నవ్వుతూ మాట్లాడకూడదు. నచ్చిన డ్రెస్ అసలే వేసుకోకూడదు. హవ్వ.. అబ్బాయిల్లా ఆ ఆటలు ఏంటి? ఏమ్మా నువ్వైనా నీ బిడ్డకు చెప్పవచ్చు కదా! అసలే తండ్రి లేని పిల్ల... ఇలాంటివి మీకు అవసరమా? సూదుల్లా గుచ్చే ఇరుగు పొరుగు మాటలు లెక్కచేయలేదు– ఆ తల్లీ.. కూతురు
తల్లి ఎంతటి ధైర్యశాలో కూతురికి తెలుసు. 32వ ఏటనే భర్తను కోల్పోయినా ఇద్దరు కూతుళ్లను గొప్పగా పెంచింది. ఆడపిల్లలు బలహీనులని భావించక మగాళ్ల గోదాలో రెజ్లర్లుగా దించింది. క్యాన్సర్ బారిన పడ్డా కూతుళ్ల కోసం యముడితో పోరాడి బయటపడింది. అవును... ఆ తల్లిని చూసి పోరాడటం నేర్చుకుంది ఆ కూతురు... వినేశ్ ఫొగట్ డాటరాఫ్ సరళాదేవి.
‘పట్టు’ పడితే పతకం మెడలో వాలాల్సిందే. అన్యాయం చేసిన వాళ్ల తాట తీయాల్సిందే. న్యాయపోరాటంలో మొండిగా ముందుకు దూకాల్సిందే. నాన్న లేడని అమ్మను వంకర చూపులు చూసే వాళ్ల తోడేలుతనం ఆమె దృష్టిని దాటి పోలేదు. ఆడవాళ్లకు అదెంత వేదనో స్వయంగా చూసింది. అందుకే తోటి మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యామని చెబితే వారికి మద్దతుగా నిలిచింది. కెరీర్‌ను పణంగా పెట్టి రాజధానిలో ఉద్యమానికి ఊపిరిగా మారింది.
పాలకుల ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ జీవితకాల శ్రమతో సంపాదించుకున్న ఖేల్ రత్న అవార్డును కూడా తృణ్రపాయంగా విడిచిపెట్టింది. ఇంత బరితెగింపా అంటూ అజ్ఞానంతో అనరాని మాటలు అనే వాళ్లను చిరునవ్వుతో మరింత చికాకు పెట్టింది. మద్దతుగా నిలిచిన వారికి కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పింది.
ఖేల్ ఖతమే అన్న వాళ్ల చెంప చెళ్లుమనిపించేలా అన్ని సవాళ్లను దాటుకుని మూడోసారి ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అంతేనా.. ఇప్పటి వరకు భారత మహిళా రెజ్లర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించింది. స్వర్ణ పతకపోరుకు అర్హత సాధించింది.
ఊహించని విధంగా వందగ్రాములు.. కేవలం వందగ్రాముల అదనపు బరువు కారణంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పతకం సాధించకపోతేనేమి.. అందరి హృదయాలలో అభిమానాన్ని సంపాదించింది. వీటన్నిటి ముందు ‘ఆ వంద గ్రాములు‘ లెక్కే అంటారా?
(ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్.. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది)
-సుష్మారెడ్డి యాళ్ల
చదవండి: వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది?
Comments
Please login to add a commentAdd a comment