్ట్రాట్‌ఫర్డ్ ఈస్ట్‌లో ట్రైనీ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తరువాత ఫ్రీలాన్స్ థియేటర్ డైరెక్టర్ గా పది సంవత్సరాలకు పైగా పనిచేసింది. ఫ్రీలాన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కాలంలోనే లండన్‌లోని ‘గేట్ థియేటర్’లో అసోసియేట్ డైరెక్టర్‌గా నియామకం అయింది.
లండన్‌లోని కిల్న్ థియేటర్‌కు ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియామకం కావడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది ఇందు. గతంలో ఈ థియేటర్ శ్వేతజాతీయుల ఆధ్వర్యంలోనే నడిచేది. శ్వేతజాతేతర మహిళా దర్శకురాలు ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియామకం కావడం ఇదే తొలిసారి. కిల్న్ థియేటర్ నిర్వహణలో ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’ గా తనదైన ముద్ర వేసింది ఇందు. ఆడిటోరియంను ఆధునీకరించి సీట్ల సంఖ్యను పెంచింది.
కొత్త సౌకర్యాలు మాత్రమే కాదు కొత్త నాటకాన్ని థియేటర్‌కు పరిచయం చేసింది. ‘రెడ్ వెల్వెట్’‘హ్యాండ్ బ్యాగ్‌డ్’ ‘వెన్ ది క్రౌస్ విజిట్’ ‘ఏ వోల్ఫ్ ఇన్ స్నేక్‌స్కిన్ షూస్’...మొదలైన నాటకాలు డైరెక్టర్‌గా ఇందుకు మంచి పేరు తెచ్చాయి. ది ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్, ఏషియన్ ఉమెన్ ఆఫ్ ఎచీవ్‌మెంట్ అవార్డ్, లిబర్టీ హ్యుమన్ రైట్స్ అవార్డ్... మొదలైన ఎన్నో అవార్డ్‌లు అందుకుంది.
‘నాటకరంగాన్ని వినోద మాధ్యమానికి పరిమితం చేయకూడదు. మార్పు తెచ్చే శక్తి నాటకానికి ఉంది. ప్రజలను ఒక దగ్గరకు తీసుకువచ్చి అభిప్రాయాలు పంచుకునేలా, ఆలోచించేలా చేస్తుంది’ అంటుంది ఇందు.
కొత్తదనం నిండిన నాటకాలకు ఇందు ప్రాధాన్యత ఇస్తుంది. మానవ సంబంధాలను విభిన్న కోణాల నుంచి విశ్లేషించే నాటకాలను ఎంపిక చేసుకుంటుంది. బీబీసీ రేడియో 4, బీబీసీ రేడియో 3, బీబీసి వరల్డ్ సర్వీస్‌కు సంబంధించి రేడియో నాటికలకు కూడా దర్శకత్వం వహించింది. నేషనల్ థియేటర్ లో ‘ది వెయిటింగ్ రూమ్’ ‘ది రామాయణ’ అనుపమ చంద్రశేఖర్ ‘ది ఫాదర్ అండ్ ది అసాసిన్’ నాటకాలకు దర్శకత్వం వహించింది. ‘ది ఫాదర్ అండ్ ది అసాసిన్’కు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డ్ అందుకుంది.
కొత్త రచయితలను, నటులను ప్రోత్సహించడంలో ప్రపంచ రంగస్థలానికి పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది ఇందు. ‘ఇందు నేషనల్ డైరెక్టర్‌గా నియామకం కావడం సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్‌గా, లీడర్‌గా ఆమె అంటే అపారమైన అభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే నాటకాలు రావడానికి, నాటకరంగాన్ని స్ఫూర్తిదాయక శక్తిగా మలిచే విషయంలో ఆమె కొత్త అధ్యయనాన్ని మొదలు పెడతారని ఆశిస్తున్నాను’ అంటుంది నేషనల్ థియేటర్ డైరెక్టర్ కేట్ వరహ్.
‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా తన నియామకంపై స్పందిస్తూ... ‘నేషనల్ థియేటర్ నా జీవితంలో ముఖ్యపాత్ర పోషించింది. ఇదొక అత్యున్నత గౌరవంగా భావిస్తున్నాను. నాకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యున్నత బాధ్యత’ అంటుంది ఇందూ రుబసింగం.
కొత్త రెక్కలతో...
రంగస్థలం అనేది ఒకచోట, ఒకేకాలంలో ఉండిపోదు. కాలంతో పాటు కదులుతుంది. కాలాన్ని ప్రతిబింబిస్తుంది. రంగస్థలానికి ఆలోచనాపరులను ఒకే వేదిక మీదికి తీసుకువచ్చే శక్తి ఉంది. మానవసంబంధాల నుంచి అస్తిత్వ పోరాటాల వరకు ఎన్నో అంశాలకు నాటకం అద్దం పడుతుంది. సాంకేతిక పరంగానే కాదు ఇతివృత్త పరంగా కూడా నాటక రంగం కొత్త దారిలో వెళుతుంది. రంగçస్థల ప్రపంచంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కొత్త ఆలోచలకు రెక్కలు వస్తున్నాయి.
– ఇందు రుబసింగం, రంగస్థల దర్శకురాలు
Comments
Please login to add a commentAdd a comment