మల్లెలు, గులాబీల మధ్య ఎప్పుడూ ఒక సన్నజాజి పువ్వు ఉంటుంది. కోకిలలు, మైనాల మధ్య పేరును పట్టించుకోని ఒక పిట్ట గానం ఉంటుంది. పూజలు చేయ పూలు తెచ్చాను... విధి చేయు వింతలెన్నో... ఇన్ని రాశుల యునికి... తెలిమంచు కరిగింది తలుపు తీయరా... ఇన్ని పాటలతో వాణి జయరామ్ తెలుగు ప్రేక్షకులతో ఎన్నెన్నో జన్మల బంధం వేశారు.
చెన్నైలో చదువుకుని, హైదరాబాద్‌లో బ్యాంక్ ఉద్యోగం చేసిన వాణి జయరాం తెలుగువారి ఇష్టగాయనిగా మారి దశాబ్దాలు అవుతోంది. నవంబర్ 30న ఆమెకు 75 నిండుతాయి. ప్రతి వసంతంలోనూ పాటల కొమ్మలను విస్తరించుకుంటూ వెళ్లిన ఈ నిరాడంబర వృక్షం తల ఎత్తి చూడదగ్గది. ఈ సందర్భాన తలుచుకోదగ్గది.
రేడియో సిలోన్‌లో బినాకా గీత్‌మాలా ఊపేస్తోంది. అమిన్ సయానీ మొదలెట్టిన షో ప్రతి వారం హిందీలో విడుదలైన జనరంజకమైన పాటల్ని ప్లే చేసి టాప్ లిస్ట్‌ను ఇస్తూ ఉంటుంది. మేల్ సింగర్స్ అయితే దాదాపుగా రఫీ ఉంటాడు. ఫిమేల్ సింగర్స్ అయితే లతా మంగేష్కర్ సింహాసనం వేసుకుని కూచుని ఉంటుంది. అలాంటి షోలో ఒకవారం అయినా తమ పాట వినపడాలని ప్రతి గాయని, గీత కర్తా, సంగీత దర్శకుడు భావిస్తున్న సమయాన ఒక మద్రాసు అమ్మాయి హిందీలో ఒక పాట పాడింది.
ఆ పాట ఆ అమ్మాయికి మొదటి పాట. అది బయటకు విడుదల అయ్యింది. లతా కాకుండా, ఆశా భోంస్లే కాకుండా హిందీలో మరొకరు, అందునా ఒక సౌత్ అమ్మాయి పాడటమా అని జనానికి వింత. అది బినాకాకు ఎక్కడం మరీ వింత. ఒక వారం కాదు రెండు వారాలు కాదు 16 వారాలు ఆ పాట చార్ట్ బస్టర్‌గా నిలవడం ఇంకా వింత. ఆ వింతను సాధించిన గాయని వాణి జయరామ్. బాలీవుడ్ ఎగిరిన తొలి దక్షిణాది గాన పతాక. ఆ సినిమా ‘గుడ్డి’. ఆ పాట ‘బోల్‌రే పపీ హరా’.
అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుదని అంటారు పెద్దలు. ఎదిగే బుద్ధి ఉన్న వారు మౌనంగా ఉంటారని కూడా అంటారు. వాణి జయరామ్‌కు సంగీతం ఎంత తెలుసో చాలామందికి తెలియదు. ఆమె ఎప్పుడూ పెద్దగా చెప్పుకోదు. కాని పాటను సాంతం తన చేతిలోకి తీసుకున్నట్టుగా ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె తల్లి గాయని. తమిళనాడులోని వేలూరులో తన 9 మంది సంతానంలో ఐదవ బాలికగా జన్మించి వాణిలో ఆమె సంగీతాన్ని పసిగట్టింది.
ఐదేళ్లకే వాణి కీర్తనలు పాడేది. చెదరకుండా ఆలాపన కొనసాగించేది. నేను అంతగా సక్సెస్ చూడలేకపోయాను నా కూతురైనా చూడాలి అని వాణికి పదేళ్లు వచ్చేసరికి కుటుంబాన్ని మద్రాసుకు మార్చిందామె. అక్కడే వాణి క్లాసికల్ గురుముఖతా నేర్చుకుంది. మరో ఒకటి రెండేళ్లకే మూడు గంటల కచేరీ ఇవ్వడం కూడా మొదలెట్టింది. మద్రాసులోని మహా సంగీతకారుల దగ్గర వాణి పాఠాలు నేర్చుకుని వచ్చిన విద్యను ఆడంబరంగా ప్రదర్శించరాదని గ్రహించి వినయంగా ఉండటం నేర్చుకుంది.
వాణి చాలా చురుకైన స్టూడెంట్. మద్రాసులో బి.ఏ ఎకనామిక్స్ చేసింది. ఎన్నడూ ఏమీ మాట్లాడనట్టుగా కనిపించే ఆమె కాలేజీలో డిబేట్స్ కోసం వేదిక ఎక్కితే అవతలి పక్షం ఓటమి అంగీకరించి నోరు మెదపక దిగిపోయేది. చదువులో టాపర్ అయిన వాణికి స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఏదో కచేరిలో పాడుతుంటే చూసిన ఒకామె ఈమె నా కోడలు అని నిశ్చయించుకుని తన కుమారుడు జయరామ్‌ను ఆమెకు భర్తగా ఇచ్చింది. వాణి కొన్నాళ్లు హైదరాబాద్‌లో కూడా ఉద్యోగం చేసి ఆ తర్వాత ముంబై ట్రాన్స్‌ఫర్ అయితే ముంబైకి వెళ్లింది. అక్కడే ఆమె గాయనిగా మొదటిసారి వెలిగింది.
వాణి భర్త జయరామ్‌కు సంగీతప్రియుడు. ఆయనకు సితార్ వాదన తెలుసు. ‘వాణి జయరామ్’గా మారిన భార్యకు హిందూస్తానీ కూడా వచ్చి ఉంటే బాగుంటుందని అక్కడే ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ ఖాన్ దగ్గర సంగీత పాఠాలకు పెట్టాడు. ఉస్తాద్ ఆమె పాటలు విని అమ్మా... ఇంకా ఆ దండగమారి బ్యాంకు ఉద్యోగం ఎందుకు... బంగారం లాంటి నీ గొంతు ఉండగా అని సంగీతం నేర్పించి, సంగీత దర్శకుడు వన్‌రాజ్ భాటియాకు ఆమెను పరిచయం చేశాడు. వన్‌రాజ్ భాటియా అప్పుడే తాను సంగీతం చేస్తున్న ‘గుడ్డి’ సినిమా కోసం దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ, రచయిత గుల్జార్‌లను వాణి జయరామ్ తొలి పరిచయానికి ఒప్పించాడు. అలా వాణి జయరామ్ దేశానికి ఒక ప్రభాత గీతంగా, భక్తి గీతంగా దేశానికి తెలిసింది.
కాని లతా మంగేశ్కర్, ఆశా భోంస్లే కెరీర్‌లో పోటాపోటీగా ఉన్న సమయంలో మరో చెల్లెలు ఇలా ప్రత్యక్షం కావడం అంత ప్రసన్నం కలిగించే విషయంగా భావించలేకపోయారు. సంగీత దర్శకుల, గాయకుల లాబీలో గొప్ప ప్రతిభ ఉన్నా అక్కడ వాణి జయరామ్ నిలువలేకపోయింది. పోనీ.. ఈ గంధం దక్షణాది గడపలకే సొంతమని విధి రాసి పెట్టి ఉందేమో మద్రాసుకు వచ్చేసింది. అటు పిమ్మట వాణి జయరామ్ గొంతు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పాలు కలిపిన మామిడి పండు రసం రుచిని పాటలలో పంచింది.
ఎస్.పి.బాలూకు పాడే అవకాశం ఇచ్చిన కోదండపాణీయే ‘అభిమానవంతులు’ సినిమాతో వాణి జయరామ్‌కు తొలి అవకాశం ఇచ్చాడు. కాని ఈ గొంతు గాన పూజకు వచ్చిందని ‘పూజ’ సినిమాయే తెలుగు ప్రేక్షకులకు చెప్పింది. రాజన్ – నాగేంద్ర చేసిన ‘పూజ’ పాటలు తెలుగు దేశాన మోగిపోయాయి. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ పాటను ప్రతి ఉదయం నాష్టా పొయ్యి మీద పెడుతూ, మధ్యాహ్నం భోజనాలు వడ్డిస్తూ, రాత్రిళ్లు పిల్లలకు పక్కలు సిద్ధం చేస్తూ ఇల్లాళ్లు వేలాదిసార్లు విన్నారు. వింటున్నారు. ఆ సినిమాలోని ‘నింగి నేలా ఒకటాయెనే’, ‘పూజలు చేయ పూలు తెచ్చాను’... పాటలూ వాణి జయరామ్ గొంతు గిరాకీని శ్రోతల్లో పెంచాయి.
అయితే తెలుగులో ఆమె ప్రవేశం, కొనసాగింపు స్థిరంగా లేదు. సుశీల, జానకీ ‘హీరోయిన్ల గొంతు’గా స్థిరపడి ఉన్నారు. వారిని దాటి వాణి జయరామ్‌కు చోటు దొరకడం అన్నిసార్లు జరిగేది కాదు. కాని జరిగిన ప్రతిసారీ చిన్న చిరునవ్వుతో, గోరింటాకు పెట్టుకుని పండిన ఎడమ చేతిని ఊపుతూ పాడి మార్కులు ఎగరేసుకొని పోయేది. ‘ఈ రోజు మంచి రోజు’ (ప్రేమ లేఖలు), ‘విధి చేయు వింతలెన్నో’ (మరో చరిత్ర), ‘నువ్వు వస్తావని బృందావని’ (మల్లెపూవు), ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే’ (మొరటోడు), ‘నీలి మేఘమా జాలి చూపుమా’ (అమ్మాయిల శపథం), ‘సీతే రాముడి కట్నం’ (మగధీరుడు)... ఈ పాటలన్నీ సిగన మల్లెలు ముడుచుకున్న వనితలా గుమగుమలాడుతూ భావతరంగాల కిందా మీదకు కారణమయ్యేవి.
వాణి జయరామ్ గొంతులోని విశిష్టత ఏమిటంటే అది స్త్రీలకూ సరిపోయేది. యంగ్ అడల్ట్స్‌కూ సరిపోయేది. ఇది గమనించిన దర్శకుడు కె.విశ్వనాథ్ ‘శంకరాభరణం’, ‘స్వాతికిరణం’, ‘శృతిలయలు’ సినిమాలలో ఆమె గొంతును సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఆ సినిమాలకు ఆమె గొంతు కేవలం పాటగా మాత్రమే కాదు కథాబలంగా కూడా ఉపయోగపడింది. ‘శంకరాభరణం’లో ‘బ్రోచే వారెవరురా’, ‘మానస సంచరరే’, ‘ఏ తీరుగ నను దయ చూసెదవో’.. ఈ పాటలన్నీ ఆమెకు అవార్డులు తెచ్చి పెట్టాయి. ‘స్వాతి కిరణం’లో మాస్టర్ మంజునాథ్‌కు మేచ్ అయ్యేలా వాణి జయరామ్ పాడిన ‘తెలి మంచు కరిగింది’, ‘ఆనతినీయరా’, ‘ప్రణతి ప్రణతి ప్రణతి’, ‘కొండ కోనల్లో లోయల్లో’... అద్భుతం. పునరావృతం లేని కళ అది.
వాణి జయరామ్ గొంతు భిన్న సందర్భాల పాటగా వెలిగింది. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా’ (వయసు పిలిచింది), ‘మిన్నేటి సూరీడు వచ్చెను మా పల్లె’ (సీతాకోకచిలుక), ‘నేనా పాడనా పాట’ (గుప్పెడు మనసు), గీతా ఓ గీతా (శివమెత్తిన సత్యం)... వీటన్నింటికి గట్టి అభిమానులు ఉన్నారు. స్ట్రయిట్ పాటలే కాదు తెలుగు డబ్బింగ్ గీతాలు కూడా వాణి జయరామ్‌ను తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంచాయ్. ఆమె పాడిన ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ) చిత్రలహరిలో జనం వేయిసార్లు చూశారు.
వాణి జయరామ్ సింపుల్‌గా ఉండటమే ఘనత అని నమ్ముతారు. ఆమెకు చాలా భాషలు వచ్చు. కవిత్వం రాస్తారు. భజనలు రాస్తారు. సినిమా కథలు కూడా తయారు చేస్తారు. ఆమె జగతితో తానుగా కాక పాటతో సంభాషించాలని కోరుకుంటారు.
తీయటి గాయని వాణి జయరామ్ పాటకు ప్రత్యక్షంగా సేవ చేసి పరోక్షంగా మానవ స్వాంతనకు దోహదపడ్డారు. ఆమె 75 ఏళ్లు నిండిన సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. హృదయాలను సంగీతమయం చేస్తూనే ఉండమని కోరుకోవాలి.
దొరకునా ఇటువంటి సేవ..నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ...– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment