పోషకాహార ప్రపంచంలో బంగాళ దుంపలను విలన్‌గా చూస్తారు. అమ్మో! బంగాళదుంప తింటే..ఇంకేమైనా ఉందా..! బరువు పెరిగిపోతాం అని భావిస్తారు చాలామంది. దాని జోలికి పోవడానికే భయపడిపోతారు. ఇందులో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయని తీసుకోవడానికే జంకుతారు. కానీ ఇది నిజం కాదంటున్నారు ఆహార నిపుణలు. ఇవి ఆరోగ్యానికి చాలమంచి సమతుల్య ఆహారం అని చెబుతున్నారు.
అందరూ బంగాళ దుంపలను చూసి భయపడటానికి కారణం వేయించిన ఆహారంగా భావించడమేనని నిపుణులు చెబుతున్నారు. నిజానికి బంగాళ దుంప ఆరోగ్యానికి చెడ్డది కాదని అంటున్నారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సీ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ తదితర పోషక విలువలు ఉంటాయి. ఐతే ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి కాబట్టి రైస్‌తో జోడించి తీసుకోవద్దని సూచిస్తున్నారు న్యూట్రీషియన్లు.
ప్రతిరోజు మీడియం సైజులోని బంగాళదుంపలను నిరంభ్యంతరంగా తీసుకోవచ్చని అంటున్నారు. ఇందులో స్టార్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్‌తో కూడిన ఆహారాన్ని జత చేయకూడదు. వేయించిన బంగాళ దుంపలను అస్సలు దగ్గరకు రానీయద్దు. కేవలం ఉడకబెట్టడం, లేదా వేరే కాయగూరలతో కలిసి తీసుకోవడం వంటివి చేయొచ్చు.
వీటిలో ఉండే పోషకాలు..
- బంగాళదుంపల్లో విటమిన్ సీ, పోటాషియం, విటమిన్ బీ6 ఉంటాయి.
- వీటిలో డైటరీ ఫైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే తయరీ విధానం అనుసరించి పోషక కంటెంట్ మారుతుంది
- ఇందులో ప్రధానంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది శరీరానికి మంచి శక్తినిస్తుంది.
- ఇందులో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. ఈ ఫైబర్లు జీర్ణక్రియకు సహాయపడతాయి.
- రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఆరోగ్య ప్రయోజనలు
►దీనిలో ఉండే విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థకు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది
►గుండె, కండరాల పనితీరుకు ఇందులో ఉండే విటమిన్ సీ, ఫైటోకెమికల్స్ రక్షణగా ఉంటాయి.
►ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొన్ని వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి.
అయితే ఈ బంగాళదుంపల్లో గ్లైసెమిక్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచే అవకాశం ఉంది. అందుకే దీన్నీ ఆకుకూరలు, వంటి ఇతర కూరగాయాలతో మిక్సింగ్ చేసి తీసుకోవడమే ఉత్తమం. చక్కెర స్థాయిలను తగ్గించేలా చేసుకునే బంగాళదుంపల వంటలను ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే స్టార్చ్, అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా మితంగా ఉపయోగించడమే మంచిది.
గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.
(చదవండి: బీట్‌రూట్ జ్యూస్ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్ వల్ల..)
Comments
Please login to add a commentAdd a comment