ఢీ అంటే ఢీ ఆర్ట్‌ ఆఫ్‌ డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌ | Power of influencer marketing | Sakshi
Sakshi News home page

ఢీ అంటే ఢీ ఆర్ట్‌ ఆఫ్‌ డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌

Published Wed, Oct 18 2023 1:13 AM | Last Updated on Wed, Oct 18 2023 1:16 AM

Power of influencer marketing - Sakshi

‘ఇప్పటి వరకు ఇన్‌ఫ్లుయెన్సర్‌ పవర్‌ ఏమిటో చూశారు. ఇక డీఇన్‌ఫ్లుయెన్సర్‌ పవర్‌ ఏమిటో చూసే టైమ్‌ వచ్చింది’... ఇది తెలుగు సినిమాలో మాస్‌ డైలాగ్‌ కాదు. సోషల్‌ మీడియాలో ఒక కుర్రాడు పెట్టిన కామెంట్‌.సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌ల హవా నడుస్తున్న కాలం ఇది. కస్టమర్‌లు ఏది కొనాలో, ఏ షో చూడాలో, ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో చెబుతున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్‌కు అడ్డుపడే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌’ ట్రెండ్‌ యువతరం నుంచే వచ్చి బలపడుతోంది. ట్రెడిషనల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఒక ప్రాడక్ట్‌ను హైప్‌ చేస్తే డీఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఆ హైప్‌ను ఛాలెంజ్‌ చేస్తున్నారు....

మార్కెటింగ్‌ డాటా అండ్‌ ఎనలిటిక్స్‌ కంపెనీ కంతార్‌ స్టడీ రిపోర్ట్‌ ప్రకారం వినియోగదారులపై ఇన్‌ఫ్లుయెన్సర్‌ల సిఫారసుల ప్రభావం తక్కువేమీ కాదు. సోషల్‌ మీడియాలో ఎటు చూసినా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కనిపిస్తారు. టీ పోడుల నుంచి టీపాయ్‌ల వరకు రకరకాలప్రాడక్ట్స్‌ను ప్రమోట్‌ చేయడానికి చిన్నచిన్న క్యాచీ వీడియోలను రూపోందిస్తారు. దీనికి భిన్నంగా ఒక ప్రాడక్ట్‌ను విశ్లేషిస్తూ విమర్శిస్తే...అదే డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌!

‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో టిక్‌ టాక్‌లో ఈ ట్రెండ్‌ మొదలైంది.సోషల్‌ మీడియా ఎనాలటిక్స్‌ ఫర్మ్‌ ట్యూబ్‌లర్‌ ల్యాబ్స్‌ చెబుతున్నదాని ప్రకారం గత సంవత్సరం నుంచి ఈ ట్రెండ్‌ ఊపందుకుంది. మ్యాడి వెల్‌ అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రముఖ కాస్మటిక్‌ స్టోర్స్‌లో పని చేసింది. కొన్నిప్రోడక్ట్స్‌ పట్ల కస్టమర్‌లు ఎందుకు విముఖంగా ఉన్నారో తన స్వీయ అనుభవాలను తెలియజేసింది. ఈ ప్రభావంతో ఆమె పేరు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల జాబితా నుంచి డీఇన్‌ఫ్లుయెన్సర్‌ల జాబితాలోకి చేరింది.

న్యూయార్క్‌కు చెందిన ఇరవై సంవత్సరాల క్లారా కొన్ని బ్రాండ్‌లను విమర్శిస్తూ వీడియోలు చేసింది. వాటిలో ఒకటి వైరల్‌గా మారింది. అదే సమయంలో తాను విమర్శించిన బ్రాండ్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే భయం పట్టుకుంది. అయితే తనకు తానుగా ధైర్యం తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.‘నేను సరిౖయెన వివరాలతోనే వీడియో చేశాను. నేనెందుకు భయపడాలి’ అంటోంది క్లారా.

మన సెలబ్రిటీ ఒకరు ఆరోగ్య సంబంధమైన విషయాలపై కాస్త లోతుగానే మాట్లాడాడు. అయితే ఆయన అవగాహన లోపాన్ని ఒక వైద్యుడు వెంటనే ఎత్తిచూపాడు. పాపులర్‌ చైనీస్‌ వ్లోగర్‌ ఒకరు తన వయసు తక్కువగా కనిపించేలా సాంకేతిక మాయ చేస్తే ఎవరో కుర్రాడు కనిపెట్టి ‘ఆయన అసలు రూపం ఇది’ అని చూపాడు.

