సూర్య జయంతిని 'రథ సప్తమి' అని ఎందుకంటారు? | Ratha Saptami Is Also Known As Magha Saptami History And Significance | Sakshi
Sakshi News home page

సూర్య జయంతిని 'రథ సప్తమి' అని ఎందుకంటారు? రథానికి ఉన్న ప్రత్యేకత ఏంటీ?

Published Fri, Feb 16 2024 10:22 AM | Last Updated on Fri, Feb 16 2024 12:25 PM

Ratha Saptami Is Also Known As Magha Saptami History And Significance - Sakshi

భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగుతున్నాయి. హిందూ సంప్రదాయంలో సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడి జన్మించిన రోజే ఈ రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది.

మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూ పంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతి దినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. ఈ విశ్వంలో కేవలము శ్రీ సూర్య నారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణములు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన, ఏడు గుఱ్ఱములతో లాగబడుతున్న, అనూరువైన సారథితో నడపబడుతున్న రథమెక్కి అంతరిక్షంలో మన మాంసనేత్రముతో చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథము ప్రత్యేకతను తెలియజేస్తూ, సప్తమి తిథిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టిన రోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని “రథసప్తమి” పేరుతో జరుపుకుంటున్నాము.

సూర్య రథానికి ఉన్న ప్రత్యేకతలు..
కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది. ఇది మామూలు రథంకాదు. దీనికి ఒక్కటే చక్రం. తొడల నుండి క్రిందభాగం లేని 'అనూరుడు' రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏ మాత్రమూ నిలిచే ఆధారంలేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి. సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది ఆయన సారథీ అంతే... కాళ్ళున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్లవచ్చు. కానీ వికలాంగుడైన అనూరుడు అలా చెయ్యలేడు. కాళ్ళు లేకపోవడంవల్ల అతడు మనపాలిట వరం అయ్యాడు.

సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులంటారు. ఇవన్నీ వేదఛందస్సులు. అవి 1. గాయత్రి, 2. త్రిష్టుప్, 3. జగతి అనుష్టుప్, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్ అనేవి. వాటికి ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం సూర్యుని ఏడుగుర్రాలూ 7 రకాల కాంతి కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయి కనుక సూర్యకిరణాల్లో 7 రంగులుంటాయి. సప్త వర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్త కిరణాలను – సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్రసు, సావరాడ్వసు అంటారు. రథసప్తమి రోజున ఈ సప్త వర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి. సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు. మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే.. దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది.

సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశామాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు.

అందుకే మనల్ని భారతీయులని పిలుస్తారు..
భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి, పితృ, దేవరుషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. 'భా” అంటే సూర్యకాంతి. “కతి" అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించువారందరూ భారతీయులు. 'భారతీ” అంటే వేదమాత. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే ‘యోపం పుష్పం వేదా, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి’ అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి.

సాంబుడు నిర్మించని కోణార్క్‌ దేవాలయం
శ్రీకృష్ణుని కుమారుడు సాంబునికి మహర్షి శాపం వల్ల కుష్ఠు రోగం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సూర్యభగవానుని ఆరాధించమనీ, రోగం నయమౌతుందనీ చెప్తాడు. సాంబుడు భక్తితో చంద్రభాగా నదీతీరాన వేపవృక్షాల మధ్యలో ఉంటూ సూర్యారాధన చేశాడు. జబ్బు పూర్తిగా తగ్గిపోయాక కృతజ్ఞతతో కోణార్క్లో అద్భుతమైన సూర్యాలయాన్ని నిర్మించి సూర్య నారాయణుని ప్రతిష్టించాడు. ఎందరో ఈ దేవాలయాన్ని పాడుచెయ్యాలని ప్రయత్నించినా, కోణార్క్ దేవాలయం నేటికీ అత్యంత ఆకర్షణీయంగా అలరారుతున్నది.

దేవేంద్రుడి నిర్మించిన అరసవెల్లి దేవాలయం
ఒకసారి దేవేంద్రుడు పరమేశ్వర దర్శనానికి వెళతాడు. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు దేవేంద్రుని లోపలికి వెళ్ళద్దంటాడు. అతని మాట వినకుండా శివదర్శనానికి వెళ్ళబోయిన ఇంద్రుడిని నందీశ్వరుడు తంతాడు. ఒక్క తాపుతో ఎగిరిపడి ఒళ్ళంతా దెబ్బలతో బాధ పడుతుంటే, ఇంద్రునికి సూర్యారాధన చేస్తే బాధ పోతుందని కల వస్తుంది. అప్పుడు దేవేంద్రుడు నిర్మించి, ప్రతిష్ఠించినదే అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయము. అత్యంత మనోహరంగా కనిపించే శ్రీ సూర్య నారాయణ స్వామి పాదాలను సూర్య కిరణాలు తాకటాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. 

సూర్యారాధన చేసినవారు..
ఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చెప్తారు. శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్నిపొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. సూర్య నారాయణ స్వామిని నిత్యము ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పనాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును.

సప్తమి రోజున షష్టి తిథి ఉంటే కనుక షష్టి సప్తమి తిథులను పద్మము అని అంటారు. ఈ పద్మము సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం. ఆ సమయంలో జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకుని, రెండు భుజాలపైన రేగు పండ్లు పెట్టుకుని స్నానం చేస్తే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని చెబుతున్నారు. రేగి పండుని సూర్యభగవానుడికి ప్రతీకగా భావిస్తారు. ‘సూర్యునికి అర్కః అని పేరు’. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే.. జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి.. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది.. అనేక చర్మ రోగాలను నివారిస్తుంది. ఎన్నో ప్రయోజనాలున్న ఈ సూర్యరాధనను తప్పక చేసి ఆయురారోగ్యాలను పొందండి. 

(చదవండి: గ్రీకులు, రోమన్లు సరస్వతి దేవిని పూజించేవారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement