వాహ్‌! ఐస్‌ టీ వాహ్‌! | Men Make Tea Using Ice From Frozen Stream | Sakshi
Sakshi News home page

వాహ్‌! ఐస్‌ టీ వాహ్‌!

Published Sun, Feb 18 2024 6:10 AM | Last Updated on Sun, Feb 18 2024 6:10 AM

Men Make Tea Using Ice From Frozen Stream - Sakshi

బయట మంచు కురుస్తుంటే లోపల టీ తాగితే బాగుంటుంది. కాని మంచు సెలయేటిలో కూచుని మంచుని కరిగించి టీ కాచుకుంటే? అదీ బాగుంటుందని 78 మిలియన్ల వ్యూస్‌ చెబుతున్నాయి. కశ్మీర్‌కు షికారుకు వెళ్లిన ముగ్గురు మిత్రులు మంచి పాట వింటూ గుప్పెడు మంచుతో టీ కాచారు. వైరల్‌ అయ్యారు.

చల్లటి ప్రాంతంలో అందరూ తాగే ద్రవం టీ. చలి ముఖాన చరుస్తూ ఉంటే పొగలు గక్కే టీ పెదాలకు అందుతూ ఉంటే ఆ మజాయే వేరు. రాహుల్‌ యాదవ్‌ అనే ట్రావెలర్‌ ఇన్‌స్టాలో ‘ట్రాహులర్‌’ అనే అకౌంట్‌లో తన ట్రావెల్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తుంటాడు. జనవరి 29న అతను తన ఇద్దరు మిత్రులతో ఒక వీడియో పెట్టాడు. అది విపరీతంగా జనానికి నచ్చేసింది. కారణం... కశ్మీర్‌లో నిర్మానుష్యమైన లోయలో, గడ్డ కట్టిన సెలయేటి మధ్యలో కూచుని ఆ మిత్రులు ‘టీ తయారు చేశారు’. మామూలుగా కాదు.

టీ గిన్నెలో అక్కడున్న మంచును వేసి మరీ! క్యాంప్‌ స్టవ్‌ మీద ఆ మంచు నిండిన టీ గిన్నె కాసేపటికి వేడి నీరుగా మారింది. అందులో కొంత టెట్రా మిల్క్‌ వేశారు. ఆ పై టీయాకును, చక్కరను వేస్తే చిక్కటి రంగులో ఘుమఘుమలాడే టీ తయారైంది. ఇటీవల విడుదలైన ‘డంకీ’లోని పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ ఉండగా ఆ ముగ్గురూ మనకు ఈర్ష్య కలిగేలా టీ తాగారు. ఈ వీడియో రెండు వారాల్లో 7 కోట్ల 8 లక్షల మంది చూశారు. ‘మేం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా తాగకపోతామా?’ అని కొందరంటే ‘సేఫేనా?’ అని కొందరన్నారు. బ్యాక్టీరియా ఉంటుందేమో అని మరికొందరు సందేహం వెలిబుచ్చారు. బాగా వేడి చేశారు కనుక బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. అయినా స్వచ్ఛమైన మంచు టీ తయారు చేసుకుని తాగే ముందు ఈ సందేహాల గోల ఏల?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement