నాకిప్పుడు మూడో నెల. బరువు 96 కేజీలు. మూడో కాన్పు. మొదటి రెండు కాన్పులు సిజేరియనే. రెండో కాన్పు అప్పుడు అనెస్తీషియా రిస్క్ ఎక్కువగా ఉండింది. ఈసారి ఆ రిస్క్ లేకుండా ఏం చేయాలో దయచేసి చెప్పగలరు.
– రమణి విశ్వం, పిడుగురాళ్ల
మీ ఎత్తు, బరువును బట్టి బాడీ మాస్ ఇండెక్స్.. బీఎమ్‌ఐని కాలిక్యులేట్ చేస్తారు. బాడీ మాస్ ఇండెక్స్ సాధారణంగా 20– 25 మధ్య ఉంటే ప్రెగ్నెన్సీ, ప్రసవమప్పుడు సమస్యలు తక్కువగా ఉంటాయి. బీఎమ్‌ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ, అనెస్తీషియా, రికవరీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే 5–10 శాతం బరువు తగ్గితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పడు మీకు మూడోనెల అంటున్నారు కాబట్టి మీ బీఎమ్‌ఐ కాలిక్యులేట్ చేసి 30 కన్నా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ, బీపీ, సుగర్ వంటి పరీక్షలన్నీ చేసి.. ఫలితాలను నిర్ధారించి.. ప్రెగ్నెన్సీలోనే రక్తం పలుచబడడానికి మాత్రలు స్టార్ట్ చేస్తారు.
దీనివల్ల మీకు డెలివరీ.. సర్జరీ సమయంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. మల్టీవిటమిన్స్, విటమిన్ డీ3, కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు. అంతేకాదు ప్రెగ్నెన్సీ సమయంలో క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలూ నేర్పిస్తారు. మీరు నిర్ధారిత బరువుకు రావడానికి డైట్ కౌన్సెలింగ్‌కీ వెళ్లాలి. లెగ్ మజిల్ మూవ్‌మెంట్ ఎక్సర్‌సైజెస్, మసాజ్‌లను సూచిస్తారు. కంప్రెషన్ స్టాకింగ్స్ అనే సాక్స్‌లను కాళ్లకు వేసుకోవాలి. ప్రసవం తరువాత మీ బరువును బట్టి రక్తం పలుచబడడానికి వారం నుంచి పది రోజుల దాకా ఇంజెక్షన్స్‌ను ఇస్తారు.
దీనివల్ల ఛాతీ, కాళ్లలో బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. అనెస్తీషియా రిస్క్ కూడా తగ్గుతుంది. పూర్తి శరీరానికి ఇచ్చే జనరల్ అనెస్తీషియాకన్నా కూడా నడుముకు ఇచ్చే రీజనల్ అనెస్తీషియాలోనే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అధిక బరువు ఉన్న వారిలో మెడలో ఉండే థిక్‌నెస్ వల్ల శ్వాస సంబంధమైన, స్లీప్ ఆప్నియా సమస్యలు తలెత్తుతాయి. ఇవి జనరల్ అనెస్తీషియాలో ఇబ్బందులు కలిగిస్తాయి.
ఏ అనెస్తీషియా ఇవ్వాలి అనేది తొమ్మిదవ నెలలోనే అనెస్తెటిస్ట్ (మత్తు డాక్టర్) చూసి కౌన్సెల్ చేస్తారు. అధిక బీఎమ్‌ఐలో ఆక్సిజన్ అవసరాలు పెరుగుతాయి. అనెస్తీషియా సమయంలో ఆ జాగ్రత్త తీసుకుంటారు. బీఎమ్‌ఐ అధికంగా ఉంటే కొన్ని పెయిన్ రిలీఫ్ మందులు సరిగా పనిచేయవు. హైరిస్క్ అనెస్తీషియా టీమ్ ఈ విషయాలను గమనించి.. అనెస్తీషియా తర్వాత సమస్యలు రాకుండా చూస్తుంది. మీరు పౌష్టికాహారం తీసుకుంటూ.. తగిన వ్యాయామం చేస్తూ క్రమం తప్పకుండా చెకప్స్‌కి వెళుతూ.. ఈసారి ప్రసవమప్పుడు రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.
డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..)
Comments
Please login to add a commentAdd a comment