స్వీడన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌  ఫేక్‌ ట్రిప్‌ గురించి మరొక యువకుడు ‘ఇవి ఫొటోషాప్‌ చిత్రాలు’ అని నిజాన్ని బహిర్గతం చేశాడు. నిజానికి ఇలాంటివి సోషల్‌ మీడియాలో గతంలో లేవని కాదు. అయితే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌’ పుణ్యామా అని ‘అది కాదు ఇది’ అని వెంటనే సాధికార సమాచారంతో స్పందించే ధోరణి పెరిగింది.డీఇన్‌ఫ్లూయెన్సర్‌లు వోవర్‌–హైప్‌డ్‌ప్రాడక్ట్స్‌ను విమర్శించడమే కాదు చౌక ధరల్లో లభించే వాటి గురించి చెబుతున్నారు.

యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలోని వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ప్రోఫెసర్‌ అయిన అమెరికస్‌ రీడ్‌ ఇలా అంటున్నారు...‘ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో ఎక్కువమంది సాధికారికంగా మాట్లాడడం లేదేమో అనే భావన కస్టమర్‌లలో వచ్చింది. డబ్బులు ఇస్తారు కాబట్టి సంబంధితప్రాడక్ట్‌ను ప్రమోట్‌ చేస్తారు. నిజానిజాల గురించి వారికి అవసరం లేదు. ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో డీఇన్‌ఫ్లుయెన్సరే నయం అనుకుంటున్నారు. నిజానికి డీఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా ఇన్‌ఫ్లుయెన్సరే’ కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఈ ట్రెండ్‌కు ‘యాంటీ క్యాపిటలిస్ట్‌’ ట్రెండ్‌గా నామకరణం చేశారు.

డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌ ట్రెండ్‌ వల్ల వృథా ఖర్చులు తగ్గుతాయని, వేలం వెర్రికి అడ్డుకట్టపడుతుందని,  పర్యావరణ కోణంలో కూడా ఈ ట్రెండ్‌ వల్ల మేలు జరుగుతుందని యువతరంలో ఎంతోమంది బలంగా వాదిస్తున్నారు. తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలలో ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌’ ట్రెండ్‌పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి.డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌కు  విషయ సాధికారత, నిజాయితీ అనేవి కీలకం. అయితే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌’ రూపంలో సూడో–అథెంటిసిటీ ముందుకు వస్తుందని, ఈ ట్రెండ్‌ను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే విమర్శ ఉంది.

‘ఈ ట్రెండ్‌ కాస్త చివరికి ఎలా మారుతుందంటే ఇది కొనవద్దు. మీరు కొనాల్సింది అది అన్నట్లుగా!’ అంటుంది 26 సంవత్సరాల అమెరికన్‌ ఇన్‌ఫ్లు్లయెన్సర్‌ జెస్సిక.
‘ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చెప్పగానే కస్టమర్‌ల అభిప్రాయాలు రాత్రికి రాత్రి మారిపోవు. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కేవలం సలహా ఇస్తారు. అంతే. ఏది కొనాలి, ఏది కొనకూడదు అనే స్వీయవిచక్షణ కస్టమర్‌లలో ఉంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా మేము పారదర్శకంగా, నిజాయితీగా ఉంటాం’ అంటుంది ఫ్రాన్స్‌కు చెందిన ఇన్‌ఫ్లున్సర్‌ కోలిన్‌. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4,00,000 ఫాలోవర్స్‌ ఉన్నారు.

ప్రస్తుతం డీఇన్‌ఫ్లుయెన్సింగ్‌ ట్రెండ్‌ హెల్త్, ఫైనాన్స్, లైఫ్‌స్టైల్‌ విభాగాలలో ఎక్కువగా కనిపిస్తుంది.‘డీఇన్‌ఫ్లూయెన్సింగ్‌ అనేది వాపా బలుపా?’ అనేది పక్కన పెడితే ఈ ట్రెండ్‌ మూలంగా ఇన్‌ఫ్లుయెన్సర్‌లుప్రాఫిట్‌కు మాత్రమే కాదు మెరిట్‌కు కూడాప్రాధాన్యత ఇచ్చే ధోరణి, జవాబుదారీతనం పెరుగుతుంది.

సమస్య ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కాదు. కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అనుసరిస్తున్న ధోరణి. వారిలో మార్పు రావాలి. సామాజిక బాధ్యత పెరగాలి. యువతలో అశాంతి, ఆందోళన రేకెత్తించే కంటెంట్‌కు దూరంగా ఉండాలి.– హిమాద్రి పటేల్, డిజిటల్‌ క్రియేటర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement