The Other Lata Padma Bhushan Suman Kalyanpur Interesting Unknown Facts In Telugu - Sakshi
Sakshi News home page

Suman Kalyanpur Facts: సుమన్‌ గొంతు లతాతో సమానం! అయినా ఆమెను ఎదగనివ్వలేదా? ఇన్నాళ్లకు ఎట్టకేలకు..

Published Fri, Jan 27 2023 5:06 PM | Last Updated on Fri, Jan 27 2023 6:14 PM

Padma Bhushan Suman Kalyanpur Other Lata Interesting Facts - Sakshi

సుమన్‌ కల్యాణ్‌పూర్, లత ఒక విధంగా ఒకే మెట్టు మీద ఉండాలి. లత అభిమానులు కూడా సుమన్‌ కల్యాణ్‌పూర్‌ గొంతు లతాతో సమానం అంటారు. కాని సుమన్‌కు చాలా కొద్ది పాటలు లభించాయి. ఆమెను కొందరు ఎదగనివ్వలేదని అంటారు. బిడియం, హుందాతనం ఉన్న సుమన్‌ కల్యాణ్‌పూర్‌ అవకాశాల కోసం కలబడకుండా తప్పుకుని నిలబడింది.

కాని ఆమె పాటలు నిలబడే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌ భవంతిలో అగ్నిప్రమాదం. అదే రోజు పద్మభూషణ్‌ ప్రకటన.జనవరి 28 ఆమె 87వ పుట్టినరోజు. ఇన్ని సందర్భాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్లకైనా తమ అభిమాన గాయనికి గౌరవం దక్కినందుకు అభిమానులు యూ ట్యూబ్‌లో ఆమె పాటల ప్లే బటన్‌ నొక్కుతున్నారు.

నా నా కర్‌తే ప్యార్‌ తుమ్హీసే కర్‌ బైఠే
న తుమ్‌ హమే జానో – న హమ్‌ తుమే జానే
మగర్‌ లగ్‌తా హై కుచ్‌ ఐసా
మేరా హమ్‌దమ్‌ మిల్‌గయా...

1962. ‘బాత్‌ ఏక్‌ రాత్‌ కీ’ సినిమాలో దేవ్‌ ఆనంద్‌– వహీదా రెహమాన్‌ మీద చిత్రించిన ఈ పాట పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత రేడియోలో శ్రోతలు తెగ ఫర్మాయిష్‌ చేయసాగారు... ఈ పాట ప్లే చేయమని. గాయకుడు హేమంత్‌ కుమార్‌ అందరికీ తెలుసు. గాయని లతా మంగేష్కర్‌... అని అందరూ అనుకున్నారు. కాదు. ఆ గొంతు సుమన్‌ కల్యాణ్‌పూర్‌ది.

చెప్తే తప్ప తెలియదు. అదే మాధుర్యం. అదే తీపి. అదే పూలరెక్క సౌకుమార్యం. అదే అగరుపొగ ధూపం. అవునా... అని అందరూ నోరు తెరిచారు. లతాలా పాడుతున్న గాయని, లతా అంత బాగా పాడుతున్న గాయని సుమన్‌ కల్యాణ్‌పూర్‌ తెర మీదకు వచ్చిన సందర్భం అది. దానికి కారణం లతానే.

అవును. ‘బాత్‌ ఏక్‌ రాత్‌కీ’కి సంగీత దర్శకుడు ఎస్‌.డి.బర్మన్‌. ఆ సినిమా చేస్తున్నప్పుడు లతాకీ, బర్మన్‌కూ మాటలు లేవు. లతా లేకపోతే సినీ సంగీతమే లేదు అనుకుంటున్న రోజులు అవి. కాని బర్మన్‌కు పట్టుదల జాస్తి. సుమన్‌ను వెతికాడు. పాట చేశాడు. హిట్‌ కొట్టాడు. కాని లతా ఉండగా ఇతర గాయనులకు సంగీతమే ఉండదు అని మెల్లగా ఆ తర్వాత అర్థమైంది. సుమన్‌ పాట మీద ఎంత ప్రేమ ఉన్నా అది వినిపించక పోతే ఏమిటి చేయడం?

నా నా కర్తే ప్యార్‌ తుమ్హీసే కర్‌ బైఠే
కర్నా థా ఇన్‌కార్‌ మగర్‌ ఇక్‌రార్‌
తుమ్హీసే కర్‌ బైఠే (జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే)

సుమన్‌ కల్యాణ్‌పూర్‌ది బెంగాల్‌. వాళ్ల కుటుంబం ఆమె తండ్రి కాలంలో ఢాకా మీదుగా ముంబైకి చేరుకుంది. తండ్రి బ్యాంక్‌ ఉద్యోగి. ఐదుమంది అమ్మాయిల్లో సుమన్‌ పెద్దది. ఆ రోజుల్లో అమ్మాయిలను ఆ నాటి తల్లిదండ్రులు ఎలా పెంచారో అలానే సుమన్‌ను పెంచారు. దానికి సుమన్‌ స్వభావసిద్ధ సిగ్గు, బిడియం తోడైంది. అది ప్రవర్తనలోనే. కాని గొంతు విప్పితే పక్షి రెక్క విప్పినట్టు ఆమె పాట హాయిగా తరంగాలు సృష్టించేది.

ఠెహరియే హోష్‌మే ఆలూ
తొ చలే జాయియేగా...
ఆప్‌కో దిల్‌ మే బిఠావూ తో చలే జాయియేగా... (మొహబ్బత్‌ ఇస్‌కో కెహెతే హై)

ముంబైలో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీ వేదిక మీద ఒక పాట పాడితే ఆ వేడుకకు గెస్ట్‌గా హాజరైన తలత్‌ మెహమూద్‌ ఎంతో మెచ్చుకున్నాడు. అప్పుడు సుమన్‌ వయసు 16. అయినా సరే సుమన్‌ను హెచ్‌.ఎం.వి.కి రికమండ్‌ చేశాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడు షఫీ ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు. 1954లో వచ్చిన ‘దర్వాజా’ సుమన్‌ మొదటి సినిమా. కాని 1962లో ‘న తుమ్‌ హమే జానో’ పాటతో ఆమెకు గుర్తింపు వచ్చింది స్టార్‌ అయ్యింది.

కాని అప్పటికే లతా ఏకఛత్రాధిపత్యం సాధించింది. ఆశా భోంస్లే కూడా కూడదీసుకుంది. వీరిద్దరి కారణాన గీతా దత్, షంషాద్‌ బేగం... వంటి గాయనులే అవకాశాలు లేని స్థితికి చేరుకున్నారు. సుమన్‌ గొంతు లతా గొంతులా ఉండటంతో లతా దృష్టి ఈమె మీద ఎక్కువగా పడిందని అంటారు. సుమన్‌తో పాడిస్తే ఆ సంగీత దర్శకులకు లతా పాడటం కష్టం అయ్యేది.

ఆ భయంతో సుమన్‌కు అవకాశాలు రాలేదు. కాని లతా మంగేష్కర్, రఫీలు రాయల్టీ విషయంలో భేదాభిప్రాయాలతో ఒకరికి మరొకరు పాడటం మానుకున్నారు. పాట ఒకసారి పాడి డబ్బు తీసుకున్నాక ఇక రాయల్టీ అవసరం లేదని రఫీ అభిప్రాయం.

ఒక పాట తాలూకు రికార్డులు అమ్ముడయినంత కాలం గాయనీ గాయకులకు రాయల్టీ ఇవ్వాల్సిందేనని లతా అభిప్రాయం. ఈ తగాదా సుమన్‌కు కొద్దిగా లాభించింది. లతా పాడకపోవడం వల్ల రఫీ, సుమన్‌ కలిసి చాలా డ్యూయెట్లు పాడారు. షమ్మీ కపూర్‌ కోసం చేసిన ఈ పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు.

ఆజ్‌ కల్‌ తేరె మేరె ప్యార్‌ కే చర్చే హర్‌ జబాన్‌ పర్‌
సబ్‌కో మాలూమ్‌ హై ఔర్‌ సబ్‌కో ఖబర్‌ హోగయి (బ్రహ్మచారి)
తుమ్‌ నే పుకారా ఔర్‌ హమ్‌ చలే ఆయే
దిల్‌ హతేలీ మే లే ఆయేరే (రాజ్‌ కుమార్‌)

అదొక్కటే కాదు... సుమన్‌కు చొరవ లేకపోవడం వల్ల తన సామర్థ్యానికి తగ్గ డిమాండ్‌ చేయలేకపోవడం వల్ల ఆమె ‘పేదవాడి లత’గా మారింది. అంటే లతా మంగేష్కర్‌కు ఇచ్చేంత డబ్బు లేనివారు సుమన్‌ చేత పాడించేవారు. దాంతో చిన్న సినిమాలకు సుమన్‌ పాడాల్సి వచ్చేది. వాటిలో పాటలు ఎంత బాగా ఉన్నా ప్రచారం పొందేవి కావు. సుమన్‌కు 1958లో పెళ్లి అయ్యింది.

ఆమె నేరుగా సంగీత దర్శకులతో, నిర్మాతలతో మాట్లాడేది కాదు. భర్త అవన్నీ చూసేవాడు. దాని వల్ల కూడా ఆమెకు సంగీత ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో తెలియలేదు. కొన్నిసార్లు ఆమె బాగా పాడిన పాటలు సినిమాల్లో తొలగించబడేవి. లేదా అవే పాటలు మరొకరి గొంతులో వినిపించేవి. చాలా సున్నిత స్వభావం ఉన్న సుమన్‌ ఇదంతా నాకు అవసరమా అనుకుంది. కాని అభిమానులు మాత్రం ఆమె గొంతు అవసరమే అనుకున్నారు.

షరాబీ షరాబీ ఏ సావన్‌ కా మౌసమ్‌
ఖుదాకీ కసమ్‌ ఖూబ్‌సూరత్‌ న హోతా... (నూర్‌ జహాన్‌)

సుమన్‌కు ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు డాక్టరు. అందరూ ముంబై లోఖండ్‌ వాలాలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో వేరు వేరు ఫ్లాట్‌లలో ఉంటారు. మొన్న బుధవారం ఆ బిల్డింగ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ అయితే అందరినీ తీసుకుని ఆమె రోడ్డు మీద గడపాల్సి వచ్చింది. కాని అదే రోజు ఆమెకు పద్మభూషణ్‌ ప్రకటన అందింది. జనవరి 28 ఆమె పుట్టినరోజు. ఇది ఒక అందమైన పుట్టినరోజు కానుక.

సుమన్‌ ఎంతో ప్రతిభావంతురాలు. ఎన్ని వందల పాటలో పాడి ఉండాలి. కాని ఆమె గొంతు మీద నీడ కదలాడుతూనే ఉండిపోయింది. ఇప్పుడు ఇది కొద్దిగా వెలుతురు. కాని తీరం చేరిపోయాక పడవకు దొరికిన ఓదార్పు. ‘మమత’ (1966)లో ఈ పాటను లతా పాడింది. చాలా ఫేమస్‌. కాని ఇదే పాటను రఫీతో (లతా పాడదు కనుక) సుమన్‌ కల్యాణ్‌పూర్‌ డ్యూయెట్‌గా పాడింది. లతా ఎంత మార్దవంగా పాడిందో సుమన్‌ కూడా. వినండి. ఈ పాట ఆ సిగ్గరి గొంతుకు బంగారు తొడుగు.

రహేనా రహే హమ్‌ మెహ్‌కా కరేంగే
బన్‌కే కలి బన్‌ కే సబా
బాగ్‌ ఏ వఫా మే....  

చదవండి: శెభాష్‌.. ఒకేసారి ఇద్దరు మహిళా డీజీపీలు         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement